వివాదంలో పేటీఎం, లైసెన్సు రద్దవుతుందా? అసలేం జరిగింది?
దేశవ్యాప్తంగా వినియోగదారులకు చేరువై, నిత్యం కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే పేటీఎం ఇప్పుడు వివాదంలో చిచ్చుకుంది. ఏకంగా లైసెన్సు రద్దయ్యే స్థితికి చేరుకుంది. మరి కారణాలేంటి? ఏంజరిగింది?
Paytm dispute : ``పేటీఎం కరో..`` అంటూ దేశవ్యాప్తంగా వినియోగదారులకు చేరువైన డిజిటల్ చెల్లింపుల అగ్రగామి సంస్థ పేటీఎం( Paytm). ప్రతి మొబైల్ ఫోన్‌లోనూ దాదాపు ఈయాప్ ఉంటుంది. డిజిటల్(Digital) పే మెంట్లు చేసేవారు దాదాపు అందరూ దీనిని వినియోగించే ఉంటారు. క్షణకాలంలోనే చెల్లింపులు చేయడంతోపాటు, భద్రతకు, పారదర్శకతకు కూడా పేటీఎం పెట్టింది పేరు. ముఖ్యంగా 2016-17 మధ్య కాలంలో దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత.. డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి సమయంలో పేటీఎం మరింతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఎక్కడ చూసినా.. ఏ దుకాణం ముందు ఆగినా.. పేటిఎం స్కానింగ్ స్టిక్కర్లు కనిపించకుండా ఉండవు. అలాంటి పేటీఎం ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఏకంగా లైసెన్సు రద్దయ్యే పరిస్థితికి చేరుకుంది.
ఎక్కడి సంస్థ..
పేటీఎం(Paytm) అనేది మల్టీనేషనల్ కంపెనీ. నోయిడా కేంద్రంగా మన దేశంలో డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవలు అందిస్తోంది. 2010లో వన్97 కమ్యూనికేషన్స్ కింద విజయ్ శేఖర్ శర్మ(Vijay Shakar Sharma) అనే వ్యక్తి దీనిని స్థాపించారు. కంపెనీ వినియోగదారులకు మొబైల్ చెల్లింపు సేవలను అందించడంతోపాటు, వ్యాపారులు QR కోడ్, పేమెంట్ సౌండ్‌బాక్స్, ఆండ్రాయిడ్ ఆధారిత- పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్, ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ఆఫర్‌ల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో, Paytm మైక్రోలోన్‌లు కూడా అందిస్తోంది. కేవలం నగదు లావాదేలే కాకుండా.. విద్యుత్ సహా అనేక రకాల బిల్లుల చెల్లింపులకు కూడా Paytm గేట్ వేగామారింది.
ఇవీ ఆరోపణలు..
క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతా(Rural Area)లకు కూడా విస్తరించిన పేటీఎంపై మనీలాండరింగ్ వంటి తీవ్ర ఆరోపణ లు వచ్చాయి. దీంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) చిక్కుల్లో పడింది. నీలాండరింగ్ ఆందోళనలు, కేవైసీ(వినియోగదారు ధ్రువీకరణ ప్రక్రియ) నిబంధనలను పాటించలేదనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఈ కారణం గానే పీపీబీఎల్ సేవలపై ఇటు కేంద్రం, అటు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ఆర్బీఐ వర్గాలు విచారణకు దిగి వాస్తవం ఏంటనేది పరిశీలించాయి. ఈ విచారణలో పీపీబీఎల్‌లో లక్షలాది అకౌంట్ల ప్రారంభంలో కేవైసీ నిబంధనల ఉల్లంఘన జరిగిందని గుర్తించారు. అంతేకాదు.. ఒకే పాన్ నంబర్‌తో పలు ఖాతాలు తెరిచారని కూడా గుర్తించారు.
కనీస కేవైసీతో తెరిచే ఈ అకౌంట్లలో కొన్నింటి ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.కోట్లలో ఉండటం మనీలాండరింగ్ జరిగి ఉండవచ్చన్న సందేహాలకు తావిస్తోందని ఆర్బీఐ పేర్కొంది. పీపీబీఎల్లో దాదాపు 35 కోట్ల ఈ వాలెట్లు ఉండగా, వీటిలో 31 కోట్ల వాలెట్లు అచేతనంగా ఉన్నాయి. మిగతా వాలెట్లలోనూ.. జీరో లేదా అతి స్వల్ప బ్యాలెన్స్ ఉందని గుర్తించారు. దీన్ని బట్టి మనీలాండరింగ్ అక్రమాల కోసం చాలా మంది బోగస్ ఖాతాలు తెరిచి ఉండవచ్చని భావిస్తున్నారు.
2021 నుంచే..
సీపీబీఎల్లో కేవైసీ యాంటీ మనీలాండరింగ్ నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు ఆర్బిఐ 2021లోనే గుర్తించిందని, లోపాలను సరిదిద్దుకోవాలని బ్యాంకును ఆర్బీఐ అప్పట్లోనే ఆదేశించింది. అయినప్పటికీ, బ్యాంక్ వ్యవహారంలో మార్పు లేనందున కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా 2022 మార్చిలో ఆర్బీఐ నిషేధం విధించింది. అలాగే, బ్యాంక్‌లో సమగ్ర ఆడిటింగ్ కోసం ఓ సంస్థను కూడా నియమించింది. ఆడిటింగ్ రిపోర్టు ఆధారంగానే బ్యాంకై ఆర్బీఐ చర్యలు చేపట్టింది.
ఈ నెల 20 గడువు!
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్.. లైసెన్సును పచ్చే నెలలో రద్దు చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆలోచిస్తున్నట్టు ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. అయితే, ఇప్పటికే ఉన్న డిపాజిటర్ల సొమ్ముకు రక్షణ కల్పించాక బ్యాంక్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ముందుగా పేటీఎం వివరణ తీసుకుని చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. పీపీబీఏల్లో మనీలాండరింగ్ జరిగినట్లు ఆర్బీఐ గుర్తిస్తే ఈడీ దర్యాప్తును కోరే అవకాశం ఉంటుంది. సీపీబీఎల్ పై చర్యలు చేపట్టేందుకు ఆర్బీఐకి అన్ని అధికారాలు ఉండడం గమనార్హం. ఈ నెల 20 తర్వాత కస్టమర్ల సేవింగ్, కరెంట్ అకౌంట్లతో పాటు ప్రీ-పెయిడ్ సాధనాలైన వాలెట్లు, నేషనల్ కామన్ మొబి లిటీ కార్డు(ఎన్సీఎంసీ) పాస్టాగ్ అకౌంట్లలోకి డిపాజిట్లు లేదా టాప్-అప్‌లను స్వీకరించవద్దని పీపీబీఏలను ఆర్బీఐ తాజాగా ఆదేశించింది.
ప్రభావం పడింది!
ఆర్బీఐ చర్యలతో పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ పేరు రోజువారీ ట్రేడింగ్ తగ్గిపోయింది. ఈ ట్రేడింగ్ 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు స్టాక్ ఎక్సేంజ్‌లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రకటించాయి. దీంతో పేటీఎంపై పెట్టుబడులు పెట్టిన వారు నష్టపోనున్నారు.