DIDI MEETS MODI : మోదీతో దీదీ భేటీ..! కానీ ...
ఢిల్లీలో ప్రధానితో మమతా బెనర్జీ భేటీ అయ్యారు. నిధులు, వ్యాక్సిన్లపై చర్చించారు. అయితే ఢిల్లీలో ఆమె ఎక్కువగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టేందుకు ప్రయత్నిస్తారు..!
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. బెంగాల్ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీకి వచ్చి ప్రధానితో సమావేశం కావడం ఇదే ప్రథమం. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు.. వ్యాక్సిన్ల అంశంపై చర్చలు జరిగినట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే వీరి సమావేశం చాలా స్వల్ప సమయమే జరిగింది. దాదాపుగా పదిహేను నిమిషాలు మాత్రమే ఇరువురు మాట్లాడుకున్నారని అంటున్నారు. బెంగాల్ ఎన్నికలు.. ఆ తర్వాత పరిణామల నేపధ్యంలో... బీజేపీ, తృణమూల్ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితి ఉంది బీజేపీ క్యాడర్‌పై బెంగాల్‌లో దాడులు చేస్తున్నారని ఆ పార్టీ హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. మోడీ కూడా పలు సందర్భాల్లో ఈ అంశంపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించడానికి కుట్ర చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు.
మమతా బెనర్జీ సీఎం అయిన తర్వాత వచ్చిన వరదల సందర్భంగా ప్రధాని పరిశీలకు వెళ్లినప్పుడు ఆయనతో మీటింగ్‌ను మమతా బెనర్జీ ఎగ్గొట్టారు. ఇది వివాదాస్పదమయింది. ఆ తర్వాత బెంగాల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న అలాపన్ బందోపాధ్యాయ వ్యవహారంలోనూ కేంద్రం వర్సెస్ బెంగాల్ సర్కార్ అన్నట్లుగా పోరాటం నడిచింది. ఈ వ్యవహారాల నేపధ్యంలో మోడీ, మమతా భేటీ అందరికీ ఆసక్తికరంగా మారింది. అయితే... ప్రధానమంత్రి కాబట్టి మర్యాదపూర్వకంగా కలిశారని.. మమతా బెనర్జీ ఢిల్లీ టూర్ ఎజెండా వేరని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానితో భేటీకి ముందే.. కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌తో మమతా సమావేశం అయ్యారు. సోనియాతోనూ సమావేశం అయ్యే అవకాశం ఉంది. మరో మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి.. విపక్ష నేతలందరితోనూ సమావేశం కానున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి మోడీని ఢీకొట్టేందుకు అందర్నీ ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్.. తెర వెంనుక వ్యూహాలతో మమతా బెనర్జీకి సాయం చేస్తున్నారు. ఇప్పటికే శరద్ పవార్ సహా పలువురితో పీకే సమావేశమై.. చర్చలు జరిపారు. మమతా బెనర్జీ బీజేపీని తేలిగ్గా తీసుకోవాలనుకోవడం లేదు. ఎలాగైనా సరే ఈ సారి బీజేపీని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఆమే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఇటీవల సంచలనం రేపుతున్న పెగాసస్ వ్యవహారంలో కేంద్రం విచారణకు వెనుకడుగు వేస్తున్నప్పటికీ.. తాను మాత్రం... ఇద్దరు మాజీ న్యాయమూర్తులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వమే పెగాసుస్ ద్వారా .. రాజకీయ ప్రత్యర్థులపై నిఘాకు పాల్పడిందనే ఆరోపణల మధ్య.. ఈ విచారణ కమిటీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.