EVMs in Elections: ఈవీఎంలను నిషేధించిన దేశాలివే, అక్కడంతా పాత పద్దతిలోనే
EVMs in Elections : భారతదేశంలో ఏ ఎన్నికలు జరిగినా ఈవీఎంలపై చర్చ జరగడం సర్వసాధారణమైపోయింది. ఈవీఎంలపై నిషేధం విధించిన దేశాలు చాలా ఉన్నాయి. ఆయా దేశాల్లో ఇప్పుడు బ్యాలెట్ పేపర్‌పై ఎన్నికలు జరుగుతున్నాయి.
EVMs in Elections : దేశంలో ప్రస్తుతం జమిలీ ఎన్నికలపై చర్చ నడుస్తోంది. ఒకేసారి అన్ని ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన ఎప్పట్నుంచో ఉన్నప్పటికీ ఆ ప్రక్రియకు నేడు ముందడుగు పడింది. ఈ రోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఒకే దేశం - ఒకే ఎన్నికలకు సంబంధించిన బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టారు. అయితే ఎన్నికలగానే గుర్తొచ్చేది ఈవీఎంలు. వీటి వల్ల ఇప్పటికే చాలా దేశాల్లో వాదనలు, ఆందోళనలు జరిగిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఏ ఎన్నికలు జరిగినా ఈవీఎంలపై చర్చ జరగడం సర్వసాధారణమైపోయింది. అయితే ఈవీఎంలను నిషేధం విధించిన దేశాలు చాలా ఉన్నాయని చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయా దేశాల్లో ఇప్పుడు బ్యాలెట్ పేపర్‌పై ఎన్నికలు జరుగుతున్నాయి.
భారతదేశంలో ఏ ఎన్నికల జరిగినా.. ఆ తర్వాత ఈవీఎంలపై చర్చ జరగడం మామూలైపోయింది. ఉదాహరణకు చూసుకుంటే.. దాదాపు ఒక నెల క్రితం, మహారాష్ట్ర, జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ సమయంలో ప్రతిపక్షాలు EVM ట్యాంపరింగ్ ఆరోపణలు చేశాయి. అయితే ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించిన తర్వాత ఏ దేశాలు నిషేధించాయో తెలుసా? ఏయే దేశాలు EVMలను నిషేధించాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈవీఎం అంటే ఏమిటి?
ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. EVMలో రెండు యూనిట్లు ఉంటాయి. అందులో కంట్రోల్ ఒకటి. ఇది పోలింగ్ అధికారితో పర్యవేక్షణలో ఉంటుంది. మరొకటి బ్యాలెట్. ఇది ఓటింగ్ కంపార్ట్ మెంట్ లోపల ఉంటుంది.
ఈ దేశాల్లో ఈవీఎంలపై నిషేధం
భారతదేశం పొరుగు దేశమైన బంగ్లాదేశ్ ఇటీవల తన ఎన్నికలలో EVMల వినియోగాన్ని నిషేధించింది. అదే సమయంలో, ఆసియా దేశమైన జపాన్ కూడా ఎన్నికలలో ఈవీఎంల విశ్వసనీయతపై సందేహంతో నిషేధించింది. ఇది కాకుండా, ఇటీవల చాలా దేశాలు సైతం ఈవీఎంలను నిషేధించాయి. ఇందులో జర్మనీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్ ఉన్నాయి. 2018లో మునిసిపల్ ఎన్నికల తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను (EVMలు) ఉపయోగించడం నిలిపివేసిన తాజా దేశం జపాన్.
బంగ్లాదేశ్‌లో బ్యాలెట్ బాక్స్ ఎన్నికలు
2018 సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ ఈవీఎంలను ఉపయోగించింది. కానీ ప్రతిపక్ష పార్టీలు దీనిని వ్యతిరేకించడంతో, బంగ్లాదేశ్ 2023 సాధారణ ఎన్నికల నుండి సాంప్రదాయ బ్యాలెట్ బాక్సులను ఉపయోగించడం ప్రారంభించింది. అదే సమయంలో, వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జరగబోయే ఎన్నికల్లోనూ ఈవీఎంలను కాకుండా బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు.
ఈవీఎంలు రాజ్యాంగ విరుద్ధమన్న జర్మనీ
2009లో జర్మన్ కోర్టు ఈవీఎంలు రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత, ప్రజల పరిశీలనపై ఆందోళనల కారణంగా వాటిని నిషేధించారు ఈవీఎంలు ప్రజల పరిశీలన కోసం రాజ్యాంగ అవసరాలకు అనుగుణంగా లేవని జర్మనీ నిర్ధారించింది. ఈవీఎంలు కంప్యూటర్ ఆధారిత వ్యవస్థలు కావడం వల్ల సాధారణ పౌరులకు అంతర్లీనంగా అపారదర్శకంగా ఉంటాయని కోర్టు గుర్తించింది.
ఈవీఎం ద్వారా పాకిస్థాన్ లో ఎన్నికలు?
మరోపక్క చాలా దేశాలు తమ ఎన్నికల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM)ని ఉపయోగించే అవకాశాలను అన్వేషిస్తున్నాయి. ఇందులో పాకిస్థాన్ కూడా ఉంది. ఇది ప్రోటోటైప్ EVM ను డెవలప్ చేసింది. దీని ద్వారానే వచ్చే ఎన్నికలను నిర్వహించాలని ఆలోచిస్తోంది.
ఇండియాలో ఈవీఎంల ఎంట్రీ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) అంటే ఓట్లను నమోదు ( రికార్డ్ ) చేయడానికి మానవ సహాయంతో ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ లు బ్యాలెట్ పత్రాలకు ప్రత్యామ్నాయంగా వచ్చాయి. భారత దేశంలో మొదటిసారి 1982 సంవత్సరంలో కేరళ రాష్ట్రం లోని నెం.70 పర్వూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఉపయోగించారు.