Real Life SpongeBob: వావ్.. రియల్ లైఫ్‌లో స్పాంజ్ బాబ్.. పాట్రిక్ స్టార్!
స్పాంజ్ బాబ్, పాట్రిక్ స్టార్ కార్టూన్ షో క్యారెక్టర్లను పోలిన జీవుల జంటను మెరైన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి రెండూ అట్లాంటిక్ మహాసముద్రం లోపల ఉన్న రిట్రీవర్ సీమౌంట్ అనే పర్వతం వద్ద కనిపించాయి.

స్పాంజ్ బాబ్ స్క్వేర్ పాంట్స్ (Sponge Bob Square Pants), పాట్రిక్ స్టార్ (Patrick Star).. ఓ రేంజ్ లో పాపులర్ అయిన కార్టూన్ షో. 1999లో ప్రారంభమైన ఈ షో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. ఇందులో ఉండే ప్రధాన పాత్ర పేరు స్పాంజ్ బాబ్. ఇది ఎల్లో రంగులో ఉండే సీ స్పాంజ్. అతని బెస్ట్ ఫ్రెండ్ పేరు పాట్రిక్ స్టార్. ఇది పింక్ రంగులో ఉండే సీ స్టార్.

ఇప్పడిదంతా ఎందుకు అనుకుంటున్నారా? కార్టూన్ క్యారెక్టర్లన్నీ చాలా వరకు ఊహాజనితమే. అవి నిజంగా ఉంటాయా? ఉండవా? అనేది కూడా సందేహమే.. అయితే స్పాంజ్ బాబ్ స్క్వేర్ పాంట్స్ షోలో ఉండే స్పాంజ్ బాబ్, పాట్రిక్ స్టార్ క్యారెక్టర్లను పోలిన జీవులను ఇటీవల అట్లాంటిక్ మహాసముద్రం లోపల గుర్తించారు. ఇవి రెండూ చూడటానికి అచ్చం కార్టూన్ క్యారెక్టర్లలాగా.. కలర్స్ కూడా సేమ్ టూ సేమ్ ఉండటంతో 'అవి ఇవి కావు.. అవే ఇవి' అని చర్చ జరుగుతోంది.
స్పాంజ్ బాబ్, పాట్రిక్ స్టార్ క్యారెక్టర్లను పోలిన జీవుల జంటను మెరైన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి రెండూ న్యూయార్క్ సిటీకి తూర్పు వైపున దాదాపు 200 మైళ్ల దూరంలో నీటి అడుగున ఉన్న రిట్రీవర్ సీమౌంట్ అనే పర్వతం వద్ద కనిపించాయి. దీనికి సంబంధించిన ఫొటోను నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) కు చెందిన శాస్త్రవేత్త క్రిస్టోఫర్ మాహ్ ట్వీట్ చేశారు.
Scientific names: Hertwigia (sponge) and Chondraster (starfish) #Okeanos
— Christopher Mah (@echinoblog) July 27, 2021
ఈ ఫొటోలో స్పాంజ్ బాబ్ ఎల్లో కలర్‌లో.. పక్కనున్న స్టార్ ఫిష్ పింక్ కలర్‌లో ఉన్నాయి. ఇవి అచ్చం మన కార్టూన్ క్యారెక్టర్లలా ఉన్నాయి అంటూ మాహ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఆరెంజ్ లేదా వైట్ రంగుల్లో..
సముద్రాల్లో సాధారణంగా 8,500కు పైగా స్పాంజ్ జాతులు నివసిస్తాయి. అవి నివసించే ఉపరితలాలను బట్టి వాటి ఆకారాలు, టెక్చర్ వంటివి మారుతుంటాయి. కఠినమైన ఉపరితలంపై ఒకలా.. మృదువైన ఉపరితలంపై మరోలా జీవిస్తాయి. చాలా తక్కువ జీవులు మాత్రమే స్పాంజ్ బాబ్ లాగా బాక్స్ ఆకారంలో ఉంటాయి. సాధారణంగా ఇవి ఆరెంజ్ లేదా వైట్ రంగుల్లో ఉంటాయని.. అవి నివసిస్తున్న ఉపరితలం వర్ణంలో కలిసిపోయే రీతిలో వాటి రంగులు ఉంటాయని మాహ్ తెలిపారు. పసుపు రంగులో ఉండటం చాలా అరుదని వెల్లడించారు.

ఎన్ఓఏఏ పంపిన రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్ (ఆర్ఓవీ) ద్వారా ఈ జంతువులను గుర్తించినట్లు పేర్కొన్నారు. వీటి పేర్లు హెర్ట్విజియా (స్పాంజ్) & చోండ్రాస్టర్ (స్టార్ ఫిష్) అని చెప్పారు.
చోండ్రాస్టర్ జీవులు సాధారణంగా క్రో పింక్, లైట్ పింక్, తెలుపు రంగుల్లో ఉంటాయి. తాజాగా ఫొటోలో కనిపించిన స్టార్ ఫిష్ రంగు ముదురు పింక్ అని చెప్పారు. ఈ రంగులో సీ స్టార్స్ కనిపించడం కూడా అరుదేనని తెలిపారు. ఈ రెండు కలర్స్ కార్టూన్ రంగులను పోలి ఉండటంతో తనకలా అనిపించిందని పేర్కొన్నారు.
సీ స్టార్స్ మాంసాహారులని.. స్పాంజ్‌లను చాలా ఇష్టంగా తింటాయని మాహ్ చెప్పారు. కాబట్టి ఇవి రెండూ స్నేహితులు కాకపోయి ఉండవచ్చని (కార్టూన్ షో క్యారెక్టర్లలా), స్పాంజ్‌ను తినడానికి సీ స్టార్ ఎదురుచూస్తున్నట్లుగా ఉంది అని అభిప్రాయపడ్డారు.





















