AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
NTR Bharosa Pension Scheme: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్లకు 13.65 లక్షల దరఖాస్తులు. ఆర్థిక భారం కారణంగా అనర్హుల ఏరివేత చేపడితే టీడీపీ కార్యకర్తల అసంతృప్తి గురయ్యే అవకాశం. ప్రభుత్వం ఏం చేయబోతోంది?

AP New Pensions Applications`: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పెంపుతో పాటు కొత్త పింఛన్ల మంజూరు అంశం అధికార కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ప్రభుత్వం కొత్త దరఖాస్తులను ఆహ్వానించడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13.65 లక్షల కంటే ఎక్కువ అప్లికేషన్లు వచ్చి పడ్డాయి. నెలకు ప్రాథమిక పింఛను మొత్తాన్నే రూ. 4,000కు పెంచడంతో, ప్రభుత్వ ఖజానాపై ఇప్పటికే ప్రతినెలా రూ. 2,700 కోట్లకు పైగా భారం పడుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు 14 లక్షలకు పైగా వచ్చిన కొత్త దరఖాస్తులన్నింటికీ ఆమోదం తెలిపి పింఛన్లు ఇవ్వడం అనేది నిధుల కొరతతో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఏమాత్రం సాధ్యంకాని పని.
అర్హులు కాని వారి పించన్లూ తొలగించలేదు!
మరోవైపు, గత వైకాపా ప్రభుత్వ హయాంలో అనర్హులకు భారీగా పింఛన్లు ఇచ్చారనే విమర్శలు ఉన్నప్పటికీ, వాటిని తొలగిస్తే రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత వస్తుందనే భయం ప్రభుత్వంలో కనిపిస్తోంది. లక్షలాది మంది పాత లబ్ధిదారుల పింఛన్లను ఒకేసారి రద్దు చేస్తే, లబ్ధిదారులు వీధిలోకి రావడం, ప్రతిపక్షాలు దానిని ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చుకోవడం ఖాయం. అందువల్ల పాత లబ్ధిదారుల విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. ఫలితంగా అనర్హుల పింఛన్లు కొసాగుతుండటం క్షేత్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
కొత్త పెన్షన్ల కోసం కూటమి కార్యకర్తల నుంచి ఒత్తిడి
ఈ పరిస్థితి అధికార పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. గతంలో ప్రత్యర్థి పార్టీకి మద్దతుగా ఉన్నవారికి పింఛన్లు అందుతున్నాయి.. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడిన మాకు, మా సానుభూతిపరులకు కొత్త పింఛన్లు రాకపోతే మేమేం చేయాలి? అని కూటమి కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. తమకు దక్కాల్సిన న్యాయం జరగకపోతే, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి సహకరించడం కష్టమని కిందిస్థాయి నాయకులు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామం శ్రేణులను ఏకం చేయడంలో స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లకు పెద్ద సమస్యగా పరిణమించింది. ఈ సంక్లిష్ట సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఆరంచెల తనిఖీ, డిజిటల్ ఫిల్టరేషన్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలనలో దాదాపు 1.42 లక్షల దరఖాస్తులను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే కారణంతో పక్కన పెట్టారు. భూమి పరిమితి, విద్యుత్ వాడకం, ఆదాయ పన్ను, నాలుగు చక్రాల వాహనాలు వంటి సాంకేతిక ప్రామాణికాలను కఠినతరం చేసి.. అర్హత లేని వారి దరఖాస్తులను సాంకేతిక కారణాలతో తిరస్కరించడం ద్వారా రాజకీయ కక్ష సాధింపు కాదు, నిబంధనల ప్రకారమే జరిగింది అని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది.
దశల వారీగా పెన్షన్లు ఇచ్చే ప్రయత్నం
అంతేకాకుండా, ఒకే విడతలో అందరికీ పింఛన్లు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి, దశలవారీగా మంజూరు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మొదటి విడతలో అత్యంత పేదలు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చి, మిగిలిన వారి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచడం ద్వారా తాత్కాలికంగా ఉపశమనం పొందాలని చూస్తోంది. అలాగే, పాత పింఛన్లలో తీవ్రమైన బోగస్, రీ-వెరిఫికేషన్‌లో తేలిన కొన్ని స్పష్టమైన అనర్హతల ఆధారంగా మాత్రమే తొలగింపులు చేపట్టి, ఆ ఖాళీలలో క్రమంగా కొత్త కార్యకర్తలు లేదా నిజమైన అర్హులను భర్తీ చేసే మార్గాన్ని అనుసరించే అవకాశం ఉంది. కొత్త పింఛన్ల అంశం ప్రభుత్వానికి ఒక వైపు ఆర్థిక భారాన్ని, మరోవైపు స్వపక్ష కార్యకర్తల ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. సాంకేతిక కారణాలతో ఫిల్టర్ చేయడం వల్ల తాత్కాలికంగా సమర్థించుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉన్న నిజమైన అర్హులు, పార్టీ కార్యకర్తలను సంతృప్తి పరచడం కూటమి నాయకత్వానికి పెద్ద పరిక్షే. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ 'పింఛన్ల చిక్కుముడి'ని ప్రభుత్వం ఎలా విప్పుతుందనేది ఆసక్తికరంగా మారింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















