Donald Trump Tariffs: ట్రంప్ కీలక నిర్ణయం.. ఈ దేశాలకు సుంకాల నుంచి మినహాయింపు.. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం
US Tariffs on India | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఉత్తర్వు జారీ చేశారు. పారిశ్రామిక ఎగుమతులపై సుంకాలు మినహాయింపు ఇచ్చారు. పలు దేశాలతో పాటు అమెరికాకు సైతం ప్రయోజనం చేకూరనుంది.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఒక కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. దీని ప్రకారం సోమవారం (ఆగస్టు 8, 2025) నుంచి అమెరికాతో పారిశ్రామిక ఎగుమతులపై ఒప్పందాలు చేసుకునే భాగస్వామ్య దేశాలకు సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. అంటే ఆ దేశాలపై టారిఫ్ ఎత్తివేస్తారు. ఈ మినహాయింపు ముఖ్యంగా నికెల్, బంగారం, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్ వంటి ముఖ్యమైన వస్తువులపై ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీని లక్ష్యం ప్రపంచ వాణిజ్య వ్యవస్థను పునర్ నిర్మించడం, అమెరికా వాణిజ్య లోటును తగ్గించడంతో పాటు తమ దేశంతో వాణిజ్య భాగస్వాములను మరింత బేరసారాలకు ప్రోత్సహించడం. భారత్ మీద విధించిన 50 శాతం సుంకాలలో ఎలాంటి మార్పు లేదని, రష్యాతో చమురు కొనుగోలు ఆపేస్తే టారిఫ్ నుంచి ఉపశమనం ఉంటుందని ట్రంప్ పదే పదే చెబుతున్నారు.
కొత్త ఉత్తర్వులో ప్రత్యేకత ఏముంది..
డొనాల్డ్ ట్రంప్ ఈ ఉత్తర్వు కింద, 45 కంటే ఎక్కువ వస్తువులను చేర్చారు. దీనిపై అనుబంధ భాగస్వాములకు సున్నా దిగుమతి సుంకం (Zero Tariff) లభిస్తుంది. ఈ భాగస్వామ్య దేశాలు అమెరికాతో ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకం చేస్తాయి. దాంతో ట్రంప్ ప్రభుత్వం ఇటీవల విధించిన సుంకాలను తగ్గించడానికి హామీ ఇస్తారు. జపాన్, యూరోపియన్ యూనియన్ (EU)తో సహా అమెరికా ప్రస్తుత కూటమి దేశాలతో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా ట్రంప్ తాజా నిర్ణయం ఉంది. ఈ మినహాయింపు సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు అమలులోకి వస్తుంది.
ఏ వస్తువులపై మినహాయింపు ఇచ్చారు
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రకారం, అమెరికాలో టారిఫ్ పెంచని.. తవ్వకం జరగని లేదా సహజంగా ఉత్పత్తి చేయని లేదా దేశీయ ఉత్పత్తి సరిపోని వస్తువులకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వర్తిస్తుంది. ఈ మినహాయింపు పొందిన వస్తువులలో సహజ గ్రాఫైట్, వివిధ రకాల నికెల్ (స్టెయిన్‌లెస్ స్టీల్, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలకు అవసరం), లిడోకైన్, వైద్య రోగనిర్ధారణ పరీక్షల రియాజెంట్స్ వంటి ఫార్మాస్యూటికల్ మిశ్రమాలు ఉన్నాయి. అదనంగా బంగారు పొడి, రేకులు, బులియన్ వంటివి ఈ మినహాయింపులలో ఉన్నాయి.
ప్రత్యేక నిబంధనలు, మార్పులు
ట్రంప్ తాజా ఉత్తర్వులో కొన్ని ప్రత్యేక వ్యవసాయ ఉత్పత్తులు, విమానాలు, వాటి భాగాలు, పేటెంట్ లేని ఫార్మాస్యూటికల్ వస్తువులకు మినహాయింపులు ఇచ్చారు. ఉత్తర్వు ప్రకారం, ఒకసారి వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత, కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వు అవసరం లేకుండానే అమెరికా వాణిజ్య ప్రతినిధి (USTR), వాణిజ్య విభాగం, కస్టమ్స్ అధికారులు ఈ వస్తువులపై సుంకాన్ని స్వతంత్రంగా మాఫీ చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఈ కొత్త ఉత్తర్వు ప్లాస్టిక్, పాలీసిలికాన్ (సోలార్ ప్యానెల్లకు అవసరమైనది)తో సహా కొన్ని గతంలోని మినహాయింపులను కూడా రద్దు చేసింది.
స్విట్జర్లాండ్ వంటి ప్రధాన సరఫరా చేసే దేశాలు ఇంకా అమెరికాతో ఎలాంటి ట్రేడ్ డీల్ చేసుకోలేదు. దాంతో ఆ దేశంపై 39% టారిఫ్ విధించారు. ఈ నిర్ణయంతో అమెరికా దేశీయంగా తగినంత పరిమాణంలో లభ్యం కాని వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించాలని భావిస్తోంది. కొత్త ఉత్తర్వు కారణంగా ప్రపంచ వాణిజ్యంపై భారీగా ప్రభావం చూపుతుంది. అమెరికా పారిశ్రామిక ప్రయోజనాలను కాపాడటానికి అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దోహదం చేస్తుంది.






















