Jimmy Carter Dies: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత, ఆయన పేరిట ఎన్నో రికార్డులు
Jimmy Carter Death News | అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతిచెందారు. వందేళ్లు బతికిన అమెరికా మాజీ అధ్యక్షులలో ఆయన ఒకరుు. ఆయన పేరిట ఎన్నో రికార్డులున్నాయి.
Jimmy Carter Former US President Dies At 100 | వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (100) కన్నుమూశారు. వయసురీత్యా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న జిమ్మీ కార్టర్ జార్జియాలోని ప్లెయిన్స్‌లో తుదిశ్వాస విడిచారు. మాజీ అధ్యక్షుడి తనయుడు జేమ్స్ ఇ.కార్టర్ 3 తండ్రి మరణార్తను ప్రకటించారు. జిమ్మీ కార్టర్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం తెలిపారు.
1977- 1981 మధ్య కాలంలో అమెరికా 39వ అధ్యక్షుడిగా జిమ్మీ కార్టర్ పనిచేశారు. 1924 అక్టోబరు 1న జన్మించిన జిమ్మీ కార్టర్ ఇటీవల తన 100వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా చేసి వందేళ్లు బతికిన ఏకైక నేతగా రికార్డ్ సృష్టించారు. నా తండ్రి నాకు మాత్రమే కాదు, అమెరికా ప్రజలకు కూడా హీరో. శాంతి కోసం తపించే ఎందరికో ఆయన స్ఫూర్తి ప్రదాత. మానవ హక్కుల కోసం ఆయన ఎంతగానో శ్రమించారని మాజీ అధ్యక్షుడి కుమారుడు చిప్ కార్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
నోబెల్ శాంతి బహుమతి విజేత
2002లో జిమ్మీ కార్టర్ నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. నోబెల్ అందుకున్న అరుదైన అమెరికా మాజీ అధ్యక్షుడిగా నిలాచారు. ఓ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన రైతుగా పంటలు పండించారు. ఆపై నేవీ ఉద్యోగిగా సేవలు చేసి, గవర్నర్, అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. ఏ పదవి చేపట్టినా మానవతా విలువలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఓ మంచి మానవతావాదిగా ప్రపంచం ఆయనను గుర్తించింది.
భారత్‌తో జిమ్మీ కార్టర్ అనుబంధం
అమెరికా అధ్యక్షుడి హోదాలో జిమ్మీ కార్టర్ 1978లో భారత పర్యటనకు వచ్చారు. ఆయనకు గుర్తుగా హర్యానాలోని ఓ గ్రామానికి కార్టర్‌పురిగా నామకరణం చేశారని కొద్ది మందికి మాత్రమే తెలుసు. అత్యధిక కాలం జీవించిన అమెరికా అధ్యక్షుడిగా ఆయన రికార్డ్ నెలకొల్పారు. కానీ 2015లో ఆయనకు బ్రెయిన్ క్యాన్సర్ సమస్య ఉందని వెల్లడించారు. పీచ్ స్టేట్ గవర్నర్ కావడానికి ముందు ఆయన జార్జియాలోని తన స్వస్థలం ప్లేయిన్స్‌లో వేరుశనగ పంట పండించారు. రైతు నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన తీరు దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అధ్యక్షుడి హోదాలోనే ఆయన అంతే ప్రశాంతంగా, హుందా నడుచుకునే వారు.