Devineni Uma: వైసీపీ నేతలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు
వైసీపీ నేతలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారాని దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేసారు.
టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి సీఎం జగన్, వైసీపీ నేతలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. గత రెండు వారాలుగా చంద్రబాబును జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ... సీ ఓటర్ సర్వేలు టీడీపీకి అనుకూలంగా రావడంతో జగన్కు జ్వరం పట్టిందన్నారు. విభిన్న పార్టీలు, వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు చంద్రబాబుకు మద్దతు తెలపడంతో వైసీపీ నేతల్లో వనకు పుట్టిందని వెల్లడించారు.
73 సంవత్సరాల వయసులో ఇబ్బందులు....
73 సంవత్సరాల వయసులో చంద్రబాబుని ఇబ్బందులు పెడుతున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఒక రిమాండ్ ఖైది మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అర్ధరాత్రి కరెంటు తీస్తున్నారు. జైల్లో చంద్రబాబు ఏం చేస్తున్నారని రోజు తాడేపల్లి నుంచి జగన్ జైలు సీసీ టీవీ కెమెరాలో చూస్తూ సైకో ఆనందం పొందుతున్నారని చెప్పారు. తెలుగుజాతి 14 కోట్ల మంది ప్రజలు ఒక సైకో సీఎం చేతిలో నాశనం అవుతుందని, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారు, ప్రముఖులు మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
దేశంలో అతి తక్కువ ఖర్చుతో ఫైబర్ గ్రిడ్ ద్వారా కరెంట్ పోల్స్ కి వైర్లు వేసి అతి తక్కువ ఖర్చుతో ఇంటింటికి టీవీ, ఇంటర్నెట్ ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది అయితే... ఫైబర్ గ్రిడ్ పై మరో కేసు పెట్టి ఇరికించాలని జగన్ ప్రభుత్వం కుటీల ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ ధర్మం గెలుస్తుందని, న్యాయం జరుగుతుందని ఉమామహేశ్వరరావు చెప్పారు. చంద్రబాబు నాయుడు త్వరలో బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదన్నారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని తెలిపారు. ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న స్పందన చూసే అక్రమ కేసులు పెట్టారని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అక్రమ అరెస్టులు, కేసులకు టీడీపీ పార్టీ భయపడదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన కాకుండా పగలు ప్రతీకారాలు రాజ్యమేలుతున్నాయని వెల్లడించారు. చంద్రబాబు అరెస్టు చేసిన తీరు, ఆ తర్వాత వరుసగా కేసులు పెడుతున్న విధానం సరిగా లేదని చెప్పారు. కేవలం కక్ష సాధింపు కోసం ప్రైవేటు లాయర్లను పెట్టుకొని వాదించుకునే స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు వ్యక్తిత్వం చాలా గొప్పదని ఇలా అరెస్టు చేసి ఇబ్బంది పెట్టడం బాధాకరమన్నారు. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా తిరువూరు నియోజకవర్గ పరిధిలో రిలే నిరాహారదీక్షలు 9వ రోజుకు చేరాయి. SC సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షకు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలిపారు. దీక్ష చేస్తున్న నేతలకు దేవినేని ఉమ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం టీడీపీ నియోజకవర్గ కార్యాలయం నుంచి బాబుకు మేము సైతం అంటూ మద్దతుగా దేవినేని ఉమామహేశ్వరరావు, ఇన్‌ఛార్జ్ శావల దేవదత్, నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.