Sharmila party: వైయస్ వారసులం మేమే.. 100 రోజుల్లో పాదయాత్ర చేస్తా: షర్మిల
తెలంగాణ గడ్డపై కొత్త పార్టీ ఆవిర్భవించింది. రాజన్న సంక్షేమ పాలన తీసుకురావడమే ధ్యేయమంటూ రంగప్రవేశం చేసిన దివంగత రాజశేఖర్‌రెడ్డి తనయ షర్మిల వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు.
LIVE
Background
తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భావానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో జెండా, అజెండాను వెల్లడించనున్నారు. ఇవాళ ఉదయం వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానానికి తన తల్లి విజయమ్మ నుంచి ఆశీర్వాదం లభించిందని ట్వీట్ చేశారు.
[tw]
తెలంగాణ ప్రజల సంక్షేమానికై ..
— YS Sharmila (@realyssharmila) July 8, 2021
మనం చేయబోయే మహాయజ్ఞానికి
అమ్మ పక్కనుండి ఆశీర్వదించింది ..
నాన్న పైనుండి దీవిస్తున్నాడు ..
వారి ఆశీస్సులతో మనం తప్పకుండా విజయం సాధిస్తాం! pic.twitter.com/VEqeTgYFXe
[/tw]
ఘన స్వాగతం..
కొద్దిసేపటి క్రితమే షర్మిల ఇడుపులపాయ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. షర్మిలకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా సాంస్కృతిక ప్రదర్శనలతో కళాకారులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం ప్రాంగణమంతా షర్మిల పార్టీ కార్యకర్తలు అభిమానులతో కోలాహలంగా మారింది. షర్మిల పార్టీ అభిమానులకు కార్యకర్తలకు అభివాదం చేస్తూ ర్యాలీగా బయలుదేరారు. అనంతరం పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి సాయంత్రానికి రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడే పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తారు.
వైఎస్‌ఆర్ వారసులం మేమే..
[quote author=- వైయస్ షర్మిల]‘‘కృష్ణానదిపై రెండు సంవత్సరాల నుంచి ప్రాజెక్టులు కడుతుంటే.. కేసీఆర్‌కు ఇప్పుడే తెలివొచ్చిందా?. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి ఆహ్వానించి భోజనాలు పెట్టొచ్చు. ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువును ఓడించొచ్చు. కానీ, రెండు నిమిషాలు కూర్చుని సమస్యను పరిష్కరించుకోలేరా?. మరోసారి కూర్చుని నీటి సమస్యపై ఎందుకు చర్చించరు. సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం చూస్తూ కూర్చుంది. సమస్యను పరిష్కరించుకోవాలనే చిత్తశుద్ధి ఎవరిలోనూ లేదు. న్యాయబద్దంగా తెలంగాణకు దక్కాల్సిన నీటిబొట్టునూ వదులుకోం. ఇతర ప్రాంతానికి చెందిన నీటి చుక్కను కూడా మేం తీసుకోం. రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలన్నదే మా సిద్ధాంతం. ఎంతోమంది నేతలకు వైఎస్‌ఆర్ రాజకీయ భిక్షపెట్టారు. వైఎస్‌ఆర్‌ను తిడుతుంటే ఈ కాంగ్రెస్ నేతలు చప్పుడు చేయటం లేదు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్‌ఆర్ పేరు ఉచ్ఛరించే అర్హత లేదు. వైఎస్‌ఆర్ అసలైన వారుసులం మేమే. నేటి నుంచి 100 రోజుల తర్వాత పాదయాత్ర చేస్తా’’[/quote]
- వైయస్ షర్మిల
ఇదే పార్టీ సిద్ధాంతం..
వైఎస్‌ఆర్ పుట్టిన రోజునే పార్టీ ప్రకటించడం ఆనందదాయకమన్నారు. సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినట్టు చెప్పారు. సమానత్వం, స్వయం సమృద్ధి, సంక్షేమం... పార్టీ సిద్ధాంతమని స్పష్టం చేశారు.
పార్టీ జెండా ఆవిష్కరణ..
దివంగత రాజశేఖర్‌రెడ్డి తనయ షర్మిల వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు. వైఎస్‌ఆర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడే ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... వైఎస్‌ఆర్ చెరగని చిరునవ్వు కోట్లాది ప్రజల్లో నిలిచిన సంక్షేమ సంతకమన్నారు. వైఎస్‌ఆర్ రాజకీయాలకతీతంగా సాయం చేశారని గుర్తు చేశారు.
జేఆర్సీ కన్వెన్షన్‌కు చేరుకున్న షర్మిల
వైయస్ షర్మిల.. జేఆర్సీ కన్వెన్షన్‌కు చేరుకున్నారు. వైయస్ అభిమానులు, పార్టీ మద్దతుదారులు ఇప్పటికే భారీగా చేరుకున్నారు.