Viral Video: 2020లో మళ్లీ ట్రంప్‌ని ఓడిస్తా, బైడెన్ వింత వ్యాఖ్యలు - టైమ్ ట్రావెలింగ్ చేస్తారేమో అంటూ నెటిజన్ల సెటైర్లు
Joe Biden: 2020లో మరోసారి ట్రంప్‌ని ఓడించి తీరతానంటూ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వింత వ్యాఖ్యలు చేశారు. 2024 కి బదులుగా 2020 అని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
US President Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మళ్లీ పొరబడ్డారు. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తల్ని తప్పుబట్టిన ఆయన ట్రంప్‌పై కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్‌ని మళ్లీ ఓడిస్తానని చెప్పారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఆ తరవాతే అందరూ ఆశ్చర్యపోయే కామెంట్స్ చేశారు. "ట్రంప్‌ని 2020లో మళ్లీ ఓడిస్తాను" అని అన్నారు. 2024లో అనాల్సింది 2020 అనేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆయన స్పీచ్‌లతో అందరినీ షాక్‌కి గురి చేశారు బైడెన్. ఇప్పుడు మరోసారి అదే పని చేశారు.
Biden says he will beat Trump 'again in 2020' pic.twitter.com/KZmVreHBym
— The Spectator Index (@spectatorindex) July 5, 2024
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. "అనవసరంగా బైడెన్‌ని ఎందుకంత ప్రెజర్ చేస్తున్నారు" అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. 81 ఏళ్ల బైడెన్ అధ్యక్ష పదవికి సరైన వ్యక్తి కాదని రిపబ్లికన్‌లు తీవ్రంగా మండి పడుతున్నారు. ఆయనకు చాలా ఆరోగ్య సమస్యలున్నాయని, ఇలాంటి వ్యక్తి దేశాన్ని ఎలా నడిపిస్తారని ప్రశ్నిస్తున్నారు. పైగా ఇటీవల ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లోనూ బైడెన్ దీటుగా సమాధానాలు ఇవ్వలేకపోయారు. దీనిపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ మాట్లాడుతుంటే నిద్ర వచ్చిందని బైడెన్ సెటైర్లు వేసినప్పటికీ అవి పెద్దగా పేలలేదు. పలు సందర్భాల్లో అంతర్జాతీయ వేదికల్లోనూ వింతగా ప్రవర్తించారు బైడెన్. ఉన్నట్టుండి ఫ్రీజ్ అవడం, ఎవరినీ పలకరించకపోవడం లాంటివి ఆయన ఆరోగ్య స్థితిపై అనుమానాలకు తావిచ్చింది.
అయితే ఇటీవల జో బైడెన్ తన ఆరోగ్య పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రశాంతంగా నిద్రపోవాలని, అలా అయితేనే పని చేయగలనని తేల్చి చెప్పారు. రాత్రి 8 గంటల తరవాత ఎలాంటి ప్రోగ్రామ్‌లు లేకుండా షెడ్యూల్ మార్చాలని అధికారులను ఆదేశించారు. అధ్యక్ష రేసులో ఉన్నానని చెబుతూనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బైడెన్ హెల్త్‌కి సంబంధించి రకరకాల రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి. ఆయన సాయంత్రం 4 దాటితే అంతా అయోమయంగా ఉంటున్నారని, ఏ పనీ చేయలేకపోతున్నారని ఓ రిపోర్ట్ వెల్లడించింది. ఒక్కోసారి విపరీతంగా నీరసపడిపోతున్నారని తెలిపింది. అయితే ట్రంప్‌తో జరిగిన డిబేట్‌పైనా ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. ఈ డిబేట్‌కి ముందు బైడెన్ విదేశీ పర్యటనలకు వెళ్లచ్చారని, ఆ అలసటతోనే ఎక్కువగా మాట్లాడలేకపోయారని ఆయన సపోర్టర్స్ చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠగా మారనున్నాయి. ఇప్పటికే బ్రిటన్ ఎన్నికలు ముగిశాయి. అక్కడ రిషి సునాక్ పార్టీ ఓటమి చవి చూసింది. కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ ఫలితాల తరవాత అందరి దృష్టి అమెరికా ఎన్నికలపైనే పడింది.
Also Read: Rahul Gandhi: అగ్నివీర్ స్కీమ్‌పై మరో సంచలన వీడియో, మోదీ సర్కార్‌ని నిలదీసిన రాహుల్