US Army Helicopter Crash: అమెరికాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్లు - తొమ్మిది మంది దుర్మరణం!
US Army Helicopter Crash: అమెరికా కెంటుకీలో బుధవారం రాత్రి ఘోరప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు ఆర్మీ హెలికాఫ్టర్లు క్రాష్ అయ్యాయి.
US Army Helicopter Crash: అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు ఆర్మీ హెలికాఫ్టర్లు కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. అమెరికా కెంటుకీలో రాత్రిపూట శిక్షణా విన్యాసాలు నిర్వహిస్తున్న రెండు ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్లు కుప్పకూలిన ఘటనలో తొమ్మిది మంది మరణించారని సైనిక ప్రతినిధి తెలిపారు. ఫోర్ట్ క్యాంప్‌బెల్ ప్రతినిధి నోండిస్ థుర్మాన్ గురువారం ఉదయం మాట్లాడుతూ... నైరుతి కెంటుకీలో నిన్న రాత్రి సాధారణ శిక్షణా మిషన్‌లో రెండు హెలికాఫ్టర్ క్రాష్ అయ్యి 9 మంది మరణించారని తెలిపారు. 101వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌లో భాగమైన రెండు HH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్లు బుధవారం రాత్రి 10 గంటలకు కూలిపోయాయని ఫోర్ట్ క్యాంప్‌బెల్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు అధికారులు. కెంటుకీలోని ట్రిగ్ కౌంటీలో బుధవారం.. 101వ ఎయిర్‌బోర్న్ ఫోర్ట్ క్యాంప్‌బెల్‌కు 48 కిలోమీటర్లు దూరంలో ఈ ప్రమాదం జరిగిందని సైనిక అధికారులు గుర్తించారు. ఈ క్రాష్ పై విచారణ చేపట్టారు.
తక్కువ ఎత్తులో ఎగురుతూ
ఈ హెలికాప్టర్లు నివాస ప్రాంతానికి సమీపంలోని పొలాల్లో క్రాష్ అయ్యాయని 101వ ఎయిర్‌బోర్న్ డిప్యూటీ కమాండర్ జనరల్ జాన్ లూబాస్ అన్నారు. ఒక హెలికాప్టర్‌లో ఐదుగురు వ్యక్తులు ఉన్నారని, మరో హెలికాప్టర్‌లో నలుగురు ఉన్నారని లూబాస్ చెప్పారు. గురువారం ఉదయం కెంటుకీ గవర్నర్ ఆండీ బెషీర్ మాట్లాడుతూ, మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్రం చేయగలిగినదంతా చేస్తుందని అన్నారు. హెలికాఫ్టర్లు కూలిపోయే కొద్దిసేపటికి ముందు తన ఇంటి మీదుగా ఎగురుతూ వెళ్లడం తాను చూశానని క్రాష్ జరిగిన ప్రదేశానికి సమీపంలో నివసిస్తున్న నిక్ టోమాస్జెవ్‌స్కీ చెప్పాడు.
"నిన్న రాత్రి నా భార్య నేను వెనుక డెక్‌పై చూస్తూ కూర్చున్నాం, అప్పుడు ఆ రెండు హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ఎగురుతూ కనిపించాయి" అని స్థానికుడు తెలిపాడు. హెలికాప్టర్లు ఎగురుతూ వెళ్తున్నాయని, ఇంతలో ఆకాశంలో బాణసంచా పేలినట్లు పెద్ద కాంతి చూశామని స్థానికులు తెలిపారు. వారి హెలికాప్టర్‌లోని లైట్లన్నీ ఆరిపోయాయి. ఆపై ఫైర్‌బాల్ వంటి భారీ మెరుపును చూశామని టోమాస్జెవ్స్కీ చెప్పారు. శిక్షణా హెలికాఫ్టర్లు దాదాపు ప్రతిరోజూ తిరుగుతున్నాయి. హెలికాప్టర్లు సాధారణంగా తక్కువ ఎత్తులో ఎగురుతాయి కానీ అంత దగ్గరగా ఎప్పుడూ రాలేదు అని అతడు చెప్పాడు. ప్రమాద బాధితులకు కెంటుకీ సెనేట్ సభ్యులు గురువారం ఉదయం కొద్దిసేపు మౌనం పాటించారు.
గత నెలలో ఇద్దరు మృతి
గత నెలలో బ్లాక్ హాక్ హెలికాప్టర్ శిక్షణ సమయంలో అలబామా హైవే సమీపంలో కూలిపోవడంతో ఇద్దరు టేనస్సీ నేషనల్ గార్డ్ పైలెట్లు మరణించారు. బ్లాక్ హాక్ హెలికాప్టర్ U.S. ఆర్మీకి చెందిన కీలకమైంది. దీనిని భద్రత, రవాణా, వైద్య తరలింపులు, శోధన, రెస్క్యూ ఇతర మిషన్‌లలో వినియోగిస్తారు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌పై యుద్ధం సమయంలో ఈ హెలికాఫ్టర్లు తరచుగా కనిపించేవి. బ్లాక్ హాక్స్ తరచుగా ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ ప్రాంతాలలోని ప్రధాన కార్యాలయ స్థానాలకు వచ్చే సీనియర్ నాయకులను ట్రాన్స్ పోర్టు చేయడానికి కూడా ఉపయోగించేవారు.