కుక్క పిల్ల అనుకొని ఎలుగుబంటిని పెంచుకున్న మహిళ- రెండేళ్ల తర్వాత అసలు విషయం తెలిసి షాక్
కుక్కను పెంచుకోవాలనుకున్న ఓ మహిళ... షాపులోకి వెళ్లి పిల్లను తెచ్చుకుంది. కొన్ని రోజుల తర్వాత తాము తెచ్చుకున్నది కుక్క కాదు ఎలుగుబంటి అని తెలసి ఆ మహిళ షాక్ అయింది.
చాలా మంది కుక్కను పెంచుకోవడానికి ఇష్టపడతారు. కుక్కలను పెంచడమే కాకుండా వాటిని కుటుంబ సభ్యులుగా కూడా చూస్తారు. కుక్క కూడా దాని యజమాని పట్ల గొప్ప విధేయతను ప్రదర్శిస్తుంది. కానీ చైనాలో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఇక్కడ రెండేళ్ల పాటు ఎలుగుబంటిని కుక్కలా పెంచుకుందో కుటుంబం. ఒక్కసారిగా అది కుక్కపిల్ల కాదు ఎలుగుబంటి అని తెలిసేసరికి స్పృహ కోల్పోయింది.
చైనాలోని రూరల్ యునాన్ ప్రావిన్‌లోని కున్మింగ్ సమీపంలో నివసిస్తోంది సు యున్ ఫ్యామిలీ. ఎప్పటి నుంచో వాళ్లకు కుక్కను పెంచుకోవాలని కోరిక. రెండేళ్ల క్రితం పెంపుడు జంతువులు అమ్మే దుకాణానికి వెళ్లి మేలు జాతి కుక్క కావాలని అడిగారు. దుకాణ దారుడు కూడా ఓ కుక్కను చూపించాడు. టిబెటన్ మాస్టిఫ్ జాతికి చెందిన కుక్క అని చెప్పాడు.
టిబెటన్ మాస్టిఫ్ జాతికి చెందిన కుక్కలు చూడటానికి చాలా పెద్దవిగా కనిపిస్తాయని చెప్పాడు. మిగతా కుక్కల కంటే చాలా భిన్నంగా ఉంటాయని కూడా వాళ్లకు నచ్చజెప్పాడు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న దుకాణదారుడి మాటలు నమ్మిన ఆ జంట కుక్కను కొనుక్కొని ఇంటికి వెళ్లిపోయారు. పెంచడం మొదలుపెట్టారు. రెండేళ్ళ తర్వాత కాస్త పెద్దయ్యాక అసలు విషయం తెలిసింది.
కుక్క తెచ్చుకున్న రోజు నుంచి విపరీతంగా తింటూ ఉంది. ఎంత పెట్టినా తినేస్తుంది. ప్రతిరోజూ ఒక బాక్సు పండ్లు, రెండు బకెట్ల నూడుల్స్ తినేది. దీనిపై మొదటి నుంచి ఆ మహిళ అనుమానం వ్యక్తం చేసింది. అయినా దుకాణదారుడు మళ్లీ నచ్చజెప్పాడు.
రోజులు నెలలు అయ్యాయి. నెలలు సంవత్సరాలు అయ్యాయి. రెండు సంవత్సరాలలో తర్వాత ఆ జంతువు బరువు ఏకంగా 250 పౌండ్లు ఉంది. మరోసారి వెళ్లి దుకాణదారుడిని అడిగందా మహిళ. అయితే ఈ కుక్క వేరే జాతి కుక్కని చెప్పుకొచ్చాడు. అందుకే బరువు పెరుగుతుందని అన్నాడు. కాబట్టి మహిళ ఇచ్చిన ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదు.
రోజులు గడిచే కొద్ది అది రెండు కాళ్లపై నిలబడటం మొదలు పెట్టింది. కుక్క చేసే ఒక్క పని కూడా చేయడం లేదు. దీంతో వాళ్ల అనుమానాలు మరింత పెరిగాయి. చివరకు దాని శరీరంలో వచ్చిన మార్పులతో తెలిసిన వారి సాయంతో అది కుక్కపిల్ల కాదు ఎలుగుబంటి అని తెలిసి ఆ జంట షాక్ అయింది. ఈ విషయం తెలిసి రోజూ ఆ పిల్లకు సపర్యలు చేసే సదరు మహిళ స్పృహ తప్పి పడిపోయింది. తర్వాత తేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అటవీ శాఖకు, పోలీసులకు సమాచారం
అది కుక్క కాదని, ఎలుగుబంటి అని గ్రహించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది ఆ జంట. ఆ ఇంటికి వచ్చిన పోలీసులు అది కుక్క కాదని, అరుదైన, ప్రమాదకరమైన ఆసియా నల్ల ఎలుగుబంటి అని నిర్ధారించారు. ఒక పెద్ద మగ ఆసియా ఎలుగుబంటి 400 పౌండ్ల వరకు బరువు ఉంటుందని చెబుతారు. అది ఎలుగుబంటి అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు అటవీశాఖకు సమాచారం అందించారు. అటవీ శాఖ బృందం ఈ ఎలుగుబంటిని తీసుకెళ్లింది.