Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!
Wild Poliovirus case : దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మొజాంబిక్ లో మొదటి వైల్డ్ పోలియో కేసు నమోదు అయింది. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో ఇది రెండో కేసు.
Wild Poliovirus Case : సుమారు మూడు దశాబ్దాల తర్వాత మొజాంబిక్‌లో తొలి వైల్డ్ పోలియో కేసు నమోదైంది. 1992 తర్వాత మొజాంబిక్‌లో మొదటిసారి పోలియో వ్యాధికి సంబంధించిన కేసు నమోదు అయింది. ఈ సంవత్సరం దక్షిణాఫ్రికా దేశంలో ఇది రెండో కేసు. ఈ ఏడాది ప్రారంభంలో మలావిలో వైల్డ్ పోలియో కేసు నమోదు అయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్రికా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ మత్షిడిసో మొయిటీ వివరాల ప్రకారం, మొజాంబిక్ లో పోలియో కేసును గుర్తించడం “చాలా ఆందోళనకరమైనది” అని తెలిపారు. ఈ వైరస్ ఎంత ప్రమాదకరమైనది, చాలా త్వరగా వ్యాప్తి చెందుతుందని ఆయన అన్నారు.
2020లో ఆఫ్రికా ఖండం వైల్డ్ పోలియో రహితంగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. అయితే, తాజా పోలియో వైరస్ టైప్ 1 కేసు, ఆ ధృవీకరణను ప్రభావితం చేయదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఎందుకంటే ఇది ఇంపోర్టెడ్ స్ట్రెయిన్ అని WHO తెలిపింది. ది గార్డియన్ నివేదిక ప్రకారం, పోలియో నిర్మూలన అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ విజయాలలో ఒకటి. వైల్డ్ పోలియో వైరస్ కేసులు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లలో మాత్రమే నమోదు అవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
మొజాంబిక్‌లోని ఈశాన్య టెట్ ప్రావిన్స్‌లో ఈ పోలియో కేసు గుర్తించారు. ఈ వైరల్ సోకిన పిల్లవాడిలో మార్చి చివరిలో పక్షవాతం లక్షణాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో మలావిలో వైల్డ్ పోలియో వైరస్ కేసు రికార్డు అయింది. 2019లో పాకిస్తాన్‌లో గుర్తించిన ఈ స్ట్రెయిన్‌తో తాజా కేసు ముడిపడి ఉందని జెనోమిక్ సీక్వెన్సింగ్ విశ్లేషణ సూచించినట్లు ది గార్డియన్ నివేదించింది.
పోలియో వైరస్
పోలియో, లేదా పోలియో మైలిటిస్, ఒక అంటు వ్యాధి. ఇది ప్రధానంగా మల పదార్థం ద్వారా ఓరల్ కాంటామినేషన్ ద్వారా వ్యాపిస్తుంది. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, వైరస్ సోకిన వ్యక్తి మలంలో ఈ వైరస్ నివసిస్తుంది. కాబట్టి ఈ వ్యాధి సోకిన వ్యక్తులు మలవిసర్జన తర్వాత చేతులు బాగా కడుక్కోనప్పుడు అది ఇతరులకు వ్యాపిస్తుంది. మలపదార్ధాలు కలిసిన కలుషిత నీరు, ఆహారం తినడం వల్ల కూడా వ్యాధి సోకుతుంది.
ఈ వైరస్ పిల్లల్లో పక్షవాతానికి కారణమవుతుంది. వారిని వికలాంగులను చేస్తుంది. కొన్నిసార్లు ఈ వైరస్ ప్రాణాంతకం కూడా అవుతుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు, కానీ టీకా వ్యాధి రాకుండా నివారిస్తుంది. వైల్డ్ వైరస్ ను పోలియో టీకా ద్వారా అడ్డుకోవచ్చని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. ఈ వైరస్ పేగులో పెరుగుతుంది. వైరస్ నాడీ వ్యవస్థపై దాడి చేసి పక్షవాతాన్ని కలిగిస్తుంది. ఒకసారి ఈ వైరస్ ప్రభావం చూపితే రోగి జీవితాంతం వికలాంగుడిలా ఉండాల్సి పరిస్థితి.
పోలియో లక్షణాలు
CDS ప్రకారం, పోలియో వైరస్ బారిన పడిన చాలా మంది వ్యక్తులలో(100లో 72 మంది) ముందుగా లక్షణాలు కనిపించవు. పోలియో వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న 4 మందిలో ఒకరికి (లేదా 100లో 25 మంది) ఫ్లూ లాంటి లక్షణాలను కనిపిస్తాయి. గొంతు నొప్పి, జ్వరం, అలసట, వికారం, తలనొప్పి, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు సాధారణంగా 2 నుంచి 5 రోజుల వరకు ఉంటాయి. ఆపై వాటంతట అవే తగ్గిపోయాయి. పోలియో వైరస్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న వ్యక్తులలో తక్కువ భాగం (100లో ఒకరు లేదా 1000లో 1-5 మంది) మెదడు, వెన్నుముకపై ప్రభావితం చూపుతుంది.
- పరేస్తేసియా (కాళ్లలో పిన్స్, సూదులు ఉన్నట్లు)
- మెనింజైటిస్ (వెన్నుపాము/లేదా మెదడు ఇన్ఫెక్షన్) పోలియో వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న 25 మందిలో 1కి సంభవిస్తుంది.
- పక్షవాతం (శరీరంలోని భాగాలను కదలవు) లేదా చేతులు, కాళ్లు లేదా రెండింటిలో బలహీనత, పోలియో వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న 200 మందిలో ఒకరికి సంభవిస్తుంది.
పక్షవాతం అనేది పోలియోతో సంబంధం ఉన్న అత్యంత తీవ్రమైన లక్షణం. ఎందుకంటే ఇది శాశ్వత వైకల్యం, మరణానికి దారితీస్తుంది. పోలియో వైరస్ సంక్రమణ వలన పక్షవాతం వచ్చిన 100 మందిలో 2 నుంచి 10 మంది మరణిస్తున్నారు. ఎందుకంటే వైరస్ శ్వాస తీసుకోవడానికి సహాయపడే కండరాలను ప్రభావితం చేస్తుంది. పూర్తిగా కోలుకున్నట్లు అనిపించే పిల్లలు కూడా 15 నుంచి 40 సంవత్సరాల తర్వాత కండరాల నొప్పి, బలహీనత లేదా పక్షవాతం వస్తుంది. దీనిని పోస్ట్ పోలియో సిండ్రోమ్ అంటారు.
వ్యాధి సంక్రమణం
పోలియో వైరస్ చాలా అంటువ్యాధి. వ్యక్తి నుండి వ్యక్తికి సంక్రమిస్తుంది. ఇది సోకిన వ్యక్తి గొంతు, పేగులలో వైరస్ నివసిస్తుంది. నోటి ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి మలం లేదా సోకిన వ్యక్తి తుమ్ము లేదా దగ్గు తుంపరల ద్వారా వ్యాపిస్తుంది.
నివారణ
పోలియో వ్యాక్సిన్ పోలియో వైరస్‌తో పోరాడేందుకు శరీరాన్ని సిద్ధం చేసి పిల్లలను రక్షిస్తుంది. దాదాపు పిల్లలందరిలో (99 మంది పిల్లల నుండి 100 మంది వరకు) పోలియో వ్యాక్సిన్ అన్ని సిఫార్సు మోతాదులను పొందిన వారు పోలియో వైరస్ నుంచి రక్షణ పొందారు. పోలియోను నిరోధించేందుకు రెండు రకాల టీకాలు ఉన్నాయి. ఇన్‌యాక్టివేటెడ్ పోలియోవైరస్ వ్యాక్సిన్ (IPV) రోగి వయస్సును బట్టి కాలు లేదా చేతికి ఇంజెక్షన్‌గా ఇస్తారు. యునైటెడ్ స్టేట్స్‌లో 2000 సంవత్సరం నుంచి IPV మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఓరల్ పోలియోవైరస్ వ్యాక్సిన్ (OPV) ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు ఉపయోగిస్తున్నారు.