(Source: ECI/ABP News/ABP Majha)
Vijayawada: బీటెక్ విద్యార్థి జీవన్ హత్య కేసులో ఆసక్తికర విషయాలు - ప్రేమ వ్యవహారమే కారణమా?
Vijayawada: కృష్ణా జిల్లాలో నిన్న కాలిపోయిన స్థితిలో లభ్యమైన జీవన్ హత్య కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియురాలి ఇంటికి సమీపంలో జీవన్ మృతదేహం లభ్యమవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
Vijayawada: కృష్ణా జిల్లా పెనమలూరులోని పెద్దపులిపాక గ్రామంలో.. కాలిపోయిన స్థితిలో బుధవారం రోజు జీవన్ అనే బీటెక్ విద్యార్థి మృతదేహం లభ్యం అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయే ముందు 'నాకు ఇదే చివరి రోజు కావొచ్చు' అని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
ఈఎంఐ డబ్బు వాడుకున్న జీవన్
జమ్ములమూడి జీవన్ నగరంలోని పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. వీరి స్వగ్రామం తోట్లపల్లూరు మండలం వల్లూరుపాలెం. కానీ క్రీస్తురాజుపురంలో స్థిరపడ్డారు. ఇటీవల లోన్ ఈఎంఐ కట్టమని జీవన్ కు తండ్రి రూ.12 వేలు ఇచ్చాడు. అయితే జీవన్ మాత్రం ఆ డబ్బులను సొంతానికి వాడుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి సుధాకర్ జీవన్ ను మందలించాడు. మనస్తాపానికి గురైన జీవన్ ఇంటి నుండిబయటకు వెళ్లారు. ఆ రోజు ఫ్రెండ్ ఇంట్లో పడుకున్నాడు. మరుసటి రోజు వచ్చి ఆ రోజు సాయంత్రం మిత్రుని బర్త్ డే పార్టీ ఉందని చెప్పి వెళ్లాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఇదే తన చివరి రోజు అవుతుందని పోస్టు పెట్టగా ఫ్రెండ్ వెటకారంగా రిప్లై ఇచ్చాడు. దానికి 'సరేలే.. ఈరోజు రాత్రికి తెలుస్తుందిలే' అని జీవన్ సమాధానం పెట్టాడు. ఆ తర్వాత ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లి అయ్యాక మిత్రుడి ఇంట్లో పడుకున్నాడు. అర్ధరాత్రి లేచి స్నేహితుడి బైక్ పెట్రోల్ బంక్ కు వెళ్లాడు. అక్కడ రూ. 100 పెట్రోల్ కొన్నాడు. తర్వాత తండ్రికి ఫోన్ చేసి ఈఎంఐ డబ్బులు వాడుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని ఆవేదన వ్యక్తం చేశాడు. తర్వాత తల్లితో కూడా మాట్లాడాడు. మిమ్మల్ని ఎప్పుడూ నిరాశ పరుస్తూనే ఉన్నా.. నాన్నను జాగ్రత్తగా చూసుకో.. నన్ను భరించినందుకు థ్యాంక్స్ అమ్మా అని ఫోన్ కట్ చేశాడు. ఆతర్వాత వాళ్లు 3 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.
అక్కడి నుండి ఘటనా స్థలానికి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. శరీరం మూడొంతులు కాలిపోవడంతో మృతిచెందాడు. తెల్లవారు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తలపై పెట్రోల్ పోసుకునే క్రమంలో అది కాస్త ఊపిరితిత్తులోకి కూడా వెళ్లినట్లు పోస్టు మార్టంలో తేలింది. తనకు తానే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నట్లు సమాచారం. పెట్రోల్ బంక్ కు వెళ్లి ఒంటరిగా పెట్రోల్ కొనడం, ఆతర్వాత ఒక్కడే బైక్ పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.
అసలేం జరిగిందంటే..?
కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెనమలూరులోని పెద్దపులిపాక గ్రామంలో.. బుధవారం రోజు కాలిపోయిన స్థితిలో ఓ యువకుడి మృతదేహం లభ్యం అయింది. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మృతుడు విజయవాడకు చెందిన 22 ఏళ్ల జీవన్ గా గుర్తించారు. పొట్టి శ్రీరాములు కాలేజీలో జీవన్ బీటెక్ చదువుతున్నాడు. బర్త్ డే పార్టీ ఉందని ఇంటి నుంచి వెళ్లిన ఇతడు.. ఇలా శవంగా మారాడని తెలియడంతో.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎంతో ఉన్నత భవిష్యత్తు ఉందనుకున్న కొడుకు ఇలా కాలిపోయిన స్థితిలో శవంగా దొరకడం ఏంటని గుండెలవిసేలా రోదిస్తున్నారు. పుట్టిన రోజుకు వెళ్తున్నానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా అంటూ జీవన్ తల్లి ఏడవడం అందరినీ కలిచి వేసింది.
ప్రియురాలి ఇంటి వద్దకు వెళ్లి మరీ సూసైడ్!
జీవన్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసింది. అయితే ఆ అమ్మాయి ఇంటికి సమీపంలోనే అతడి మృతదేహం లభ్యం కావడంతో.. పోలీసులు సదరు యువతిని విచారించారు. జీవన్ ఆమె కోసమే ఇక్కడికి వచ్చాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కానీ సదరు యువతి మాత్రం జీవన్ తనకు ఫోన్ చేయలేదని.. ఇక్కడకు ఎందుకు వచ్చాడో కూడా తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం.