Power Bill : సింగిల్ రూమ్‌కి రూ. 13 లక్షల కరెంట్ బిల్లు - కట్టలేదు.. ఏం జరిగిందంటే ?
పుదుచ్చేరిలోని ఓ వ్యక్తి ఇంటికి లక్షల్లో కరెంట్ బిల్ వచ్చింది. కానీ అతను కట్టలేదు. ఆయనేం చేశాడంటే ?
Power Bill : కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని ప్రతీ నెలా గగ్గోలు పెట్టే వాళ్లు ఉంటారు. వాడుకుంటే రాదా అని బిల్లు ఇచ్చే వ్యక్తి కూడా అలాగే రివర్స్ సమాధానం ఇస్తారు. అది అన్ని చోట్లా జరిగేదే. కానీ పుదుచ్చేరిలో మాత్రం ఇలా ఎక్కువ వచ్చిన బిల్లు చూసి ఇంట్లో ఉన్నాయని మూర్చపోతే... ఆ బిల్లు ఇచ్చిన వ్యక్తి నాకెందుకని కనిపించకుండా పరారయ్యాడు. ఎందుకంటే ఉదయం టీవీ మెకానిక్‌గా చేస్తూ.. నైట్ వాచ్‌మెన్‌గా పని చేసే ఆ వ్యక్తి ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు ఏకంగా రూ. పదమూడు లక్షలు మరి. తన జీవితం అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఒక్క సారి కూడా చూడలేదని ఆయన మొత్తుకున్నా వినలేదు.
పుదుచ్చేరి విశ్వనాధన్ నగర్‌లో టీవీ మెకానిక్‌గా పనిచేసి, రాత్రి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న శరవణన్‌కి ఇంత భారీ కరెంటు బిల్లు రావడంతో షాక్‌కు గురయ్యాడు.అసలు రీడింగ్ మెషిన్ 6 అంకెలకు బదులు 5 అంకెలు ఎలా చూపించిందో తెలియక శరవణన్ బిల్లులోని తప్పును సరిదిద్దుకునేందుకు కరెంట్ ఆఫీసు చుట్టూ తిరిగాడు. మొత్తం మీద అధికారులు సాంకేతిక లోపాన్ని గుర్తించి సరిచేశారు. పొరపాటున మీటర్ రీడింగ్ చివరిలో అదనపు జీరో వచ్చిందని, దీన్ని గుర్తించి తప్పును సరిదిద్దుకుందాం అని అధికారులు తెలిపారు. చివరికి సాంకేతిక లోపంగా గుర్తించిన అధికారులు తప్పును సరిదిద్దడంతో శరవణన్ ఊపిరి పీల్చుకున్నారు.
గతంలో అతని విద్యుత్ మీటర్ రీడింగ్ 20,630 కాగా జూలై నెలలో ఇచ్చిన బిల్లులో 2,11,150 యూనిట్లు చూపగా 1,90,520 యూనిట్లు వాడినట్లు బిల్లులో చూపారు. అద్దె ఇంట్లో ఉంటున్న శరవణన్ ప్రతినెలా రూ.600-700 వరకు కరెంట్ బిల్లు కట్టేవాడు. ఇలాంటి సమస్యలు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం అన్నిచోట్లా డిజిటల్ మీటర్లే ఉన్నాయి. ఈ మీటర్లలో కొన్ని సార్లు రీడింగ్ జంప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. దీంతో, మీటరు రీడింగ్ అధికంగా చూపిస్తుంది. అంటే ఒక యూనిట్ తిరిగితే, దానిని నాలుగు, ఐదు, పది ఇలా తప్పుడు యూనిట్లు చూపిస్తుంది. వినియోగించిన దాని కంటే ఎక్కువ యూనిట్లు చూపిస్తుంది. అంటే ఏదైనా మీటరు ఒక యూనిట్ కు 4 యూనిట్లు జంపైతే...వంద యూనిట్లు విద్యుత్ వినియోగం చేస్తే...అది నాలుగు వందల యూనిట్లుగా చూపిస్తుంది. 10 యూనిట్లు జంపైతే...వెయ్యి యూనిట్లు చూపిస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. మీటరుతో పాటు మీటరు రీడింగ్ తీసే మిషన్లలో కూడా టెక్నికల్ సమస్యల వల్ల కూడా అధిక బిల్లులు వస్తాయి. మీటర్ రీడింగ్ తీసే మిషన్లలోని చిన్నచిన్న డిజిటల్ పరికరాలు, స్కానర్లు వంటివి పాడైతే కూడా వినియోగంతో పొంతన లేని రీడింగులను చూపిస్తూ అధిక బిల్లులకు కారణమవుతాయి. విద్యుత్ మీటరు, లేదా మీటరు రీడింగ్ తీసే మిషన్లు ఈ రెండిట్లో తలెత్తే సాంకేతిక సమస్యల కారణంగానే రీడింగ్ జంపింగ్ జరుగుతుంటుంది. సమస్య విద్యుత్ అధికారుల వద్ద ఉన్నా.. బిల్లు ఎక్కువ పొందిన సామాన్యులే కరెంట్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తోంది.