BRS Entri In AP Fail : స్టీల్ ప్లాంట్ ప్లాన్ రివర్స్ - ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి పరిస్థితులు కలిసి రావట్లేదా ?
ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి పరిస్థితులు కలసి రావడం లేదా ?విశాఖలో పెట్టాలనుకున్న సభ ఇక కష్టమేనా ?స్టీల్ ప్లాంట్ బిడ్ ప్రయోగం విఫలమయిందా ?
BRS Entri In AP Fail : విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం పేరుతో ఏపీలో అడుగు పెట్టాలనుకున్న భారత రాష్ట్ర సమితి పరిస్థితులు అనుకూలించలేదు. ప్రైవేటీకరణను తాత్కలికంగా పక్కన పెట్టామన్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ప్రకటనతో విశాఖలో విజయోత్సవాల పేరుతో భారీసభ నిర్వహించాలని అనుకున్నారు. కానీ రెండు రోజులకే అది తేలిపోయింది. ఇప్పుడు బిడ్ కూడా వేయలేకపోయారు. దీంతో స్టీల్ ప్లాంట్ కార్మికసంఘ నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐకి బిడ్ ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏపీలో బహిరంగసభ పెట్టాలనుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఆదిలోనే హంసపాదు ఎదురయినట్లు అయింది.
ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు కలసి రాని పరిస్థితులు !
బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన తర్వాత తెలంగాణతో పాటు ఏపీలోనూ బలంగా మార్చాలనుకున్నారు. సీఎం కేసీఆర్ చాలా మంది సీనియర్ నేతలను సంప్రదించారు. కానీ ఒక్కరూ కూడా ఆసక్తి చూపించలేదు. చివరికి ప్రధాన పార్టీల తరపున మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి మూడు సార్లూ ఓడిపోయిన తోట చంద్రశేఖర్ ను రంగంలోకి తెచ్చారు. అయితే కేసీఆర్ దృష్టి అంతా సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ మీద ఉంది. ఆయనతో చర్చలు కూడా జరిపారు. అయితే బీఆర్ఎస్‌కు ఏపీలో ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆయన ఆలోచిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉపయోగపడుతుందనే పరిస్థితులు వచ్చాయి. బిడ్ వేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించినప్పుడు మొదట లక్ష్మినారాయణే కేసీఆర్ ను పొగిడారు. కానీ ఇప్పుడు బిడ్ వేయకపోవడంతో ఆయన కూడా బీఆర్ఎస్‌లో చేరికపై ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఏపీలో బహిరంగసభ పెట్టగలరా?
తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం గంభీరంగా ఉంది. అన్ని పార్టీలు పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వచ్చాయి. వచ్చే నవంబర్, డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఇంకా గట్టిగా ఆరు నెలల సమయం కూడా లేదు. ఇలాంటి సమయంలో కేసీఆర్ ఆంధ్రాలో పార్టీ కోసం.. తెలంగాణను నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు. ఏపీ స్టీల్ ప్లాంట్ కోసం బిడ్ వేస్తే తెలంగాణలో యాంటీ సెంటిమెంట్ పెరుగుతుదంన్న ఆందోళనతోనే కేసీఆర్ వెనక్కి తగ్గారన్న ప్రచారం ఉంది. వేల కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ కు పెట్టే బదులు తెరిపిస్తామని తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన తెలంగాణ పరిశ్రమల్ని తెరిపించాలి కదా అన్న ప్రశ్న ప్రధానంగా వస్తుంది. ఇది బీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా మారుతుంది.అందుకే వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఈ కారణంతో బహిరంగసభ పెట్టడం కష్టమే.
తెలంగాణ ఎన్నికల తర్వాతే ఏపీపై దృష్టి పెడతారా ?
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చినప్పటికీ.. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఇంకా దృష్టి పెట్టలేదు. మహారాష్ట్రలో మాత్రం వరుసగా మూడు సభలు పెడుతున్నారు. ఇతర రాష్ట్రాలను పట్టించుకోవడం లేదు. ఎన్నికలు ఉన్న కర్ణాటకపై అసలు దృష్టి పెట్టలేదు. ఏపీ, ఒడిషాలకు ఇంచార్జుల్ని నియమించినప్పటికీ ఎలాంటి కార్యకలాపాలు లేవు. తెలంగాణలో మూడో విజయం సాధిస్తే వచ్చే పాజిటివ్ ఇమేజ్‌తో.. ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.