Weather Update: నేడు ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు.. ఈ చల్ల గాలులకు కారణం ఏంటంటే..
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఏపీలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. చాలాచోట్ల వాతావరణం పొడిగానే ఉంటుందని వివరించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బుధ, గురువారాల్లో వాతావరణ పరిస్థితులను అధికారులు అంచనా వేశారు. పశ్చిమ దిశ నుంచి వీస్తున్న శీతల గాలుల ఫలితంగా రెండు రాష్ట్రాల్లోనూ కాస్త చల్లటి వాతావరణం ఉండొచ్చని వాతావరణ అధికారులు వివరించారు. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఏపీలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని వారు అంచనా వేశారు. చాలాచోట్ల వాతావరణం పొడిగానే ఉంటుందని వివరించారు.
తెలంగాణలో ఈ జిల్లాల్లో చిన్నపాటి వానలు
హైదరాబాద్‌లోని వాతావరణ విభాగం అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు. కానీ, ఆగస్టు 4న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, ఖమ్మం, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో వాతావరణం పొడిగానే ఉంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా..
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 4న విశాఖపట్నంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్‌గా, గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఆకాశం మేఘాలతో నిండి ఉంటుందని, వాతావరణ చల్లగా ఉంటుందని వివరించారు. మొత్తం రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
దేశంలో వర్షపాతం తక్కువే..
కేంద్ర వాతావరణ విభాగం గత నెల జులైలో దేశ వ్యాప్తంగా కురిసిన వర్షపాత సమాచారాన్ని ప్రకటించింది. తెలంగాణలో కాస్త అధిక వర్షపాతం, ముంబయికి వరదలు సంభవించినా.. దేశవ్యాప్త సరాసరి పరిశీలిస్తే సాధారణం కంటే 7 శాతం తక్కువగా వర్షపాతం నమోదయింది. జులై తొలి వారంలో కేరళ నుంచి రుతుపవనాలు వచ్చాయని, అవి చురుగ్గా కదిలినా చివరికి జులై నెలలో 7 శాతం లోటుతో వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
ఆగస్టు 4న దేశంలో 8 ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని మొత్తం 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురవనుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఆ వివరాలను వాతావరణ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు imd.gov.in వెబ్ సైట్‌ను కానీ, mausam.imd.gov.in వెబ్‌సైట్‌ను గానీ సందర్శించవచ్చు.
Also Read: Gold-Silver Price August 4: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. వెండి కూడా నేల చూపులు, తాజా ధరలివీ..