తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరింత ఉక్కపోత - రేపటి నుంచి వర్షాలు పడే ఛాన్స్
పశ్చిమగాలులు పాకిస్థాన్ నుంచి ఉత్తర అరేబియా మీదుగా భారత్‌లోకి ప్రవేశిస్తున్నాయి. దీని కారణంగా వాతావరణలో మార్పులు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ, ఏపీ వెదర్ మ్యాన్ చెబుతున్నారు. దీని వల్ల వేడి వాతావరణం తగ్గుతుందని ఉక్కపోత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పిడుగులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ స్థితి
పశ్చిమగాలులు పాకిస్థాన్ నుంచి ఉత్తర అరేబియా మీదుగా భారత్‌లోకి ప్రవేశిస్తున్నాయి. దీని కారణంగా వాతావరణలో మార్పులు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ పశ్చిమగాలులు ఇవాళ మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతాయిని రేపటికల్లా తెలంగాణ చేరుకొని తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తాయని చెబుతున్నారు.
ఈ పశ్చిమగాలుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు మరికొన్ని చోట్ల చెదురుమదురు వానలు పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అందుకే రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 16 నుంచి 21 వరకు వర్షాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఉరుములు, పిడుగులు, ఈదురు గాలలు, వడగళ్ల వానలు పడతాయని అందుకు తగ్గట్టుగానే ప్రజలు ప్రిపేర్ అవ్వాలని సూచిస్తున్నారు.
పశ్చిమగాలులకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అధిక పీడన ప్రాంతం వల్ల తెలంగాణలో ఉత్తర భాగంలో అక్కడక్కడా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. విండ్ కాన్ఫ్లెంట్ జోన్ కారణంగా తేమ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉక్కపోత మొదలవుతుంది. దీని కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు కావచ్చని అంచనా. తూర్పు, ఆగ్నేయ తెలంగాణలో ఎండలు ఎక్కువగా ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా తేమగాలు కారణంగా ఉక్కపోత పెరిగే ఛాన్స్ ఉంది. విశాఖ దానికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో నెల్లూరు, అమలాపురం, బాపట్ల, ఒంగోలు, శ్రీకాకుళం, విజయనగరంలో ఉక్కపోత వాతావరణం కనిపిస్తుంది. రాయలసీమలో మాత్రం వేడి వాతావరణం ఎక్కువ ఉంటుంది.
మార్చి 16న తెలంగాణలో వర్షాలు పెరుగుతాయి. మార్చి 16 రాత్రి సమయం నుంచి తెలంగాణ తూర్పు భాగాలతో పాటుగా ఎన్.టీ.ఆర్., ఏలూరు, కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. మార్చి 17 నుంచి తూర్పు తెలంగాణ జిల్లాలతోపాటుగా కోస్తాంధ్ర వ్యాప్తంగా వర్షాలు జోరందుకోనున్నాయి. ముఖ్యంగా ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నంతో పాటుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు పిడుగులు ఉండనున్నాయి. మిగిలిన జిల్లాలైన తిరుపతి, కడప, కర్నూలు, నంధ్యాల, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలను చూడగలం. ఇది మార్చి 17 నుంచి 21 వరకు ఉండనుంది.
తెలంగాణలో ఈ జిల్లాల్లో వానలు
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెదర్ బులెటిన్‌లో తెలిపింది. ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. 16, 17 తేదీల్లో కూడా వర్షాలు కొనసాగనున్నాయి. 17న మాత్రం వర్షాలు మరింత భారీగా ఉంటాయని అంచనా వేశారు.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
మార్చి 16 నుంచి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు ఒకటిలేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెదర్ బులెటిన్‌లో తెలిపింది. గాలులు కూడా కాస్త ఎక్కువగా ఉంటాయని, దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.