China Helps Pakistan: కార్గో విమానంలో పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా ఆరోపణలు, ఘాటుగా స్పందించిన చైనా ప్రభుత్వం, ఆర్మీ
చైనా వైమానిక దళం పాకిస్థాన్‌కు సరకులు తరలించిందన్న వార్తలను తోసిపుచ్చింది.

China denies sending cargo plane with military supplies to Pakistan: చైనా తన అతిపెద్ద సైనిక కార్గో విమానం పాకిస్తాన్‌కు ఆయుధ సరఫరా చేస్తుందని వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. పాకిస్తాన్‌కు చైనా సాయం చేస్తుందని, ఆయుధాలు సరఫరా చేస్తుందనే వార్తలను వ్యాప్తి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చైనా ప్రభుత్వం హెచ్చరించింది.
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ (PLAF) తన జియాన్ Y-20 సైనిక రవాణా విమానం పాకిస్తాన్‌కు ఆయుధాలు తీసుకెళ్లిందన్న వదంతులను ఖండించింది. "Y-20 పాకిస్తాన్‌కు సహాయకంగా కొన్ని రకాల ఆయుధాలు, ఆయుధ సామాగ్రిని సరఫరా చేసినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ విషయం అటు చైనా ప్రభుత్వం, ఇటు ఆర్మీ దృష్టికి వెళ్లింది. ఆ వార్తల్లో నిజం లేదని, తాము ఎలాంటి కార్గో విమానంలో పాక్ ఆర్మీకి ఆయుధాలు, సామాగ్రి సరఫరా చేయలేదని చైనా వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే విషయాన్ని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో సోమవారం వెల్లడించింది.
PLAF తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫోటోలు, కామెంట్లు స్క్రీన్‌షాట్‌లను కూడా పోస్ట్ చేసింది. ప్రతి ఒక్కటి ఎరుపు రంగులో "వార్త" అనే పదంతో ముద్రించారు. "ఇంటర్నెట్ చట్టం కంటే మించింది కాదు. సైనిక సంబంధిత వార్తలను ఉత్పత్తి చేసేవారు వాటికి చట్టపరంగా బాధ్యత వహిస్తారు" అని ఆ నివేదికలో చైనా పేర్కొంది.
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఇటీవల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా దాడులు చేసి నేలమట్టం చేసింది. కానీ పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దులో అమాయక ప్రజల మీద కాల్పులు జరిపింది. అంతటితో ఆగకుండా భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతూ డ్రోన్లు దాడులు, మిస్సైల్ దాడులకు ప్రయత్నించి నవ్వులపాలు అయింది. పాక్ నుంచి వచ్చిన డ్రోన్లు, మిస్సైల్స్ ను భారత బలగాలు విజయవంతంగా నిర్వీర్యం చేశాయి. ఎస్ 400 సుందర్శన చక్రంలా శత్రువుల డ్రోన్లు, ఫైటర్ జెట్స్, మిస్సైల్స్ ను గాల్లోనే పేల్చివేసింది.
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) ఇటీవలి నివేదిక ప్రకారం, చైనా పాకిస్తాన్‌కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా మారింది. 2020 నుంచి 2024 వరకు చైనా పలుమార్లు ఆయుధాలు సరఫరా చేసింది. పాక్ ఆయుధ కొనుగోళ్లలో 81 శాతం చైనా వాటా ఉంది. కొనుగోళ్లలో జెట్ ఫైటర్లు, రేడార్లు, నేవీ షిప్, సబ్‌మెరైన్లు, క్షిపణులు ఉన్నాయి. పాక్, చైనా దేశాలు కలిసి J-17 విమానాలను తయారు చేస్తాయి, ఇది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ (PAF)కు ప్రధాన ఫైటర్ జెట్ గా చెబుతారు.
చైనా నుంచి వచ్చిన ఆయుధాలు, క్షిపణులతో భారత్ మీద దాడులకు యత్నించింది పాకిస్తాన్. వాటిని భారత బలగాలు సరిహద్దుల్లో, గాల్లోనే విజయవంతంగా పేల్చివేసి పాక్ కు బుద్ధి చెప్పాయి. ఇదే క్రమంలో పాక్ లోని రావల్ఫిండి, కరాచీ సహా పలు నగరాలలో ఎయిర్ బేస్ లపై భారత బలగాలు దాడులు చేసి పాక్‌కు విధ్వంసం రుచి చూపించాయి. అయితే చైనా మాత్రం భారత ఎయిర్ బేస్ లపై పాక్ దాడి చేసి నష్టపరిచిందని, అదే సమయంలో పాక్ లో దాడులకు వచ్చిన క్షిపణులు, ఫైటర్ జెట్లు, డ్రోన్లను పాక్ ఆర్మీ విజయవంతంగా కూల్చివేశాయని సైతం చైనా మీడియాలో కథనాలు వచ్చాయి. ఏదైనా విషయం పోస్ట్ చేసే ముందు నిర్ధారించుకోవాలని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం గ్లోబల్ టైమ్స్‌ను హెచ్చరించింది.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. భారత్, పాక్ మధ్య యుద్ధ విరామం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని చైనా స్వాగతించింది. చర్చల ద్వారా పరిష్కారం జరగాలని చైనా ఆశిస్తుందని తెలిపారు.






















