Afghanistan Embassy: భారత్‌తో దౌత్య సంబంధాల కోసం ఆఫ్ఘన్ ఆరాటం
Afghanistan Embassy: భారత్‌తో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం శతవిధాల యత్నిస్తోంది.
Afghanistan Embassy: భారత్‌తో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం శతవిధాల యత్నిస్తోంది. భారత్‌తో సంబంధాలను నిర్వహించడానికి తమ సొంత దౌత్యవేత్తను ఢిల్లీలో నియమించాలని తాలిబాన్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు భారత్‌పై ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తోంది. గత ఏడాది కాబూల్ లోని భారత ఎంబసీని భారత్ తిరిగి ప్రారంభించింది. స్థానిక అధికారులతో కలిసి సేవా కార్యక్రమాలు చేపట్టింది.
ఢిల్లీలో ఎక్కువశాతం మంది ఆఫ్ఘన్ దౌత్యవేత్తలు అష్రఫ్ ఘనీ ప్రభుత్వం నియమించిన వారే. కొన్ని నెలల క్రితం భారత్ వడిచి ఇతర దేశాలకు వెళ్లిపోయిన ఆఫ్ఘన్ రాయబారి ఫరీద్ మముంద్‌జాయ్ కూడా మునుపటి అష్రఫ్ ఘనీ ప్రభుత్వం నియమించబడిన వారే. భారత ప్రభుత్వం నుంచి మద్దతు లేకపోవడంతో ఆఫ్ఘన్ రాయబార కార్యాలయాన్ని మూసివేయవలసి వచ్చిందని మముంద్‌జాయ్ ఇటీవల భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA)కి లేఖ రాసినట్లు తెలిసింది.
ప్రస్తుతం ముంబై, హైదరాబాద్‌లో ఆఫ్ఘన్ కాన్సులేట్‌లు పనిచేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికి భారత్‌లోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయాన్ని కూడా ఆయా ప్రాంతాల్లో నియమించిన అధికారులు నిర్వహించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ముంబైలోని ఆఫ్ఘన్ కాన్సుల్ జనరల్ జకియా వార్దక్ శుక్రవారం మాట్లాడుతూ.. ఆఫ్ఘన్ పౌరులకు కాన్సులేట్ కాన్సులర్, విద్యా, వాణిజ్యపరమైన సహాయాన్ని అందించడాన్ని భారత్ అంగీకరించిందని, ఈ మేరకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
తాజా పరిణామాలపై తాలిబాన్లకు చెందిన ఓ అగ్రనేత మాట్లాడుతూ.. తాలిబాన్‌లు భారతదేశంలో తమ స్వంత అధికారిని నియమించుకుని కాన్సులర్ సేవలు అందించేందుకు యత్నిస్తోందన్నారు. అలాగే భారతదేశంతో నమ్మకాన్ని పెంచుకోవడం కూడా ముఖ్యమని చెప్పారు. భారతదేశంలో వేలాది మంది ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులు చదువుకుంటున్నారని, వారికి వీసాలు, ఇతర కాన్సులర్ సేవలు అవసరమని అన్నారు. వేలాది మంది ఆఫ్ఘన్ పౌరులు వైద్యం కోసం భారత్‌లో పర్యటిస్తుంటారని వారికి సేవలు అందించడానికి కాన్సులర్ సేవలు అవసరం అన్నారు. సమస్యను పరిష్కరించడానికి సమర్థవంతమైన మార్గం చూపాలని కోరారు.
అన్నింటికంటే మించి, రెండు దేశాల మధ్య విశ్వాసం, సానుకూల సంబంధాలను పెంపొందించుకోవడం అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఇదంతా జరగాలంటే కాబూల్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా న్యూఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయంలో దౌత్యవేత్తను నియమించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు.
వాస్తవానికి భారతదేశంతో సంబంధాలను నిర్వహించడానికి ఈ సంవత్సరం ప్రారంభంలో ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం ఒక అధికారిని నియమించింది. అయితే మముంద్‌జాయ్, అతని దౌత్యవేత్తల బృందం ఆ అధికారిని దౌత్యకార్యాలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంది. జూన్, 2022 జూన్‌లో కాబూల్‌లో భారతదేశం తన రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించినప్పటి నుంచి భారత్‌లో ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం ప్రాధాన్యత క్రమబద్ధంగా తగ్గిపోయిందని మాముండ్‌జాయ్ ఆరోపించారు.
మముంద్‌జాయ్ స్వయంగా భారతదేశాన్ని విడిచిపెట్టడం ఒక విధంగా దేశానికి మంచిదేనని భారత ప్రభుత్వ వర్గాలు అన్నాయి. ఈ పరిణామాలను వాస్తవాల నేపథ్యంలో చూడాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో ఉన్న దౌత్యవేత్తలు అంతర్గత పోరు కారణంగా ఇతర దేశాలకు వెళ్లారని అన్నారు. అయితే ఆఫ్ఘన్‌తో దౌత్య సంబంధాల విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది.