The World Trade: ఎర్ర సముద్రంలో అలజడి! సంక్షోభంలో ఏకంగా లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం
ఎర్ర సముద్రం మీదుగా ఆసియా, యూరప్ ఖండాల మధ్య సాగే వ్యాపారానికి ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. ఈ దారిలో ఎలాంటి వాణిజ్య నౌకలు పంపరాదన్న అమెరికా ఆదేశాలు వాణిజ్యాన్ని ప్రమాదంలో పడేశాయి.
The Red Sea crisis: ఒకటి కాదు, వందకాదు.. ఏకంగా లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం(Trade) సంక్షోభంలో చిక్కుకుంది. ఒకటి రెండు దేశాలకు సంబంధించిన వ్యాపారం కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపారం. ఎర్ర సముద్రం మీదుగా ఆసియా, యూరప్(Europe) ఖండాల మధ్య సాగే వ్యాపారానికి ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. అగ్రరాజ్యం అమెరికా(America).. ఈ దారిలో మరో నాలుగు రోజుల పాటు ఎలాంటి వాణిజ్య నౌకలు పంపరాదంటూ తాజాగా ఆదేశాలు జారీ చేయం.. ఎర్ర సముద్రం(Red Sea)లో హౌతీ ఉగ్రవాదులు సాగిస్తున్న మారణ కాండకు అద్దం పడుతోంది. ఇది ప్రపంచ దేశాల వాణిజ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి.
ఏయే ఉత్పత్తులు..
ఆసియా, యూరప్ ఖండాల్లోని దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య కార్యకలాపాలకు ఎర్ర సముద్రం చాలా దగ్గర దారి. అంతర్జాతీయంగా సముద్ర మార్గం ద్వారా జరుగుతున్న వ్యాపారంలో ఒక్క ఎర్ర సముద్రం మీదుగా జరుగుతున్న వ్యాపారం 15 శాతం. అంటే దాదాపు 50 నుంచి 70 లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. ఇంత పెద్ద వాణిజ్యం.. కూడా హౌతీ ఉగ్రవాదుల కారణంగా తడబాటుకు కారణమైంది. ముఖ్యంగా చమురు, వస్త్రాలు, మాంసం, ముడి పదార్థాలు, ఆహార దినుసులు, వస్తు సామాగ్రి వంటివి ప్రపంచ దేశాల(World Countries) మధ్య ఈ మార్గం ద్వారానే రవాణా అవుతున్నాయి. మెడిటెరేనియెన్ షిప్పింగ్ కంపెనీ, మార్క్స్, హపాగా-లాయిడ్, బ్రిటీష్ పెట్రోలియం వంటి కంపెనీలు నిరంతరాయంగా ఈ మార్గం గుండానే వ్యాపారాన్ని సాగిస్తున్నాయి.
(Photo: Twitter/@ultimateemaster)
విరుచుకుపడుతున్న అగ్రరాజ్యాలు
ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యాలుగా ఉన్న అమెరికా, బ్రిటన్‌లకు ఎర్ర సముద్రం(Red Sea) పెద్ద వాణిజ్య మార్గం. ఈ మార్గం గుండానే మధ్యదరా సముద్రం(Meditarian Sea), సూయిజ్ కాల్వల ద్వారా ఈ రెండు దేశాలు పెద్ద ఎత్తున వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. భారత్(India) కూడా ఈ మార్గం ద్వారా వాణిజ్యాన్ని సాగిస్తోంది. అయితే.. ఇజ్రాయెల్‌కు అమెరికా, బ్రిటన్ లు సాయం చేస్తున్నాయన్న కారణంగా.. హౌతీలు ఎర్ర సముద్రంలో ప్రయాణించే వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. దీంతో వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. దీనిని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమెరికా, బ్రిటన్‌లు ఎదురు దాడి చేస్తున్నాయి. హౌతీ(Houthi) ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు ముమ్మరం చేసింది. యెమెన్‌లోని హౌతీ స్థావరాలపై గత 2 రోజులుగా అమెరికా సేనలు విరుచుకు పడుతున్నాయి. కీలకమైన రాడార్(Radar) కేంద్రాన్ని ధ్వంసం చేశాయి. ఇక, బ్రిటన్ కూడా అత్యంత వేగంగా స్పందిస్తూ.. యెమెన్‌లోని హౌతీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతోంది.
బ్రిటన్ సీరియస్
తమ వ్యాపారాలు, వాణిజ్యానికి అడ్డు తగులుతున్న హౌతీలపై బ్రిటన్ చాలా సీరియస్‌గా వ్యవహరిస్తోంది. హౌతీలు తమ తీరు మార్చుకోకుండా దాడులు చేస్తే.. బ్రిటన్ దళాలు మరోసారి యెమెన్ పై దాడికి వెనుకాడబోవని బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్(Devid Cameroon) హెచ్చరించారు. కేవలం తాము మాటలు మాత్రమే చెప్పబోమని.. చేతల్లో చూపిస్తామని ఆయన తెలిపారు. అమెరికాతో మరిన్ని దాడులు చేయనున్నట్టు ఆయన హెచ్చరించారు. హమాస్(Hamas)కు హౌతీలు మద్దతు ఇవ్వడాన్ని బ్రిటన్ తప్పుబట్టింది. ప్రపంచ వాణిజ్యానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారని.. ప్రపంచ దేశాల నౌకలపై దాడులు చేస్తున్నారని.. దీనిని చూస్తూ ఊరుకోబోమని కూడా బ్రిటన్ వ్యాఖ్యానించింది.
ధరల ముప్పు
ఎర్ర సముద్రంలో హౌతీలు సాగిస్తున్న దాడుల కారణంగా.. గత వారం రోజులుగా నౌకల రవాణా దాదాపు నిలిచిపోయింది. దీంతో బ్రిటన్‌పై తీవ్ర ప్రభావం పడింది. కీలకమైన నిత్యావసర సరుకులకు కొరత ఏర్పడుతోందని బ్రిటన్ అంతర్గత చర్చల్లో తెరమీదకి వచ్చింది. ఇది నిత్యావసర సరుకుల ధరలు పెరిగేందుకు దోహదపడుతోందని.. ప్రభుత్వం సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మాంసం సహా ఇతర నిత్యావసర ధరలు పెరిగితే... ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న బ్రిటన్ ఆర్థిక పరిస్థితి మరింత ఇబ్బందుల్లో పడడం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో హౌతీలను ఎంత త్వరగా కట్టడి చేస్తే అంత మంచిదని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
బ్రిటన్‌లో విపక్షాల అలజడి!
ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్న హౌతీలను కట్టడి చేసే విషయంలో బ్రిటన్ అనుసరిస్తున్న విధానం అంతర్గత రాజకీయ వివాదంగా మారడం గమనార్హం. ప్రధాని రుషి సునాక్.. ఎలాంటి ప్రకటన చేయకుండా, పార్లమెంటుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఒంటెత్తు నిర్ణయాలు తీసుకుంటున్నారని.. విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే.. విపక్షాలను ఉద్దేశించి ప్రధాన మంత్రి కార్యాలయం కూడా అంతే తీవ్రంగా స్పందిస్తోంది. ఎర్ర సముద్రంలో జరుగుతున్న అలజడి కారణంగా ప్రపంచం చాలా అస్థిరతను ఎదుర్కొంటోందని సునాక్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దాడులను చూస్తూ కూర్చుని, తర్వాత ఏర్పడే పరిణామాలను ఎదుర్కొనే పరిస్థితిలో దేశం లేదని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. హౌతీల కారణంగా బ్రిటన్ వ్యాణిజ్యమే కాకుండా.. రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు స్పష్టమవుతోంది.
దారికి రాని హౌతీలు!
హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా సాగిస్తున్న తమ పోరు మరింత తీవ్రతరం అవుతుందని హౌతీల ప్రతినిధి ఒకరు వెల్లడించడం గమనార్హం. అమెరికా దళాలు తమ రాడార్‌ను కూల్చేశామని చెబుతున్నా.. తమకు ఎలాంటి ముప్పు లేదని, తమ అధీనంలోని 28 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నా.. తమను బెదిరించలేరని ఆయన వ్యాఖ్యానించారు. తమకు బ్రిటన్, అమెరికాలు ఎలాంటి ప్రభావం చూపించలేవని కూడా ఆయన చెప్పుకొచ్చారు. హమాస్ పై ఇజ్రాయెల్ దాడులు ఆగేవరకు, ఇజ్రాయెల్‌కు ఇతర ప్రపంచ దేశాల మద్దతు నిలువరించే వరకు తమ దాడులు కొనసాగుతాయని ఆయన హెచ్చరించడం గమనార్హం.
పెరిగిన ధరలు
ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే నౌకలపై హౌతీల దాడులు కొనసాగుతున్న క్రమంలో దాదాపు అన్ని ధరలు పెరుగుతున్నాయి. ప్రధానంగా ఈ నౌకలకు చేయిస్తున్న బీమా వ్యయాలు దాదాపు 200 శాతం చొప్పున పెరిగాయి. ఇది రవాణా వ్యయాలపైనే పడుతోంది. దీంతో ట్రాన్స్‌పోర్టు ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. అదేవిధంగా బ్రిటన్ సహా ఇతర దేశాల్లో చమురు నిల్వలు మరో 10 రోజులకు మాత్రమే సరిపడా ఉన్నాయి. దీంతో ఈ ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇతర ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.