LeT Commander Abu Saifullah: లష్కర్ టాప్ కమాండర్ అబూ సైఫుల్లా దారుణహత్య, భారత్‌లో 3 ఉగ్రదాడుల్లో కీలక నిందితుడు
పాక్ లోని సింధు ప్రావిన్స్‌లో లష్కరే ఉగ్రవాది అబూ సైఫుల్లా హతమయ్యాడు. ఈ ఉగ్రవాది నేపాల్ ద్వారా లష్కర్ ఉగ్రవాదులను భారతదేశంలోకి పంపించేవాడు.

LeT Deputy Commander Razullah Nizamani | ఇస్లామాబాద్: ఆపరేషన్ సింధూర్ తో షాక్‌కు గురైన పాకిస్తాన్ ఉగ్రవాదులకు మరో బ్యాడ్ న్యూస్. లష్కర్-ఎ-తోయిబా డిప్యూటీ కమాండర్ అబూ సైఫుల్లా అలియాస్ రజుల్లా నిజామాని దారుణహత్యకు గురయ్యాడు. పాకిస్తాన్ లోని సింధు ప్రాంతంలో అజ్ఞాత వ్యక్తులు లష్కర్ టాప్ లీడర్ అబూ సైఫుల్లాను కాల్చి చంపారు.
2006లో నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఉగ్రవాద దాడికి కుట్ర పన్నిన కీలక నిందితులలో అబూ సైఫుల్లా ఒకడు. లష్కర్ ఉగ్రవాది అబూ సైఫుల్లా నేపాల్ ద్వారా ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నాడు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలోని మట్లీ ఫలకారా చౌక్ దగ్గర కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అబూ సైఫుల్లాను కాల్చి చంపారు. ఈ లష్కర్ టెర్రరిస్టులు భారతదేశంలో 3 ఉగ్రవాద దాడుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడు. సింధ్‌లోని మట్లీ ఫాల్కారా చౌక్ సమీపంలో నిజామాని దారుణహత్యకు గురయ్యాడని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. లష్కరే తోయిబా వర్గాలలో అతడు జమ్మూ కాశ్మీర్‌లో జిహాదీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. అక్కడ 'అబూ సైఫుల్లా' అనే మారుపేరుతో నెట్‌వర్క్ కొనసాగించాడు.
నేపాల్‌లో లష్కర్ ఉగ్రవాద మాడ్యూల్
లష్కర్ ఉగ్రవాది పేరు అబూ సైఫుల్లా. మరో పేరు మొహమ్మద్ సలీం రాజుల్లా నిజామ్నీ. అబూ సైఫుల్లా నేపాల్‌లో లష్కరే తోయిబా మొత్తం మాడ్యూల్‌ను నిర్వహించాడు. లష్కర్ ఉగ్రవాద కార్యకలాపాలకు సిబ్బందిని ఏర్పాటు చేయడం, ఆర్థిక సహాయాన్ని అందించడం అతడి పనిగా గుర్తించారు.
అబూ సైఫుల్లా పాల్గొన్న మూడు ఉగ్రవాద దాడులు
ఉగ్రవాది అబూ సైఫుల్లా నేపాల్ మార్గం ద్వారా లష్కర్ ఉగ్రవాదులను భారతదేశంలోకి పంపించేవాడు. ఈ క్రమంలో. 2006లో నాగ్‌పూర్‌లోని సంఘ్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిలో కీలక పాత్ర పోషించాడు. 2001లో రామ్‌పూర్‌లోని సిఆర్‌పిఎఫ్ శిబిరంపై జరిగిన దాడిలో కూడా ముఖ్య నిందితుడు అబూ సైఫుల్లా. 2005లో ఐఐఎస్‌సి బెంగళూరుపై జరిగిన దాడిలోనూ అతడు కుట్రదారుడిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అబూ సైఫుల్లా ఎవరు?
లష్కర్-ఎ-తోయిబా టాప్ కమాండర్ అబూ సైఫుల్లా భారతదేశంలో ఉగ్రవాద దాడులకు కుట్ర చేసేవాడు. లష్కరే డిప్యూటీ కమాండర్ స్థాయికి ఎదిగాడు. అబూ సైఫుల్లా అనే పేరుతో మొహమ్మద్ సలీం నేపాల్‌లో తన ఉగ్రవాద నెట్‌వర్క్‌ను విస్తరించాడు. అక్కడి నుండి భారతదేశంలో ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేసేవాడు. .
భారతదేశ రక్షణ సంస్థలు అబూ సైఫుల్లాను మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాయి. దాంతో భయపడిన అబూ సైఫుల్లా నేపాల్ కు మకాం మార్చాడు. ఆ తరువాత నేపాల్ నుంచి పాకిస్తాన్‌కు పారిపోయాడు. పాకిస్తాన్‌లోని సింధు ప్రాంతంలో ఉండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో లష్కరే ఉగ్రవాది అబూ సైఫుల్లా హతమయ్యాడు.
ప్రస్తుతం భారత్, పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఉగ్రవాదంపై భారత్ పోరు కొనసాగుతుందని, ఆపరేషన్ సిందూర్ ఇంకా అయిపోలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై భారత్ గళం వినిపించేందుకు ఏడు మంది ఎంపీల బృందాలను మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీరు అమెరికా, యూకే, యూఏఈ లాంటి కొన్ని దేశాలకు వెళ్లి ఆపరేషన్ సిందూర్ ప్రాముఖ్యతను, పాక్ పెంచి పోషిస్తున్న టెర్రరిజాన్ని కుండబద్దలు కొట్టనున్నారు.






















