Palnadu News: పల్నాడులో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులు, 144 సెక్షన్ అమలు
Polling Violence In Palnadu: పల్నాడు జిల్లాలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితులను అదుపు చేసేందుకు కేంద్ర బలగాలను మోహరించారు. జిల్లావ్యాప్తంగా 44 సెక్షన్ అమల్లో ఉంది
Andhra Pradesh News: దాడులు, ప్రతిదాడులతో పల్నాడు(Palnadu) జిల్లా అట్టుడుకుతోంది. పోలింగ్ ముగిసినా...పల్నాడు జిల్లాలో కక్షలు చల్లారలేదు. పోలింగ్ సందర్భంగ తలెత్తిన విబేధాలు, ఘర్షణలు మరుసటి రోజూ కొనసాగాయి. కారంపూడి, పిడుగురాళ్ల, గురజాల, సత్తెనపల్లిలో ఘర్షణలో నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. గుంపులుగా బయట తిరిగినా...రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడినా అరెస్ట్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు..
చల్లారని మంటలు
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తలెత్తిన విభేదాలతో పల్నాడు(Palnadu) జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లు, దాడులు, ప్రతిదాడులతో పోలీసులు అప్రమత్తమయ్యారు, తంగెడలో బాంబుదాడులు, కారంపూడి(Karampudi)లో పిన్నెల్లి అనుచరులు తెలుగుదేశం (Telugudesam) కార్యాలయంపై దాడి చేయడంతో పాటు వాహనాలను ధ్వంసం చేశారు. పోలింగ్ సందర్భంగా గాయపడిన వారిని పరామర్శించే పేరిట ఆయన మందీమార్బలంతో కారంపూడి(Karampudi) వచ్చిన ఆయన తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేసి కార్లకు నిప్పుపెట్టారు. సీఐ నారాయణస్వామి తలపగులగొట్టారు.
గురజాల(Gurajala) నియోజకవర్గం తంగెడ(Thangeda)లోనూ పెట్రోలు బాంబులు వేసి దుకాణాలు తగులబెట్టారు. కొత్తగణేశునిపాడులోనూ ఇరువర్గాలు కవ్వింపు చర్యలకు దిగాయి. భారీ వాహనాలు, అనుచరులతో హల్‌చల్ చేస్తుండటంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని పల్నాడు ప్రజలు భయపడిపోతున్నారు. మాచర్ల, పెదకూరపాడు, నర్సరావుపేట, గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఘర్షణలు జరగడంపై ఉన్నతాధికారులు స్పందించారు.
పల్నాడులో జరిగిన ఘర్షణలను చంద్రబాబు(Chandra Babu) డీజీపీ(DGP) దృష్టికి తీసుకెళ్లారు. అదనపు బలగాలను పంపి పరిస్థితులను అదుపు చేయాల్సిందిగా కోరారు. సున్నితమైన గ్రామాలకు కేంద్ర బలగాలను పంపినట్లు సమాచారం. పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు.
భద్రత కట్టుదిట్టం
నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటల 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ముగ్గురికి మించి ఎక్కువ మంది గుమికూడరాదని, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, అనుమానాస్పదంగా సంచరించకూడదని పోలీసు అధికారులు హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో శాంతిభద్రతలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవ్వడంతో స్వయంగా ఎన్నికల సంఘమే రంగంలోకి దిగింది. జిల్లాకు అదనపు బలగాలు తరలించాలని అధికారులను ఆదేశించింది. వైసీపీతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేల అనుచరులు టీడీపీ నేతల్ని టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఈసీ ఆదేశాలతో పారామిలటరీ బలగాలను పల్నాడుకు జిల్లాకు డీజీపీ పంపారు. మాచర్ల పట్టణంతోపాటు, గ్రామాల్లో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యిమంది అదనపు బలగాలను పల్నాడు జిల్లాకు తరలించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోనే ఉండనుంది. పల్నాడు జిల్లాలో గొడవలు జరుగుతాయని ముందే సమాచారం ఉన్నా పోలీసులు సరైన రీతిలో భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే గొడవలు జరిగినట్లు తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలను అదుపులోకి తీసుకోలేదని మండిపడుతున్నారు. బహిరంగంగా రోడ్లపైకి రాడ్లు, కర్రలు తీసుకుని హల్‌చల్ చేసినా...కనీసం పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలను అరెస్ట్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని కోరుతున్నారు.