పుతిన్‌ని అరెస్ట్ చేయడమా? అసలు ఆ ఆలోచనే లేదు - బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్
G20 Summit 2023: G20 సదస్సుకి పుతిన్ వచ్చి ఉంటే అరెస్ట్ అయ్యే వారన్న వాదనల్ని బ్రెజిల్ ప్రెసిడెంట్ కొట్టి పారేశారు.
G20 Summit 2023:
పుతిన్ అరెస్ట్‌పై బ్రెజిల్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలు
భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన G20 సదస్సుకి హాజరు కావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి ఆహ్వానం పంపారు. కానీ...ఆయన పలు కారణాల వల్ల హాజరు కాలేదు. ఆ దేశం తరపున ప్రతినిధులు హాజరయ్యారు. అయితే...దీనిపై ఇప్పటికే యూకే ప్రధాని రిషి సునాక్ అసహనం వ్యక్తం చేశారు. ముఖం చూపించుకోలేకే పుతిన్ ఈ సమ్మిట్‌కి రాలేదని మండి పడ్డారు. మరికొందరైతే ఓ వాదన తీసుకొచ్చారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ICC) పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఒకవేళ ఆయన దేశం దాటి బయటకు వస్తే అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపించాయి. అందుకే ఆయన భారత్‌కి రాలేదనీ కొందరు చెబుతున్నారు. ఈ వివాదంపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాకియో స్పందించారు. ఈ సదస్సుకి పుతిన్ వచ్చినా అరెస్ట్ అయ్యే అవకాశమే ఉండేది కాదని తేల్చి చెప్పారు. వచ్చే ఏడాది బ్రెజిల్‌లో G20 సమావేశాలు జరగనున్నాయి. ఆ సమ్మిట్‌కి కూడా పుతిన్‌ని తప్పకుండా పిలుస్తామని వెల్లడించారు లూయిజ్. అంతకు ముందు రష్యాలో BRICS సమావేశాలు జరగనున్నాయి. ఈ భేటీకి తాను వెళ్తానని చెప్పారు బ్రెజిల్ అధ్యక్షుడు.
"ఈ G20 సదస్సుకి పుతిన్ వచ్చి ఉన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉండేదే కాదు. వచ్చే ఏడాది బ్రెజిల్‌లో G20 సమావేశాలు జరగనున్నాయి. ఆయనకు నేను తప్పకుండా ఆహ్వానం పంపుతాను. ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రెజిల్‌కి రావచ్చు. పుతిన్ మా దేశానికి వస్తే అరెస్ట్ చేయం అని నేను హామీ ఇస్తున్నాను"
- లూయిజ్ ఇనాకియో, బ్రెజిల్ అధ్యక్షుడు
పుతిన్ హెల్త్ సీరియస్..?
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై రెండేళ్లుగా ఏవో పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ మీడియా పుతిన్ హెల్త్‌పై చాలా సందర్భాల్లో వార్తలు రాసింది. ఆయన తరవాత రష్యాన్ని లీడ్ చేసేది ఎవరు..? అనే స్థాయిలో చర్చలు కూడా జరిగాయి. అయితే...ఈ వార్తలపై రష్యా అధికారికంగా ఎప్పుడూ స్పందించలేదు. కానీ...ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. పుతిన్ ఆరోగ్యం క్షీణించిందని పోస్ట్ చేశాడు ఓ బ్లాగర్. పుతిన్ ఫొటోనీ షేర్ చేశాడు. "దయచేసి మమ్మల్ని వదిలేసి వెళ్లిపోకండి. మీరు బతికుండాలని, ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం" అని పోస్ట్ పెట్టాడు. ఈ ఒక్క పోస్ట్‌తో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. పుతిన్‌కి ఏమైంది అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఇంత జరుగుతున్నా రష్యా మాత్రం ఏ మాత్రం స్పందించడం లేదు. ఇవి పుకార్లే అని ఖండిస్తూ ఓ ప్రకటన కూడా చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిజంగానే ఆయన ఆరోగ్యం క్షీణించిందా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇదే పోస్ట్‌ని ఉక్రెయిన్ ఇంటర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా షేర్ చేశారు. "ఏం జరుగుతోంది" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు. ఈయన షేర్ చేయడం వల్ల ఈ పోస్ట్ మరింత వైరల్ అయింది.
Also Read: బ్రెజిల్ అధ్యక్షుడికి G20 ప్రెసిడెన్సీ బాధ్యతలు, గ్యావెల్ అప్పగించిన ప్రధాని