Wayanad landslides: వయనాడ్ లో గల్లంతైన 130మంది కోసం అడవిని జల్లెడ పడుతున్న రెస్క్యూ టీం
Wayanad Missing Victims: వయనాడ్ విపత్తు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. 200లకు పైగా మృతదేహాలను గుర్తించగా.. 130 మంది ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు పేర్కొన్నారు.
Wayanad landslides: కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో జులై 30న కొండ చరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన యావత్ దేశాన్ని కలచి వేసింది. ఈ విపత్తులో దాదాపు నాలుగు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఘటన సంభవించి రెండు వారాలు కావొస్తున్నా ఆ విలయం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఈ విపత్తులో వందలాది మంది గల్లంతయ్యారు. ఇంకా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆప్తులను కోల్పోయిన బాధితులు ఎంతోమంది ఉన్నారు. ఈ విషాదాన్ని గుర్తుచేసుకుంటేనే ఇంకొంతమంది కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఈ ఘటన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా స్పందించి సహాయ చర్యలు చేపట్టాయి. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కీలక ప్రకటన చేశారు.
ఇంచు ఇంచు గాలింపు
వాయనాడ్‌లో వినాశకరమైన ఘటన తర్వాత ఇప్పుడు చలియార్ నది, దాని ఒడ్డు, చుట్టుపక్కల అటవీ ప్రాంతాలలో భారీ సెర్చింగ్ ఆపరేషన్ ప్రారంభించనున్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్, పోలీసు, అగ్నిమాపక దళం, అటవీ శాఖ అధికారులతో సహా 190 మంది సభ్యుల బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నట్లు ఎడిజిపి ఎంఆర్ అజిత్ కుమార్ తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 200లకు పైగా మృతదేహాలను గుర్తించగా.. 130 మంది ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు పేర్కొన్నారు. రెండు వారాలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ దొరకని వారి జాడ కోసం చలియార్ నది, పరిసర అటవీ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. ఎగువ ప్రాంతం మొత్తం పూర్తి అయిందని, ప్రస్తుతం దిగువన తమ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ప్రస్తుం నీటిమట్టం తగ్గడంతో మృతదేహాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. సోమవారం చేపట్టిన గాలింపులో పలు శరీర భాగాలు లభ్యమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
400మంది మృతి.. 51 గుర్తించని మృతదేహాలు
జూలై 30న సంభవించిన కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 400 మంది మరణించినట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు. 200మంది మృతదేహాలను గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మృతదేహాలలో 51 మందిని గుర్తించలేదు. ఇంకా 130 మందికి పైగా గల్లంతయ్యారు. గత సోమవారం సెర్చ్ ఆపరేషన్‌లో కొన్ని మృతదేహాల భాగాలను అధికారులు కనుగొన్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతంలో సోమవారం ఉదయం ప్రారంభమైన సెర్చ్ ఆపరేషన్ ఐదు ప్రాంతాలుగా విభజించబడింది. అయితే ముండక్కై, చురల్‌మల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కొంతసేపు నిలిచిపోయింది. అన్ని ప్రాంతాలను మళ్లీ ఇంచు ఇంచు స్కాన్ చేసే వరకు సెర్చింగ్ కొనసాగుతుంది. వాయనాడ్ జిల్లాలోని ముండక్కై, చురల్‌మల ప్రాంతాలను కొండచరియలు దాదాపు పూర్తిగా నాశనం చేశాయి. సవాళ్లతో కూడిన భూభాగంలో బృందాలు అవిశ్రాంతంగా పని చేస్తున్నాయి.
ప్రతి అంశంపై క్షుణ్నంగా పరిశీలన
బాధిత కుటుంబాలకు వారి ఆప్తుల కడసారి చూపునైనా దక్కించేందుకు రెస్క్యూ బృందాల కృషి చేస్తున్నాయి. ఈ భారీ సెర్చ్ ఆపరేషన్‌లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు నిశ్చయించుకున్నారు. ఇంకా ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా లేదా ప్రభావిత ప్రాంతాల్లో గల్లంతైన వారి మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు క్లిష్ట పరిస్థితులతో కూడా పోరాడుతూనే ఉన్నాయి.