Viral Video: విరిగిపడిన కొండ చరియలు, రెప్పపాటులో చావు నుంచి తప్పించుకున్న కార్మికులు
Badrinath National Highway: బద్రినాథ్ హైవేపై కొండ చరియలు తొలగిస్తున్న సమయంలో కార్మికులపైకి కొండ చరియలు దూసుకొచ్చాయి. తృటిలో వాళ్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
Badrinath National Highway Closed: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు (Uttarakhand Rains) కురుస్తున్నాయి. చాలా చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. చమోలిలో ఈ వర్షాల ప్రభావంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా బద్రినాథ్ నేషనల్ హైవే (Badrinath Highway) మూసుకుపోయింది. ఈ శిథిలాల్ని తొలగించేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ పని చేస్తున్న క్రమంలోనే వాళ్లు ఉలిక్కిపడే ఘటన జరిగింది. శిథిలాల్ని తొలగించే సమయంలో ఉన్నట్టుండి బండరాళ్లు వాళ్లపైకి దూసుకొచ్చాయి. అప్పటి వరకూ అక్కడే ఉన్న కార్మికులు వెంటనే అప్రమత్తమయ్యారు. క్షణాల్లో అక్కడి నుంచి తప్పించుకుని బయట పడ్డారు. ఓ క్షణం ఆలస్యమైనా వాటి కింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోయే వాళ్లు. చుట్టూ ఉన్న వాళ్లు కూడా సరిగ్గా అదే సమయంలో విజిల్స్ ఊదుతూ అలెర్ట్ చేయడం వల్ల తృటిలో ప్రాణాపాయం తప్పింది. కాస్త అటు ఇటు అయినా ఘోరం జరిగిపోయి ఉండేది. ఈ కార్మికులు ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల మధ్య పని చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి మొండి ధైర్యంతో ముందుకు వెళ్లిపోతారు. ఈ సారీ అంతే వెళ్లారు. కానీ అనుకోకుండా ఆపద ముంచుకొచ్చింది. రెప్పపాటులో ఆ ముప్పు నుంచి తప్పించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
बद्रीनाथ हाईवे पर बंद सड़क खोलने के दौरान चट्टान खिसकी। बाल-बाल बचे, सफाई कर रहे मजदूर।#BadrinathHighway #Uttarakhanad #Chamoli #Badrinath pic.twitter.com/WfyqamocOu
— उत्तराखंड गजेटियर (@ukgazetteer) July 11, 2024
కొండ చరియలు విరిగిపడడం వల్ల 48 గంటలుగా బద్రినాథ్ నేషనల్ హైవే మూసుకుపోయింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఘటనలో రహదారి కూడా పాక్షికంగా ధ్వంసమైంది. పాతాళగంగ వద్ద పెద్ద ఎత్తున శిథిలాలు పేరుకుపోయాయి. వాటన్నింటినీ తొలగించారు. అయితే..జోషిమఠ్ వద్ద ఇంకా కొండ చరియలు ఉండడం వల్ల రూట్ ఇంకా క్లియర్ కాలేదు. వాహనాలు వెళ్లేందుకు వీలు లేకపోయినా నడుచుకుంటూ వెళ్లే దారైతే ఉందని అధికారులు వెల్లడించారు. Border Road Organization రంగంలోకి దిగి శిథిలాల్ని తొలగిస్తోంది. ఉత్తరాఖండ్‌లో వర్షాల కారణంగా దాదాపు 260 రోడ్‌లు బ్లాక్ అయ్యాయి. ఛార్‌ధామ్ యాత్రకు వెళ్లే వాళ్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.