Wrestlers Protest: పతకాలను గంగానదిలో పారేసి, ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్న రెజ్లర్లు!
Wrestlers Protest: తాము సాధించిన పతకాలన్నింటినీ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు గంగానదిలో పారేస్తామని రెజ్లర్లు ప్రకటించారు. అనంతరం ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు.
Wrestlers Protest: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు తమ పతకాలను గంగానదిలో పారవేస్తామని ప్రకటించారు. రెజ్లర్ వినేష్ ఫోగట్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ రాస్తూ.. ఈ విషయాన్ని తెలియజేశారు. ఈరోజు మంగళవారం (మే 30) సాయంత్రం 6 గంటలకు హరిద్వార్‌లోని గంగానదిలో క్రీడాకారులు తమ పతకాలను పారవేయబోతున్నట్లు స్పష్టం చేశారు. రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్న రెండ్రోజుల తర్వాత వినేషన్ ఫోగట్ ఈ ప్రకటన చేశారు.
ఆందోళన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కసారి కూడా రెజ్లర్లను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వినేష్ ఫోగట్ తన ట్విట్టర్‌లో ఒక లేఖను పంచుకున్నారు. అందులో మే 28వ తేదీన రెజ్లర్లకు ఏం జరిగిందో ప్రపంచమంతా చూసిందని లేఖలో పేర్కొన్నారు. ఈ దేశంలో మహిళా రెజ్లర్లు ఇక ఉండరనే భావన కల్గుతోందని చెప్పారు. ఒలంపిక్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించిన ఆ క్షణాలను ఇప్పటికీ భారతీయులు గుర్తు చేసుకుంటాన్నారని... కానీ ఇప్పుడు ఆ పతకాలు ఎందుకు సాధించామని రెజ్లర్లు అనుకుంటున్నట్లు వెల్లడించారు. అందుకే ఆ పతకాలను ఈరోజు గంగలో పారేయబోతున్నట్లు వివరించారు.
ఆమరణ నిరాహార దీక్ష
పతకాలను గంగలో పారేసిన తర్వాత రెజ్లర్లంతా కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నట్లు వినేష్ ఫోగట్ ప్రకటించారు. పతకాలు పోయిన తర్వాత తాము బతికి ఉండి ప్రయోజనం లేదని.. అందుకే ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని వివరించారు. ఇండియా గేట్.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరుల ప్రదేశం అని ఫోగట్ అన్నారు. తాము అమరవీరులంతా పుణ్యాత్ములం కాదని... కానీ అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు తమ స్ఫూర్తి కూడా ఆ సైనికులలాగే ఉండేదని చెప్పుకొచ్చారు.
ఢిల్లీ పోలీసుల చర్యను ప్రశ్నించిన వినేష్ ఫోగట్..
మే 28వ తేదీ ఆదివారం రోజు ఢిల్లీ పోలీసులు.. రెజ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు జంతర్ మంతర్ నుంచి రెజ్లర్ల నిరసన ప్రదేశాన్ని కూడా ఖాళీ చేయించారు. ఓ వైపు ఈ చర్యను ప్రశ్నిస్తూనే.. పోలీసులు తమను ఎంత క్రూరంగా అరెస్టు చేశారో కూడా లేఖలో వివరించారు. శాంతియుతంగా ఉద్యమం చేశామని.. తమ ఆందోళన వేదికను కూడా తొలగించినట్లు చెప్పారు. ఆ మరుసటి రోజు తమపై తీవ్రమైన కేసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. తమపై జరిగిన లైంగిక వేధింపులకు న్యాయం చేయాలని కోరుతూ మహిళా రెజ్లర్లు నేరం చేశారా.. అంటూ వినేష్ ఫోగట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మొన్నటికి మొన్న ఫైర్ అయిన వినేష్ ఫోగట్
బ్రిజ్ భూషణ్‌పై కేసులు నమోదు చేసినప్పటికీ వాటిని కొట్టేసే ప్రయత్నం జరుగుతోందని ఇటీవలే వినేష్ ఫోగట్ ఆరోపించారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా బ్రిజ్ భూషణ్‌కు మద్దతుగా నిలుస్తున్నారని మండి పడ్డారు. కమిటీ ఏర్పాటు పేరుతో కేసుని పక్కదోవ పట్టించేందుకు కుట్ర చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయంగా పవర్‌ఫుల్‌గా ఉన్న బ్రిజ్ భూషణ్‌ని ఎదుర్కోడం కష్టంగా ఉందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా అధిరాకాన్ని దుర్వినియోగం చేస్తున్న అలాంటి వ్యక్తితో పోరాటం అంత సులభం కాదని తేల్చి చెప్పారు. అయినా న్యాయం జరిగే వరకూ పోరాడతామని వెల్లడించారు.