Visakhapatnam: ఆలయం వద్దే బిక్షాటన, అదే గుడి హుండీలో రూ.50 వేలు వేసిన గొప్ప యాచకుడు !
Visakhapatnam Beggar: ఓ వ్యక్తి వేరే రాష్ట్రం నుంచి వచ్చి గుడి వద్ద బిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అలా వచ్చిన 50 వేల రూపాయలను అదే గుడి హుండీలో వేశాడో యాచకుడు.
Visakhapatnam Beggar: ఓ యాచకుడు ఆలయం మెట్ల వద్ద కూర్చొని వచ్చిభక్తుల వద్ద బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అలా వచ్చిన సొమ్ములో సగ భాగాన్ని అదే గుడికి విరాళంగా ఇచ్చాడు. అయితే ఆ డబ్బు ఎక్కువ మొత్తంలో ఉండటం అదీ.. 50 వేల రూపాయలు కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
యూపీ నుంచి వలస వచ్చి..
ఉత్తర ప్రదేశ్ కు చెందిన పురంధర్ అనే వ్యక్తి 14 ఏళ్ల క్రితం విశాఖ నగరానికి వలస వచ్చాడు. అప్పటి నుంచి నక్కవానిపాలెంలోని ఉమా నీల కంఠేశ్వర స్వామి ఆలయం పరిసరాల్లో ఉంటూ గుడి మెట్లపై కూర్చొని వచ్చి పోయే భక్తుల వద్ద బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆలయం వెనుక భాగంలోని స్నానాల గదిని వాడుకుంటూ అందులోనే తన దుస్తులు కూడా దాచుకుంటూ ఉంటాడు. అయితే ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం ఆలయ అర్చకుడు ఆ గదికి తాళం వేశాడు. అయితే అందులో తన బట్టలు ఉన్నాయని యాచకుడు పురంధర్ ఆలయ అర్చకుడిని కోరగా అతడు తాళం తీశాడు. వెంటనే యాచకుడి ముళ్లె తీసి బయట పడేశాడు. అయితే మూటలో ఉన్న చిల్లర డబ్బులన్నీ కింద పడిపోయాయి.
అయితే ఆ డబ్బు చాలా ఎక్కువగా ఉండడంతో అర్చకుడు విషయాన్ని ఆలయ అధికారులకు తెలిపాడు. దేవాదయ, ధర్మాదాయ సాఖ అసిస్టెంట్ కమీషనర్ శిరీష, కార్యనిర్వాహణ అధికారి పైలా శేఖర బాబు, 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి శనివారం ఆలయానికి చేరుకొని యాచకుని వద్ద ఉన్న నగదు విషయమై ఆరా తీశారు. అయితే ఆ చిల్లర డబ్బులన్నీ తాను యాచించగా వచ్చినవేనని.. భక్తులు చేసిన ధర్మం డబ్బులేనని తేలింది. వీటన్నిటిని లెక్కించగా.. లక్షకు పైగానే ఉంది. దీంతో యాచకుడు అందులోని సగం డబ్బును స్వామి వారికి విరాళంగా సమర్పించుకుంటానని.. మిగిలిన సగం తనకు అనారోగ్యం చేస్తే వైద్య ఖర్చులకు వినియోగించుకుంటానని వివరించాడు. అలా 50 వేల రూపాయలకు ఎక్కువగా ఉన్న నాణేలను హుండీలో వేశారు.
విజయవాడలోనూ బిక్షాటన ద్వారా 15 లక్షలు విరాళమిచ్చిన సాధువు..
ఓ సాధువు తాను బిక్షాటన చేస్తూ వచ్చిన సొమ్మును దైవ సేవకు దానం చేసి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. యాదిరెడ్డి అనే సాధువు విజయవాడ ముత్యాలంపాడు షిర్డీ సాయిబాబా మందిరం వద్ద నిత్యం బిక్షాటన చేస్తుంటారు. తెలంగాణకు చెందిన యాదిరెడ్డి తన చిన్న వయస్సులోనే విజయవాడకు వచ్చేశారు. అప్పటి నుండి రైల్వే స్టేషన్ లో ఉంటూ జీవనం సాగించాడు. మొదట్లో రిక్షా తొక్కి జీవనం సాగించేవాడు. ఆ తరువాత వయసు మీద పడటంతో బిక్షాటన సాగించటం మెదలు పెట్టాడు. అలా వచ్చిన సొమ్మును తిరిగి దేవుడికే సమర్పించాలని నిర్ణయించారు. బిక్షాటనతో వచ్చిన సొమ్మును తన అవసరాలకు ఖర్చు చేయకుండా బ్యాంకులో సేవ్ చేశారు.
ఇప్పటి వరకూ రూ.15 లక్షలు విరాళం
బ్యాంకులో నగదు లక్ష రూపాయలు అయిన ప్రతి సారి దేవుడి కార్యక్రమాలకు విరాళంగా ఇస్తుంటారు యాదిరెడ్డి. దీంతో ఇప్పటి వరకు అతను 15 లక్షల రూపాయలను దైవ కార్యక్రమాలకు విరాళంగా సమర్పించారు. తాజాగా ముత్యాలంపాడు సాయిబాబా ఆలయంలో నిర్వహిచిన తండులాభిషేకం కోసం లక్షా ఎనిమిది రూపాయలు విరాళంగా అందజేశాడు. 2017లో బాబా మందిరంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి ఒక లక్ష, 2018లో లక్ష కొబ్బరి బొండాల అభిషేకానికి లక్ష రూపాయలు, 2019లో గోశాల నిర్మాణానికి 3 లక్షలు, దత్తాత్రేయుడి వెండి విగ్రహానికి రూ.50 వేలు విరాళంగా ఇచ్చారు.