ఎవరీ ప్రభాకరన్? ఎందుకింత ఫేమస్? ఏ ఆశయంతో 15 ఏళ్లకే విప్లవ జెండా ఎత్తుకున్నారు?
ఓ వ్యక్తి బతికే ఉన్నాడని ప్రకటన వచ్చిన వెంటనే ఓ దేశ ప్రభుత‌్వం స్పందించి కామెంట్ చేసిందంటే ఆ వ్యక్తి ఎంతటి శక్తిమంతుడో. తమిళులకు దేశం కావాలన్న డిమాండ్‌తో ప్రభుత్వాన్ని ఢీ కొట్టిన ఘనుడు.
సమయం కోసం పెద్దపులి వేచి చూస్తోంది. ఆ టైం వచ్చిన వెంటనే కచ్చితంగా బయటికి వస్తుంది అంటూ ఓ లీడర్ చేసిన ప్రకటన తమిళనాడులోనే కాదు. ఇండియాలోనే కాకుండా శ్రీలంకలోనూ ప్రకంపనలు సృష్టించాయి. ఆ కామెంట్స్ చేసింది తమిళనాడుకు చెందిన నెడుమారన్. ఆయన చెప్పిన పెద్ద పులి ఎవరో కాదు వేలుపిళ్లై ప్రభాకరన్.
అవును నిజమే వేలుపిళ్లై ప్రభాకరన్ 2009లో శ్రీలంక సైన్యం చేతిలో హతమైనట్టు ప్రపంచానికి తెలిసినా... తాజా ప్రకటనతో మరోసారి అంతా అలర్ట్ అయ్యారు. లంకలో రక్తపురేట్లు పారించి పెద్ద పులిగా... తమిళులకు ఆరాధ్యుడిగా ఉన్న ప్రభాకరన్ బతికే ఉన్నాడనే వార్త సరికొత్త చర్చకు దారి తీసింది.
ఓ వ్యక్తి బతికే ఉన్నాడని ప్రకటన వచ్చిన వెంటనే ఓ దేశ ప్రభుత‌్వం స్పందించి కామెంట్ చేసిందంటే ఆ ప్రభాకరన్ తాఖత్ ఏంటో అర్థమైపోతుంది. తమిళులకు ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్‌తో ప్రత్యేక సైన్యాన్నే నడిపించి శ్రీలంక ప్రభుత్వాన్ని గడగడలాడించారు. అందుకే ఆయన్ని తమిళులు పెద్దపులిగా అభివర్ణిస్తారు. ముద్దుగా తంబీ అని పిలుచుకుంటారు. నేటికీ ఆయన ప్రభ తగ్గలేదంటే ప్రభాకరన్‌ను ఏ స్థాయిలో ఆరాధించారో తెలుసుకోవచ్చు.
ప్రభాకరన్ శ్రీలంకలోని వల్వెట్టితురైలో 1954 నవంబర్ 26న ఓ ఉన్నత కుటుంబంలో జన్మించారు. తిరువెంకడం వేలుపిళ్లై, వల్లిపురం పార్వతి దంపతులకు పుట్టిన చివరి బిడ్డ ప్రభాకరన్. తిరువెంకడం వేలుపిళ్లై సిలోన్ ప్రభుత్వంలో జిల్లా భూ అధికారిగా పని చేశారు. ఆయన వల్వెట్టితురైలోని ప్రధాన హిందూ దేవాలయాల నిర్వహించే కుటుంబం నుంచి వచ్చారు.
చిన్నతనం నుంచి లంక సైన్యం చేస్తున్న అరాచకాలను కళ్లారా చూసిన వ్యక్తి. అందుకే లంక సైన్యం నుంచి తన జాతిని కాపాడుకునేందుకు ప్రయత్నించారు. అలా బడి మానేసి విప్లవజెండాను ఎత్తుకున్నారు. మొదట తమిల్ యూత్ టైగర్స్ అనే సంస్థలో చేరారు. తన భావాలను ప్రజలకు యువతకు చేరవేసేవారు. స్థానికంగా ఉండే తన తోటి యువకులను చేర దీసి నిరసనలు చేపట్టే వాళ్లు. అలా చిన్న తనం నుంచే ఉద్యమ పాఠాలు నేర్చుకున్న ప్రభాకరన్ 1972లో తమిళ్ న్యూటైగర్స్ పేరిట ఓ విప్లవసంస్థను ఏర్పాటు చేశారు. అసలు ప్రభాకరన్ ఉద్యమం సంస్థ ఏర్పాటు ఓ సినిమాటిక్ వేలో జరిగింది.
1970ల్లో సిరిమావో బండారునాయకే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం విద్యావిధానంలో మార్పులు చేపట్టింది. ఇది తమిళులకు విశ్వవిద్యాలయ ప్రవేశానికి అడ్డంకిగా మారిందని ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ చట్టాన్ని ఎదుర్కోవడానికి తమిళ విద్యార్థులు అనేక సంస్థలను ఏర్పాటు చేశారు. 15 ఏళ్ల వయసులోనే విప్లవ జెండా పట్టుకున్న ప్రభాకరన్ సెల్వరాజా యోగచంద్రన్ (కుట్టిమణి అని పిలుస్తారు), నాదరాజా తంగతురైతో కలిసి కుట్టిమణి-తంగతురై అనే సంస్థను ఏర్పాటు చేశారు. ప్రభాకరన్‌తోపాటు కుట్టిమణి, పొన్నుతురై శివకుమారన్ ఇతర ప్రముఖ తిరుగుబాటుదారులు 1970లో సత్యశీలన్ అనే విద్యార్థి ఏర్పాటు చేసిన తమిళ మానవర్ పేరవైలో చేరారు.
ఇలా వివిధ సంస్థల్లో పని చేసిన అనుభవంతో 1973లో ప్రభాకరన్ చెట్టి తనబాలసింగంతో కలిసి తమిళ్ న్యూ టైగర్స్ (TNT)ని స్థాపించారు. 1975లో పొన్నలైలోని దేవాలయ సందర్శనకు వచ్చిన జాఫ్నా మేయర్ ఆల్‌ఫ్రెడ్ దురైయప్పను ప్రభాకరన్ కాల్చి చంపగలిగారు. అంతకు ముందు ఆయనపై హత్యాయత్నం జరిగింది. కానీ విఫలమైంది. తమిళ ద్రోహిగా పేరున్న దురైయప్ప హత్యతో ప్రభాకరన్ పేరు మారుమోగిపోయింది. దీంతో 5 మే 1976న TNT లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE)గా పేరు మార్చేశారు. దీనిని సాధారణంగా తమిళ టైగర్స్ అని పిలుస్తారు.
ఎల్టీటీఈ పెట్టింది మొదలు ప్రభాకరన్ శ్రీలంక ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారారు. 30 ఏళ్ల పాటు ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. టైగర్స్, సీ టైగర్స్, ఎయిర్ టైగర్స్ వంటి దళాలను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి ఎదురెళ్లారు. ఈ దెబ్బకు ఎల్టీటీఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయంది. ఆత్మాహుతి దళాలను కూడా ప్రవేశ పెట్టారు ఈ ప్రభాకరన్. అందుకే ఇంటర్‌పోల్‌తోపాటు చాలా దర్యాప్తు సంస్థలకు ప్రభాకరన్ ఓ మోస్ట్ వాటెండ్‌గా ఉండేవారు.
తమిళ దేశం కోసం ఏళ్ల తరబడి పోరాడిన ప్రభాకరన్.. లంకలో రక్తపుటేర్లు పారించారు. లక్షల మంది సింహళ జాతీయులు, తమిళులు, ప్రముఖులు బలయ్యారు. అలాంటి వారి జాబితాలో ముందుగా ఉంటే పేరుల రాజీవ్ గాంధీది. ఒకప్పటి శ్రీలంక అధ్యక్షుడు రణసింఘె ప్రేమదాసను కూడా బలితీసుకుంది ప్రభాకరన్ నేతృత్వంలోని ఎల్టీటీఈ. ఈయన చేసిన ఆత్మాహుతి దాడుల్లో చనిపోయిన అధికారులు, మంత్రులు, రాజకీయ నాయకులు చాలా మందే ఉన్నారు.
ఈ పోరులో అమాయకులు కూడా బలవ్వడాన్ని ప్రపంచ దేశాలు తప్పుపట్టాయి. అందుకే కొన్ని సార్లు వెనక్కి తగ్గి చర్చల మార్గాన్ని కూడా ప్రభాకరన్ అనుసరించారు. భారత్, నార్వే మధ్యవర్తిత్వంతో శ్రీలంక ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అవి ఏవీ సత్ఫలితాలను ఇవ్వలేదు. దీంతో మళ్లీ తన పాత పంథానే కొనసాగించారు.
శాంతి పరిరక్షణ పేరిటో భారత్ ప్రభుత్వం తీసుకున్న చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభాకరన్. లంక సైన్యానికి భారత్ సాయం చేస్తోందని అందుకే అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కారణమని అభిప్రాయపడ్డారు. అందుకే రాజీవ్ గాంధీ హత్యకు ప్లాన్ చేశారు. 1991 మే 21న రాజీవ్ గాంధీని పొట్టన్న పెట్టుకున్నారు. తమిళనాడులోని శ్రీపెరంబదూరులో బహిరంగ సమావేశానికి హాజరైన రాజీవ్ గాంధీని మానవ బాంబుతో హత్య చేశారు. ఈ మధ్య కాలంలోనే ఈ హత్యకు కారణమైన వారిని సుప్రీంకోర్టు విడుదల చేసింది.
30 ఏళ్ల పాటు లంక ప్రభుత్వంతో పోరాడి ప్రముఖులు, సామాన్యుల మరణాలకు కారణమైన ప్రభాకరన్‌ను లంక సైన్యం వెతికివెతికి హతమార్చింది. ముందుగా తన సైన్యాన్ని ఒక్కో విభాగాన్ని మట్టుబెట్టిన లంక ప్రభుత్వం... చివరకు ప్రభాకరన్‌ను ఒంటరిని చేసింది. చివరకు ప్రభాకరన్ బతుకుజీవుడా అంటూ రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారు.
2009 మే 18న ప్రభాకరన్ హతం అనే వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దశాబ్ధాలపాటు ప్రభుత్వాలను పరుగులు పెట్టించిన ప్రభాకరన్‌ను వేటాడి చంపింది లంక సైన్యం. ముల్లైతీవులో సీక్రెట్ జీవితాన్ని గడుపుతున్న ప్రభాకరన్ చంపిన తర్వాత ఆ ఫొటోలను ప్రపంచానికి చూపించింది. అప్పటి వరకు ఆ ఆపరేషన్‌ను సీక్రెట్‌గా ఉంచింది. ఆ రోజు ప్రభాకరన్ సైన్యానికి, లంక సైనికులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగినట్టు పేర్కొంది ప్రభుత్వం. ఈ కాల్పుల్లో ప్రభాకరన్‌తోపాటు ఆయన కుమారుడు బాలచంద్రన్ కూడా హతమైనట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభాకరన్ మృతితో ఎల్టీటీఈ ప్రభ తగ్గింది. ప్రభాకరన్ ఫ్యామిలీ వివరాలు బాహ్య ప్రపంచానికి తెలియలేదు. వాళ్లు ఇంకా బతికే ఉన్నారని... వస్తారని ఇప్పటికీ ప్రభాకరన్ అభిమానులు ఆశిస్తుంటారు. అసలు వాళ్లు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు.
శత్రువుకు చిక్కడం కంటే... చావును హుందాగా స్వీకరిస్తానంటూ తరచూ చెప్పే ప్రభాకరన్... అలానే చనిపోయారు. లంక ప్రభుత్వానికి చిక్కకుండా హతమయ్యారు. బ్రిటిష్ సామ్రాజ్యంతో పోరాడిన భారతీయ జాతీయవాదులు సుభాస్ చంద్రబోస్, భగత్ సింగ్ ప్రభావంతోనే ప్రభాకరన్ ఉద్యమంలోకి వచ్చారు. 'విప్లవాత్మక సోషలిజం, సమానత్వ సమాజ సృష్టి' అని తరచూ చెప్పేవారు.
ప్రభాకరన్ కథ అలా ముగిసిందని సైన్యం చెప్పిన ఇన్నాళ్లకు ఇప్పుడు తమిళ జాతీయోద్యమ నేత నెడుమారన్ చేసిన ప్రకటనతో మళ్లీ ఆయన అభిమానుల మొహాల్లో ఆనందం విరిసింది. భార్య కుమార్తెతో ప్రభాకరన్ క్షేమంగా ఉన్నారన.ి.. త్వరోనే జనం ముందుకు వస్తారని పూర్తి విశ్వాసంతో చెప్పారు నెడుమారన్. దీనిపై చాలా మంది తమ అభిప్రాయాలు చెప్పారు. అయితే దీన్ని పెద్ద జోక్‌గా లంక ప్రభుత్వం ప్రకటించింది. ఆయన చనిపోయిన మాట వాస్తవమని... అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెబుతోంది.