కెనడాపై 35 శాతం సుంకాలు, ఆ పని చేయకపోతే మరింత పెంచుతామని ట్రంప్ వార్నింగ్
US Tarrif War against Canada | కెనడా వస్తువులపై 35% సుంకం విధించారు డొనాల్డ్ ట్రంప్. 2025 ఆగస్టు 1 నుంచి అమలు చేస్తామని లేఖలో అమెరికా అధ్యక్షుడు తెలిపారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొరుగు దేశం కెనడాపై టారిఫ్ వార్ ప్రకటించారు. 2025 ఆగస్టు 1 నుండి కెనడా అమెరికాకు దిగుమతి చేసుకునే వస్తువులపై 35% సుంకం చెల్లించాల్సి ఉంటుందని గురువారం నాడు ప్రకటించారు. NBC న్యూస్‌తో ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. "సుంకాల యుద్ధం"లో ఒక ప్రధాన అప్‌డేట్, దీనిని ప్రపంచ మార్కెట్‌లలో అమెరికా స్థానాన్ని సుస్థిరం చేసే ప్రయత్నం’ అని అభివర్ణించారు.
కెనడాను ఒక నిర్దిష్ట రేటుతో ఎంచుకున్నప్పటికీ, అమెరికా ప్రధాన వాణిజ్య భాగస్వాములలో చాలామందిపై ప్రభావం చూపే విస్తృత ప్రణాళికను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. "మిగిలిన దేశాలన్నీ 20 శాతం లేదా 15 శాతం చెల్లించబోతున్నాయి. మేము ఇప్పుడు దీన్ని పరిష్కరించుకుంటాము" అని ట్రంప్ అన్నారు. యూరోపియన్ యూనియన్, కెనడాకు అధికారిక సుంకాల లేఖలు శుక్రవారం నాటికి పంపవచ్చని అధ్యక్షుడు తెలిపారు. ప్రతి దేశానికి లిఖితపూర్వక నోటీసు అందదని ట్రంప్ స్పష్టం చేశారు. "అందరికీ లేఖ పంపించాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు. మేం మా సుంకాలను మాత్రమే నిర్ణయిస్తున్నాం" అని అన్నారు.
కెనడాకు ట్రంప్ రాసిన లేఖలో ఏముంది..
కెనడాకు రాసిన లేఖలో " అమెరికా సంయుక్త రాష్ట్రాలు కెనడాతో కలిసి పనిచేయడానికి అంగీకరించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మా దేశంలోకి మాదకద్రవ్యాలు రాకుండా నిరోధించండి. కానీ డ్రగ్స్ అమెరికాలోకి రాకుండా నిరోధించడంలో కెనడా విఫలమవ్వడం వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఈ సుంకాలు విధిస్తున్నాం. అమెరికాతో కలిసి పనిచేయడానికి బదులుగా, కెనడా తన సొంత సుంకాలను విధించింది" దాని ప్రతిఫలమే ఇది అని ట్రంప్ తన లేఖలో రాశారు.
అమెరికా సుంకాల గురించి ట్రంప్ ఇలా రాశారు. "ఆగస్టు 1, 2025 నుంచి కెనడా నుంచి అమెరికాకు పంపే ఉత్పత్తులపై 35% సుంకం విధిస్తాం. ఇది అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది. కెనడా నుంచి అమెరికాకు ఎగుమతి చేసిన వస్తువులపై ఆ అధిక సుంకం విధిస్తున్నాం" అని తెలిపారు.
ఒకవేళ కెనడా ప్రతిఘటిస్తే...
అమెరికాలో ఉత్పత్తులను తయారు చేయాలని కెనడా నిర్ణయిస్తే, వాటిపై ఎటువంటి సుంకం విధించేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు. తమ దేశంలోకి రావాలనుకుంటే అటువంటి కంపెనీలకు వారాల్లోనే అనుమతులు మంజూరు చేస్తామని కెనడాకు హామీ ఇచ్చారు. "ఒకవేళ మీరు మీ సుంకాలను పెంచాలని నిర్ణయించుకుంటే, మీరు వాటిని ఎంత పెంచాలని ఎంచుకున్నారో, వాటికి అధనంగా అమెరికా 35 శాతం పన్నులు జోడిస్తుందని గుర్తుంచుకోవాలి.
"కెనడాతో మాకు ఉన్న ఏకైక సమస్య ఫెంటానిల్ మాత్రమే కాదని చెబుతున్నాను. పన్నులు, పన్నేతర విధానాలతో పాటు ఇతర వాణిజ్య సమస్యలు తలెత్తుతాయి. కెనాడా నుంచి వస్తున్న డ్రగ్స్ ను నిరోధించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కెనడా మా పాడి రైతులకు అసాధారణమైన సుంకాలను విధిస్తుంది. మా పాడి రైతులు కెనడా ప్రజలకు వారి ఉత్పత్తులను అమ్మడానికి అవకాశం ఉందని భావిస్తున్నాము. వాణిజ్య లోటు దేశ ఆర్థిక వ్యవస్థకు నిజం చెప్పాలంటే అమెరికా జాతీయ భద్రతకు ఒక ప్రధాన ముప్పు" అని ట్రంప్ పేర్కొన్నారు.






















