AP BJP Yatra : ప్రభుత్వంపై ఏపీ బీజేపీ పోరుబాట - సీమలో యువ సంఘర్షణ యాత్ర !
ఏపీలో ప్రభుత్వంపై పోరాటం ద్వారా బలపడాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. యువతను ఆకట్టుకునేలా పలు కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు.
AP BJP Yatra : ఆంధ్రప్రదేశ్ బీజేపీ యాక్టివ్ అవుతోంది. యువ సంఘర్షణ యాత్ర పేరుతో యాత్రలు చేయాలని నిర్ణయించుకుంది. తిరుపతి నుంచి కర్నూలు వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ఆగస్టు 2వ తేదీన తిరుపతిలో లాంఛనంగా ఈ సంఘర్షణ యాత్రను ప్రారంభించనుంది. ప్రారంభ కార్యక్రమానికి బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు తేజస్వి సూర్య హాజరు కానున్నారు. ఆయనే దీన్ని ప్రారంభిస్తారు. ఆయనతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. [
తిరుపతి నుండి కర్నూలు వరకు !
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) July 30, 2022
రాష్ట్ర లోనిరోద్యోగ యువతను దగా చేసిన వైసీపీ ప్రభుత్వం పై @BJYM4Andhra సమర శంఖం .
ఆగష్టు 2 నుండి 12 వరకు చేపట్టిన యువ సంఘర్షణ యాత్ర ! #YuvaSangharshanaYatra #BJP pic.twitter.com/4WzDW90813
యువతను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందన్న విష్ణువర్థన్ రెడ్డి
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కిందని, నిరుద్యోగ యువతను ప్రభుత్వం దగా చేసిందని మండిపడుతోంది. నిరుద్యోగ యువత భవిష్యత్‌ను ఉద్దేశపూరకంగానే నాశనం చేస్తోందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగ నియామకాలను తక్షణమే అమలు చేయాలనేది బీజేవైఎం ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్‌తో ఇక తాము ప్రజల్లోకి వెళ్తామని బీజేపీ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు.
ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం
ప్రత్యేక హోదా పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని వివరించారు. తమకు ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజీ చాలంటూ 2017లో అప్పటి ప్రభుత్వం అంగీకరించిందని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా గురించి జగన్ సర్కార్ మభ్యపెడుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా వాస్తవాలను ప్రజలకు చెప్పాలన్నారు.
యువ నేతలకు దిశానిర్దేశం చేస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి
ప్రభుత్వంపై పోరాటం ద్వారా బీజేపీని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువ నేతలు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఈ విషయంలో మరింత దూకుడుగా ఉంటున్నారు. యువ బీజేపీ నేతలకు దిశానిర్దేసం చేస్తున్నారు. యాత్ర విషయంలోనూ ఆయనే కీలకంగా వ్యవహరిస్తున్నారు.