Weather Latest Update: మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోత- ముందుకు కదలని రుతుపవనాలు
ఏపీలోని కొన్ని తీర ప్రాంత జిల్లాల్లో వడగాలులు ఉంటాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బిపర్‌జోయ్ తుపాను తెలుగు రాష్ట్రాలపై పెద్ద ప్రభావమే చూపించింది. ఎప్పుడో వారం రోజుల క్రితం ఏపీని తాకిన రుతుపవనాలు ముందుకు కదలడం లేదు. తుపాను కారణంగా వాటి విస్తరణలో మందగమనం ఏర్పడింది. మరో రెండు రోజులు అయితే కానీ రుతుపవనాల్లో కదలిక ఉండబోదని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఓవైపు రుతుపవనాల్లో చలనంలేకపోవడం... రెండో వైపు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఏప్రిల్, మే నెలను తలపిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి బయటకు రావాలంటే జనం భయపడిపోతున్నారు. ఇంట్లో ఫ్యాన్, ఏసీ, కూలర్ ఏదో ఒకటి లేకపోతే ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బిపర్‌జోయ్ ప్రభావం పూర్తిగా తగ్గేంత వరకు ఇలానే ఉంటుందని చెబుతున్నారు.
అందుకే ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖాధికారులు ప్రజలకు అప్రమత్త సందేశాన్ని ఇచ్చారు. మరో రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వడగాలులు, ఉక్కపోత ఉండే ఛాన్స్ ఉందని అవసరమైతే కానీ బయటకు రావద్దని చెబుతున్నారు. ఇవాళ(శనివారం) 264 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు, రేపు(ఆదివారం) 42 మండలాల్లో తీవ్రవడగాల్పులు,203 మండలాల్లో వడగాల్పులు వీయొచ్చని అంచనా వేస్తున్నారు.
ఉష్ణోగ్రతలు సరే సరి... తగ్గేదేలే అంటున్నట్టు సూరీడు మంటపుట్టిస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రత కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో నమోదు అయింది. అక్కడ 46.8 డిగ్రీలు ఉష్ణోగ్రత రిజిస్టర్ అయింది. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 370 మండలాల్లో తీవ్రవడగాల్పులు,132 మండలాల్లో వడగాల్పులు వీచాయి.
తెలంగాణలో వాతావరణం
తెలంగాణలోని 11జిల్లాలకు ఇవాళ(శనివారం ) ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో వేడి గాలులు ఎక్కువ ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఆదిలాబాద్, ఆసిఫాపాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగగర్ భూపాల్‌పల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యపేట, నల్గొండలో ఇవాళ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు సూచిస్తున్నారు. ఆదివారం నుంచి పరిస్థితుల్లో మార్పు వస్తుందని పేర్కొంటున్నారు.
ఉష్ణోగ్రత విషయానికి వస్తే మాత్రం ఈ 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మితా జిల్లాకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. అంటే ఆజిల్లాలలో 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. మిగతా జిల్లాల్లో 36 నుంచి40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటుందని పేర్కొంది. ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
శుక్రవారం చాలా ప్రాంతాల్లో 40డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కనిష్ణ ఉష్ణోగ్రత 25 డిగ్రీలు అంతకు మించి నమోదు అయింది. అత్యధిక ఉష్ణోగ్రత 42.8 డిగ్రీలతో భద్రాచలంలో టాప్‌లో ఉంటే... కనిష్ట ఉష్ణోగ్రతలో 24 డిగ్రీల కనిష్ఠ హయత్‌నగర్ టాప్‌లో ఉంది. ఆరుకుపైగా ప్రాంతాల్లో 40డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
వర్షం విషయానికి వస్తే మాత్రం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌లో అసలు వర్షాలే పడే సూచనలు లేవని తేల్చేసింది. మిగతా జిల్లాల్లో మాత్రం ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది. ఖమ్మం, నాగర్‌కర్నూల్‌లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. మిగతా ప్రాంతాల్లో జల్లులు మాత్రమే పడొచ్చు.