BJP In AP: ఏపీ రాజకీయాల్లో దూకుడు పెంచనున్న బీజేపీ- పొత్తులపై జాతీయ లీడర్లతోనే క్లారిటీ ఇచ్చేలా ప్లాన్
టీడీపీ, జనసేన పొత్తులకు సై అంటున్నాయి. మరి బీజేపీ ఏం చేయబోతుంది. పవన్ వదిలేస్తుందా... లేకుంటే టీడీపీని కులుపుకొని వెళ్తుందా. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు జాతీయ నాయకులను పిలవనున్నారు ఏపీ లీడర్స్
తరువాత ఏంటి..ఇదే ఇప్పుడు ఏపీ బీజేపి నేతలను తొలిచేస్తున్న ప్రశ్న...ఇప్పటి వరకు బీజేపీ అంతంత మాత్రంగా కార్యకలాపాలతో నెట్టుకొచ్చింది. మారుతున్న రాజకీయ పరిణామాలతో దూకుడు పెంచేందుకు ఆ పార్టీ శ్రేణులు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఎపీ అద్యక్షుడుగా ఉన్న వీర్రాజు మాత్రమే క్రియాశీలక కార్యకలాపాలుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అయితే జూన్ తరువాత నుంచి ఏపీలో కాషాయదళం దూకుడు పెంచుతుందని ఆపార్టీ నాయకులు చెబుతున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. వైసీపీ, టీడీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. తర్వాత స్థానం జనసేనదే. బీజేపి నేతలు చాలా తక్కువగా తెర మీదకు వస్తున్నారు. అద్యక్షుడుగా ఉన్న సొము వీర్రాజు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాల్లో పర్యటనలు చేస్తూ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారు. అదంతా చాలా స్లోగా సాగుతోందని పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు.
ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉండగానే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీటెక్కాయి. ప్రభుత్వం ఓటు చీలిపోకూడదంటూ టీడీపీ, జన సేన పొత్తు రాగం అందుకున్నాయి. వైసీపీ కూడా గడపగడపకు వైసీపీ అంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి సమయంలో బీజేపీ తీసుకోబోయే స్టెప్పేంటి అనే ప్రశ్న వినిపిస్తోంది.
జనసేనతో కలిసే ఉన్నామని బీజేపీ బాహాటంగా చెబుతున్నప్పటికీ కలిసి ఎలాంటి కార్యచరణ చేపట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిత్రపక్షంగా ఉన్న జనసేన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని ఇస్తున్న స్టేట్‌మెంట్స్ బీజేపీని డిఫెన్స్‌లో పడేస్తున్నాయి. దీంతో భవిష్యత్ కార్యాచరణపై ఆ పార్టీ నేతలు దృష్టి పెట్టారు.
జూన్‌లో జాతీయ పార్టీ అద్యక్షుడు నడ్డాతో బహిరంగ సభలను నిర్వహించేందుకు ప్లాన్ వేశారు. దీని వలన పార్టీ కార్యకలాపాలు, మరింత విస్తృతం చేయటంతోపాటు, క్యాడర్‌ను ఉత్సాహపరిచే వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నారు. జాతీయ అద్యక్షుడిగా ఉన్న నడ్డాతో బహిరంగ సభలు తరువాత పార్టీలోని ముఖ్య నేతలు కూడ రంగంలోకి దింపేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ఇప్పటి వరకు అధ్యక్షుడి సొము వీర్రాజు ఒక్కరే యాక్టివ్‌గా ఉన్నారు. ఇకపై పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి, సీఎం రమేష్, విష్ణు వర్దన్ రెడ్డి వంటి నాయకులను కూడా యాక్టివ్ పాలిటిక్స్ వైపు మళ్లించాలని ఆలోచన.
పనిలో పనిగా పొత్తలపై నడుస్తున్న చర్చకు జాతీయ నేతలతో క్లారిటీ ఇవ్వాలని కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ భావిస్తోంది. నడ్డా సభల తరువాత కమల నేతలు మరింత దూకుడుగా ఎపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిచేందుకు ప్లాన్ చేశారు. ఎన్నికల నాటికి పార్టిని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి... అభ్యర్దులను కూడ సిద్దం చేసుకునేందుకు బీజేపి సన్నద్దం అవుతుంది.