చిన్న దేశమే కదా అని చిన్న చూపు చూస్తే ఊరుకోం - భారత్‌పై మాల్దీవ్స్ అధ్యక్షుడి పరోక్ష విమర్శలు
India Maldives Row: తమను చిన్న చూపు చూస్తే ఊరుకోమంటూ భారత్‌పై మాల్దీవ్స్ ప్రెసిడెంట్ విమర్శలు చేశారు.
India Vs Maldives:
ముయిజూ కీలక వ్యాఖ్యలు..
భారత్, మాల్దీవుల మధ్య కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనతో మొదలైన విభేదాలు ముదురుతూ వచ్చాయి. ఆ తరవాత మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజూ చైనా పర్యటన ఈ అలజడిని మరింత పెంచింది. దాదాపు ఐదు రోజుల పాటు అక్కడే పర్యటించిన ముయిజూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమది చిన్న దేశమే అన్న చిన్న చూపు చూడొద్దని, అలాంటి కవ్వించే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. అయితే...భారత్ పేరు ప్రస్తావించకుండానే ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే పరోక్షంగా భారత్ గురించే ఈ కామెంట్స్ చేశారన్న చర్చ గట్టిగానే జరుగుతోంది.
"మాది చూడడానికి చిన్న దేశమే కావచ్చు. అలా అని మమ్మల్ని కవ్వించే హక్కు ఎవరికీ లేదు. ఎవరూ చిన్న చూపు చూడాల్సిన పని లేదు. మా దేశాన్ని మేము అతి పెద్ద ఎకనామిక్ జోన్‌గా చూస్తున్నాం. మా చుట్టూ ఉన్న సముద్రం మాదే. అది వేరే ఏ దేశానికీ చెందినది కాదు. మేం ఎవరి దగ్గరా చేయి చాచడం లేదు. మాకు ఎవరి అండా అవసరం లేదు. మాదో స్వతంత్ర ప్రాంతం"
- మహమ్మద్ ముయిజూ, మాల్దీవ్స్ అధ్యక్షుడు
చైనాలో పర్యటన..
చైనా పర్యటనలో భాగంగా ముయిజూ ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య 20 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాలు పరస్పరం సహకరించుకునేందుకు అంగీకరించాయి. అంతే కాదు. ఈ భేటీ తరవాత జాయింట్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. మాల్దీవ్స్ స్వతంత్రతను కాపాడేందుకు చైనా ఎప్పుడూ మద్దతునిస్తుందని చైనా తేల్చి చెప్పింది. మాల్దీవ్స్‌లో 130 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు చైనా ఆమోదం తెలిపింది. మాల్దీవ్స్‌లోని రోడ్లను నిర్మించేందుకు భారీ ఎత్తున చైనా ఖర్చు చేయనుంది. కొన్ని కీలక ప్రాజెక్ట్‌లనూ చేపట్టనుంది. ద్వైపాక్షిక బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరు దేశాలూ నిర్ణయించుకున్నాయి. ముందు నుంచీ భారత్‌కి దూరంగా ఉంటున్న ముయిజూ...క్రమంగా చైనాకి దగ్గరవుతున్నారు.
భారత్‌తో మైత్రి కొనసాగించేందుకు ముయిజూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అక్కడి మంత్రులు కొందరు ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీ లక్షద్వీప్ పర్యటనతో మొదలైన వివాదం..క్రమంగా పెద్దదైంది. గతేడాది అక్టోబర్‌లో మహమ్మద్ ముయిజూ అధ్యక్ష పదవిని చేపట్టారు. అప్పటి నుంచీ భారత్‌కి దూరంగానే ఉంటున్నారు. మాల్దీవ్స్‌లో భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఓ సారి ఢిల్లీ వచ్చి భేటీ అయ్యారు కూడా. కానీ...భారత్ అందుకు అంగీకరించడం లేదు. భారత్‌పై విద్వేషపూరిత ప్రచారం చేయడానికీ ప్రస్తుత ప్రభుత్వం సహకరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొవిడ్‌కి ముందు చైనా నుంచే మాల్దీవ్స్‌కి ఎక్కువగా పర్యాటకులు వెళ్లేవారు. ఈ విషయాన్ని మహమ్మద్ ముయిజూ గుర్తు చేశారు. త్వరలోనే చైనా టూరిస్ట్‌లను ఎక్కువ సంఖ్యలో ఆకర్షించేలా చర్యలు చేపడతామని హామీ కూడా ఇచ్చారు. పలువురు ఇండియన్ టూరిస్ట్‌లు మాల్దీవ్స్ ట్రిప్‌ని రద్దు చేసుకున్న సమయంలోనే కావాలనే ఈ వ్యాఖ్యలు చేశారు ముయిజూ.
Also Read: మొబైల్ దొంగిలించారని బట్టలూడదీసి మూకదాడి, చేతులు కట్టేసి కొట్టిన స్థానికులు - వైరల్ వీడియో