AP Death Politics : కందుకూరు ఘటనపై రాజకీయ దుమారం - నేతలు మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నారా?
ఏపీ రాజకీయ నేతలు రాజకీయ విమర్శలకు ఉన్న నైతిక విలువలన్నీ వదిలేస్తున్నారా ? కందుకూరు దుర్ఘటన కేంద్రంగా జరుగుతున్న రాజకీయం దేనికి సంకేతం ?
AP Death Politics : ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో పెను విషాదం చోటు చేసుకుంది. ఎనిమిది మంది చనిపోయారు. ఇప్పుడు ఆ ఘటనపై ఏపీ రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు రోజంతా చంద్రబాబుదే తప్పని అంటున్నారు. టీడీపీ నేతలు ఇంకా ఎలాంటి ఎదురుదాడి నేరుగా చేయలేదు కానీ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం గతంలో.. జగన్ పర్యటనల్లో పోయిన ప్రాణాలు..ఆయన స్పందించకపోవడం గురించి పోస్టులు పెడుతున్నారు. టీడీపీ కూడా ఎదురుదాడి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఏపీ రాజకీయాల్లో పార్టీలు రాజకీయ లబ్ది కోసం శవరాజకీయాలకూ పాల్పడుతున్నాయన్న విమర్శలు సామాన్యుల నుంచి రావడానికి కారణం అవుతోంది.
చంద్రబాబుది ప్రచార పిచ్చంటూ వైఎస్ఆర్‌సీపీ నేతల ఆరోపణలు
చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో సందు గొందుల్లో రోడ్ షో నిర్వహించారని వైసీపీ నేతల ఆరోపిస్తున్నారు. అంత మంది జనం వస్తారని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఊహించలేకపోయారు. ఒక్క సారిగా ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత పరిస్థితి చూసి చంద్రబాబు కూడా ఆందోళన చెందారు. పక్కనే కాలువ ఉందని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు కూడా చేశారు. అయినా దుర్ఘటన జరిగిపోయింది. రాజకీయపార్టీ బహిరంగసభ నిర్వహించే ప్రదేశం, అక్కడి పరిస్థితులు రద్దీని తట్టుకునేలా ఉండాలి. పార్టీపరంగా దానికి తగ్గ ఏర్పాట్లు జరగాల్సి ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు కానీ... అధికార యంత్రాంగం కానీ.. ప్రజలు కాలువ పక్కన నిలబడితే ప్రమాదం జరుగుతుందని ముందే ఊహించి అక్కడ అడ్డుగా బ్యారికేడ్లనో, కర్రలతో అడ్డుగా కట్టే ప్రయత్నం చేయలేదు. అధికార యంత్రాంగం పర్యవేక్షణాలోపం ఉన్నా అధినేత వచ్చినప్పుడు పార్టీ యంత్రాంగం కాస్త ముందు జాగ్రత్తచర్యలు చేపట్టి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అన్ని రాజకీయ పార్టీల స్పందన వేరు.. వైఎస్ఆర్‌సీపీ స్పందన వేరు !
కుందుకూరు దుర్ఘటన గురించి తెలిసిన తర్వాత దేశ వ్యాప్తంగా చాలా మంది స్పందించారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా స్పందించారు. చనిపోయిన టీడీపీ కార్యకర్తలు ఒక్కో కుటుంబానికి రూ. రెండు లక్షల సాయం ప్రకటించారు. గాయపడిన వారికి రూ. యాభై వేలు పరిహారం ప్రకటించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా స్పందించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ నేతలు కూడా స్పందించారు. ఎవరూ ఇలా రాజకీయాలు చేసే ప్రయత్నం చేయలేదు. దాన్నో దుర్ఘటనగానే భావించారు. ఆ మేరకు స్పందించారు. అయితే వైఎస్ఆర్‌సీపీ నేతలు మాత్రం మొదట.. సోషల్ మీడియాలో.. ఆ తర్వాత మీడియా ద్వారా దుర్ఘటనపై రాజకీయ విమర్శలు చేయడంతో వివాదం ప్రారంభమయింది. గతంలో జగన్ పర్యటనల్లో జరిగిన ప్రాణనష్టం గురించి తెలుగుదేశం పార్టీ ఎదురుదాడి చేయడం ప్రారంభించింది.
కార్యకర్తలకు ఎవరు అండగా ఉన్నారన్నదానిపైచర్చలు !
జగన్ పాదయాత్ర చేశారు. చాలా చోట్ల సభలు నిర్వహించారు. ఆయన పాదయాత్ర కాలంలో ఎనిమిది మంది తొక్కిసలాటల్లో చనిపోయారని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో గణాంకాలు విడుదల చేసింది. పాదయాత్ర ప్రారంభం రోజునే ఒకరు ఇడుపులపాయలో చనిపోయారు. ఇటీవల పార్టీ ప్లీనరీ నాగార్జున యూనివర్శిటీ ఎదుట నిర్వహిస్తున్నప్పుడు.. ఓ వాలంటీర్ బస్సు ప్రమాదంలో చనిపోయారు. జయహో బీసీ సదస్సులో భోజనాల దగ్గర ఓ బీసీ ప్రజాప్రతినిధి తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. నాలుగైదు రోజుల చికిత్స తర్వాత చనిపోయారు. అయితే వీరెవరికీ వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ అండగా లేరని.. తాము ఒక్కో కార్యకర్త కుటుంబానికి రూ. పాతిక లక్షల పరిహారం ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబాల బాధ్యత తీసుకుంటున్నామని టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.
రాజకీయాలకు కాస్తంత మానవత్వం ఉండొద్దా ?
రాజకీయ పార్టీలు జనం కోసమే రాజకీయాలు చేస్తాయి. ప్రభుత్వ విధానాలను ప్రతిపక్షాలు ప్రశ్నించాలి. తప్పులుంటే నిలదీయాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుంది. అదే సమయంలో ప్రతిపక్షం పై అధికార పార్టీ ఎదురుదాడి చేయవచ్చు . కానీ అది ప్రజాస్వామ్య బద్దంగా నైతిక విలువలకు లోబడి ఉండాలి...కానీ ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. దురదృష్టవశాత్తూ ఏపీ రాజకీయ పార్టీలు ఆ పంధాలోనే వెళ్తున్నాయని మరోసారి రుజువైందంటున్నారు విశ్లేషకులు.,