Visakha News : విశాఖ ఎయిర్ పోర్టు ఘటన, ఐదుగురు పోలీసులపై వేటు!
Visakha News : విశాఖ ఎయిర్ పోర్టు ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐదుగురు పోలీసులపై వేటుపడింది.
Visakha News : విశాఖ ఎయిర్ పోర్టు ఘటనపై పోలీసులపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడి ఘటనకు సంబంధించి ఐదుగురు పోలీసులను బదిలీ చేసింది. విశాఖ ఎయిర్ పోర్ట్ (లా అండ్ ఆర్డర్) ఇన్స్ స్పెక్టర్ సహా విశాఖలో 5 గురు ఇన్స్పెక్టర్ లపై వేటుపడింది. ఎయిర్ పోర్ట్ ఇన్స్ స్పెక్టర్ (లా అండ్ ఆర్డర్) ఉమాకాంత్, కంచరపాలెం ఇన్స్పెక్టర్ పీవీఎస్ఎన్ కృష్ణారావులను ఉన్నతాధికారులు వీఆర్ కు సరెండర్ చేశారు.
అసలేం జరిగింది?
విశాఖలో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన జనవాణి కార్యక్రమానికి శనివారం సాయంత్రం పవన్ కల్యాణ్ విశాఖకు చేరుకున్నారు. పవన్ ఎయిర్ పోర్టుకు వస్తున్న క్రమంలో ఆ పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో విశాఖ గర్జన ముగించుకుని తిరిగి వెళ్తోన్న మంత్రులు ఎయిర్ పోర్టుకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. జనసేన కార్యక్రమలు కొందరు మంత్రుల వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 71 మందిపై కేసులు పెట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండడంతో జనవాణి కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. విశాఖలో పోలీసులు యాక్ట్ అమల్లో ఉందని ఎలాంటి ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించవద్దని పోలీసులు పవన్ కల్యాణ్ నోటీసులు అందించారు. పవన్ ను నోవాటెల్ హోటల్ నుంచి బయటకు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. పవన్ ను చూసేందుకు వచ్చిన కార్యకర్తలు, అభిమానులను చెదరగొట్టారు. హోటల్ కు చుట్టుపక్కల పోలీసులు ఆంక్షలు విధించారు.
మంత్రులపై దాడి
విశాఖపట్నం విమానాశ్రయం వద్ద అనుమతి లేకుండా 300 మంది జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు గుమిగూడినట్లు పోలీసులు తెలిపారు. మంత్రి ఆర్కే రోజా తో పాటు వైఎస్సార్ సీపీ నాయకులను అగౌరవపరిచేలా అసభ్యకర పదజాలం వాడారని.. అంతే కాకుండా వారిని చంపాలన్న ఉద్దేశంతోనే దాడికి పాల్పడ్డారని విశాఖ సీపీ తెలిపారు. ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించారని.. ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారని వెల్లడించారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ నియమ నిబంధనలు అన్నీ అతిక్రమించారని తెలిపారు.
నాయకులు, కార్యకర్తలపై కేసులు
పెందుర్తి ఎస్.హెచ్.వో నాగేశ్వర రావుపై, సిబ్బందిపై దాడికి జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని విశాఖ సీపీ వెల్లడించారు. మున్నంగి దిలీప్ కుమార్, సాయి కిరణ్, సిద్ధు, హరీశ్ లాంటి సామాన్య ప్రజలపై దాడికి పాల్పడ్డారని, ఈ ఘటనలో వారికి గాయాలు కూడా అయ్యాయని గుర్తించారు. జనసే కార్యకర్తల చర్యలతో విశాఖ విమానాశ్రయం వద్ద స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారని వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయని చాలా మంది వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. నిర్ణీత సమయంలో విమానాశ్రయానికి చేరుకోలేక 30 మంది ప్రయాణికులు విమానాలను మిస్ చేసుకున్నారని అన్నారు. ఉద్రిక్త పరిస్థితులకు కారణం అయిన జనసేన నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టినట్లు విశాఖ సీపీ ఇటీవల పేర్కొన్నారు.
Also Read : Pawan Chandrababu Meet : ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన టైం వచ్చింది- పవన్ కల్యాణ్