South Korea President: దక్షిణ కొరియా అధ్యక్షుడికి తప్పిన పదవీ గండం, అభిశంసన నుంచి ఎలా గట్టెక్కారో తెలుసా
South Korean President impeachment Vote | దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అభిశంసన నుంచి బయటపడ్డారు. దాంతో ఆయనకు పదవీ గండం ప్రస్తుతానికి తప్పింది.
South Korean President impeachment vote fails after ruling party boycotts it | సియోల్: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పదవీ గండం నుంచి తప్పించుకున్నారు. దేశంలో నెలకొన్న రాజకీయ, ఇతర కారణాలతో ఇటీవల దక్షిణ కొరియా అంతటా ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ (Emergency Martial Law) ప్రకటించడం తెలిసిందే. విపక్షాలు ఆయన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అధ్యక్షుడికి విరుద్ధంగా విపక్షపార్టీ నేతలు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానాన్ని సైతం ప్రవేశపెట్టారు. అయితే తీర్మానం ఆమోదం పొందడానికి మూడింట రెండొంతుల మంది సభ్యులు మద్దతుగా ఓటు వేయాలి. కానీ అధికార పీపుల్ పవర్ పార్టీకి చెందిన సభ్యులు చాలా మంది ఓటింగ్‌ను బహిష్కరించారు. దాంతో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అభిశంసన గండం నుంచి బయటపడ్డారు.
చివరి నిమిషంలో అధికార పార్టీ సభ్యులు వాకౌట్
సౌత్ కొరియాలో అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెడితే, అది ఆమోదం పొందాలంటే పార్లమెంట్‌లోని 300 మంది సభ్యుల్లో 200 మంది మద్దతు తెలపాలి. అధికార పీపుల్ పవర్ పార్టీకి చెందిన సభ్యులు కేవలం ముగ్గురు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనగా, మిగతా సభ్యులు ఓటింగ్‌ను బాయ్ కాట్ చేశారు. ఇక ప్రతిపక్ష పార్టీలకు చెందిన 192 సీట్లు మంది ఓటింగ్‌లో పాల్గొన్నా మొత్తం ఓట్లు కావాల్సిన కోటా 200 కాలేదు. దాంతో ఓట్ల లెక్కింపు చేయకుండానే అధ్యక్షుడిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఇటీవల ప్రతిపక్షాలు దాడులకు కుట్ర చేస్తున్నాయని, ఉత్తర కొరియాతో చేతులు కలిపాయని ఆరోపిస్తూ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ లా విధించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఎమర్జెన్సీ లాంటిది. సైనిక పాలన అమల్లోకి వచ్చి, కేవలం అధికార పార్టీకి సంబంధించిన గళం మాత్రమే వినిపించే హక్కు ఉంటుంది.
దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ లా విధించడంతో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై సొంత పార్టీ కన్జర్వేటివ్ పీపుల్ పవర్ పార్టీ నుంచే విమర్శలు వచ్చాయి. కానీ అధ్యక్షుడు పదవి కోల్పోతే, ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందన్న భయంతో అభిశంసన తీర్మానం వచ్చేసరికి సొంత పార్టీ నుంచి యోల్‌కు పరోక్షంగా మద్దతు లభించింది. చివరి నిమిషంలో అధికార పార్టీ సభ్యులు ఓటింగ్‌ను బహిష్కరించడంతో యూన్ సుక్ యోల్ అధ్యక్ష పదవికి ముప్పు తప్పింది.
గంటల వ్యవధిలో ఎమర్జెన్సీ మార్షల్ లా ఎత్తివేత
దేశంలో నెలకొన్న పరిస్థితులు సంక్షోభానికి దారితీస్తాయని భావించిన అధ్యక్షుడు యోల్ ఎమర్జెన్సీ మార్షల్ లా విధించారు. మీడియాతో మాట్లాడుతూ అందుకు కారణాలు సైతం వెల్లడించారు. దేశ ప్రజల భద్రత, రక్షణను దృష్టిలో ఉంచుకుని మార్షల్ లా విధిస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు. కానీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడం, సొంత పార్టీ సభ్యుల నుంచే సెగ రావడంతో తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో మార్షల్ లా ఎత్తివేసినట్లు ప్రకటించారు. తప్పని పరిస్థితుల్లో తాను ఎమర్జెన్సీ మార్షల్ లా విధించాల్సి వచ్చిందని, ఇది అర్థం చేసుకుని ప్రజలు తనను క్షమించాలని అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కోరారు. దాంతో ప్రజలు కొంతమేర శాంతించారు. ఆయన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు.