Covid Vaccine: వాక్సినేషన్ పూర్తయిన వారికి గుడ్ న్యూస్.. తాజా అధ్యయనంలో ఏం తేలిందంటే..?
కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయిన వారికి సీడీసీ శుభవార్త చెప్పింది. వ్యాక్సిన్లు వేయించుకోని వారితో పోలిస్తే.. వేయించుకున్న వారు మరణించే అవకాశం 11 రెట్లు తక్కువగా ఉందని గుర్తించింది.
కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయిన వారు.. టీకాలు వేయించుకోని వారితో పోలిస్తే మరణించే అవకాశం 11 రెట్లు తక్కువగా ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. అలాగే టీకాలు వేయించుకోని వారితో పోలిస్తే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం 10 రెట్లు తక్కువని తేలింది. అమెరికాకు చెందిన ఆరోగ్య అధికారులు ఈ మేరకు వెల్లడించారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నివేదిక ఈ ఫలితాలను వెల్లడించింది. కోవిడ్ మహమ్మారిని వ్యాక్సిన్లతో కట్టడి చేయగలమని ఈ అధ్యయనాలు స్పష్టం చేశాయి. మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే కోవిడ్ వేరియంట్ అయిన డెల్టా రకం నుంచి మోడెర్నా వ్యాక్సిన్ అధిక రక్షణ ఇస్తుందని అధ్యయనం గుర్తించింది.
అధ్యయనం జరిగిందిలా..
డెల్టా వేరియంట్ తన ప్రభావాన్ని చూపకముందు అంటే ఏప్రిల్ 4 నుంచి జూన్ 19 మధ్య ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాలను డెల్టా వేరియంట్ ప్రభావం అధికంగా ఉన్న జూన్ 20 నుంచి జూలై 17 ఫలితాలతో పోల్చి చూశారు. ఈ రెండు సమయాల్లో.. వ్యాక్సిన్ వేయించుకోని వ్యక్తులతో పోలిస్తే టీకా వేయించుకున్న వారు మరణించే అవకాశం 11 రెట్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రాకపోవడం, మరణించకుండా ఉండటానికి అవసరమైన రక్షణను ఈ టీకాలు కల్పిస్తున్నట్లు గుర్తించారు.
ఈ నెల తర్వాత వృద్ధుల కోసం ప్రత్యేకంగా బూస్టర్ డోస్ వ్యాక్సిన్లు ఇవ్వాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా వీటిని ఈ నెలలో బూస్టర్ డోస్ వ్యాక్సిన్లు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. 65 ఏళ్లు అంతకంటే పైబడిన వయసున్న వారికి బూస్టర్ షాట్‌లను ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై సీడీసీ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థలు సమాలోచనలు జరుపుతున్నాయి.
మోడర్నాతో 95 శాతం రక్షణ..
ఆస్పత్రిలో చేరకుండా రక్షణ కల్పించడంలో టీకాలు కీలక పాత్ర పోషించాయని అధ్యయనంలో గుర్తించారు. మోడర్నా వ్యాక్సిన్ 95 శాతం, ఫైజర్ టీకా 80 శాతం, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ 60 శాతం రక్షణ కల్పించినట్లు తేల్చారు. అన్ని వయసుల వారిలో హాస్పిటలైజేషన్‌కి వ్యతిరేకంగా 86 శాతం సామర్థ్యం దక్కితే.. 75 ఏళ్లు పైబడిన వారిలో 76 శాతానికి పడిపోయిందని గుర్తించారు.
జూన్, ఆగస్టు నెలల మధ్యలో 400కి పైగా ఆస్పత్రులు, ఎమర్జెన్సీ విభాగాలు, అత్యవసర సంరక్షణ కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రభావాన్ని అంచనా వేసిన అధ్యయనాల్లో ఇది కూడా ఒకటి కావడం విశేషం. ఇటీవల అగ్రరాజ్యం అధినేత జో బైడెన్ కొత్త ఇమ్యునైజేషన్ ప్లాన్ ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ అధ్యయన ఫలితాలు వెల్లడయ్యాయి. కొత్త ఇమ్యూనైజేషన్ ప్లాన్ ప్రకారం.. 100 కంటే ఎక్కువ మంది కార్మికులున్న కంపెనీలు తమ సంస్థలోని వారందరికీ వ్యాక్సిన్లు వేయించాలి. అలాగే వారానికోసారి వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలి.
Also Read: Assam Eloped Wife : 25 సార్లు లేచిపోయి తిరిగివచ్చినా ఆదరిస్తున్న భర్త ! ప్రేమంటే ఇదేనా ?