Will Smith Rock Slap Issue : ఆస్కార్ చెంప దెబ్బ ఇష్యూ - విల్ స్మిత్ అరెస్టుకు రంగం సిద్ధం, కానీ రాక్ మాత్రం!
Will Smith Rock Slap Issue : ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో కమెడియన్ రాక్ పై దాడి చేసినందుకు విల్ స్మిత్ పై చర్యలు తీసుకునేందుకు అకాడమీ చర్చిస్తుంది. స్మిత్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని షో నిర్మాత ఓ ప్రకటనలో తెలిపారు.
Will Smith Rock Slap Issue : ఆస్కార్ వేదికపై హస్యనటుడు క్రిస్ రాక్‌పై దాడి చేసిన విల్ స్మిత్‌ను అరెస్టు చేయడానికి పోలీసు అధికారులు సిద్ధంగా ఉన్నారని ఆస్కార్ షో నిర్మాత విల్ ప్యాకర్ గురువారం తెలిపారు. ఆస్కార్ వేడుకలో దిగ్భ్రాంతికరమైన ఎపిసోడ్ తర్వాత తాను రాక్‌తో మాట్లాడానని విల్ ప్యాకర్ చెప్పారు. "మేము అతనిని అరెస్టు చేయవచ్చు " అని ప్యాకర్ ABC టెలివిజన్‌తో అన్నారు. లాస్ ఏంజిల్స్ పోలీసులు చర్యలు తీసుకునేందుకు అన్ని విధానాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. షో నిర్వాహకుల చర్యల అనుగుణంగా పోలీసుల నిర్ణయాలు ఉండనున్నట్లు స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. రాక్ ఫిర్యాదు చేయడానికి నిరాకరించినట్లు లాస్ ఏంజెల్స్‌లోని పోలీసులు ఆదివారం తెలిపారు.
క్రిస్ రాక్ పై దాడి
ఆస్కార్ వేడుకలో విల్ స్మిత్ వేదికపైన క్రిస్ రాక్ ను చెంప దెబ్బ కొట్టారు. తన భార్యపై జోక్ చేసినందుకు అతడ్ని కొట్టానని ఆ తర్వాత స్మిత్ క్షమాపణలు కూడా చెప్పారు. కానీ ఈ ఘటన వినోద ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అరగంట తర్వాత స్మిత్ "కింగ్ రిచర్డ్"లో తన పాత్రకు ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ను అందుకున్నారు. ఓ సినీ కళాకారుడికి ఇదొక అత్యున్నత గౌరవమని స్మిత్ వేడుకలో అన్నారు. ఆయన ఆస్కార్ అందుకున్నప్పుడు ప్రముఖులు హర్షధ్వానాలు చప్పట్లతో స్వాగతం పలికారు.
వేడుక నుంచి వెళ్లిపోమన్నారు
ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసే సంస్థ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ దాడి తర్వాత వేడుక నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరిందని, అందుకు స్మిత్ నిరాకరించాడని తెలిసింది. ఆ వివరాలపై గురువారం వివాదాస్పదమైన నివేదికలు వెలువడ్డాయి. డాల్బీ థియేటర్‌లో తనను ఉండమని ప్యాకర్ కోరినట్లు స్మిత్ అన్నారు. కానీ స్థానిక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్‌తో మాట్లాడలేదని ప్యాకర్ అన్నారు.
బహిష్కరణతో సహా శిక్షార్హులు
హాలీవుడ్‌లో ప్రముఖ నటుల్లో ఒకరైన స్మిత్ ఆస్కార్‌ను గెలుచుకున్న ఐదో నల్లజాతి వ్యక్తి అకాడమీ తెలిపింది. అయినా స్మిత్ బహిష్కరణతో సహా శిక్షార్హులు అని అకాడమీ తెలిపింది. అకాడమీ ప్రవర్తనా ప్రమాణాలను ఉల్లంఘించినందుకు విల్ స్మిత్‌పై బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ క్రమశిక్షణా చర్యలను ప్రారంభించిందని ప్రకటనలో పేర్కొంది. అకాడమీ ఏదైనా క్రమశిక్షణా చర్య తీసుకోవచ్చు, ఇందులో సస్పెన్షన్, బహిష్కరణ లేదా ఇతర ఆంక్షలు ఉంటాయని వెల్లడించింది.
క్షమాపణలు కోరిన విల్ స్మిత్
అకాడమీ చీఫ్‌లు డాన్ హడ్సన్, డేవిడ్ రూబిన్ స్మిత్‌తో మాట్లాడారని తెలుస్తోంది. 30 నిమిషాల జూమ్ సమావేశంలో అకాడమీ నియమావళి గురించి మాట్లాడినట్లు సమాచారం. సంభాషణ సమయంలో స్మిత్ రాక్‌పై చేసిన దాడికి క్షమాపణలు చెప్పారని తెలుస్తోంది. స్మిత్ సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో రాక్ పై దాడి చేసినందుకు క్షమాపణలు కోరారు. అందులో అతను తన ప్రవర్తనను "ఆమోదించలేనిది, క్షమించరానిది" అని పేర్కొన్నారు. "నేను మీకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను, క్రిస్. నేను తప్పు చేశాను. నా చర్యలకు సిగ్గుపడుతున్నాను." అని రాశారు.