Verghese Kurien : మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా - వర్ఘీస్ కురియన్ గురించి మీకివి తెలుసా ?
భారత ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపర్చడంలో కీలకమైన వ్యక్తి వర్ఘీస్ కురియన్. భారత మిల్క్ మ్యాన్‌గా ఆయన పేరు పొందారు.
Verghese Kurien : స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు ప్రయత్నించింది.అందులో దేశ జనాభాకు తగ్గట్లుగా ఆహారపదార్ధాల ఉత్పత్తిలో స్వావలంబన సాధించాలని ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పాల విషయంలో పూర్తి స్థాయిలో స్వావలంబన సాధించడానికి ఉపయోగపడిన దిగ్గజం వర్ఘీస్ కురియన్. కేరళలో పుట్టిన ఈయన గుజరాత్‌లో అమూల్ ఆలోచన చేయడం ద్వారా శ్వేత విప్లవానికి నాంది పలికారు.
మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా !
కేరళలో జన్మించిన వర్గీస్ కురియన్ సహకార డెయిరీ అభివృద్ధి కోసం గుజరాత్ ఆనంద్‌లో అమూల్ ప్రారంభించారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా నిలిపారు. కురియన్ 1973లో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ స్థాపించారు. 34 ఏళ్ల వరకు దానికి అధ్యక్షుడుగా ఉన్నారు. ఈ జీసీఎంఎంఎఫ్ సంస్థే తర్వాత అమూల్ పేరుతో డెయిరీ ఉత్పత్తుల సంస్థగా మారింది. ఈ సంస్థలో 11 వేల గ్రామాల్లో 20 లక్షల మందికి పైగా రైతులు సభ్యులుగా ఉన్నారు. సహకార రంగంలో పాలు, ఇతర ఉత్పత్తుల తయారీలో ఇది కొత్త చరిత్రను లిఖించింది. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లాంటి పురస్కారాలు కురియన్‌కు లభించాయి. 1965లో కురియన్ రామన్ మెగసెసే అవార్డు కూడా అందుకున్నారు.
అమూల్ ఆవిర్భావంతో పాల విప్లవం !
కేరళలో సాధారణ కుటుంబంలో పుట్టిన వర్ఘీస్ కురియన్ అమెరికాలో చదువు 1948లో ఆయన మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందాడు. 1949లో యునైటెడ్ స్టేట్స్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆయనను గుజరాత్ ఆనంద్‌లోని ఒక పాల ఉత్పత్తుల కేంద్రంలో నియమించింది. అక్కడ ఆయన డెయిరీ విభాగంలో అధికారిగా ఐదు సంవత్సరాలు పనిచేశారు. అక్కడ రైతులను ఏకం చేసి సహకార ఉద్యమాన్ని ఏర్పాటు చేసేందుకు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రయత్నిస్తున్న త్రిభువందాస్ పటేల్‌ను కలిశారు. ఆ వ్యక్తి నుండి ప్రేరణ పొందిన కురియన్ అతనితో కలిసి పనిచేయాలని భావించారు. ఈ క్రమంలోనే అమూల్ సహకార సంస్థ ఏర్పాటైంది. కురియన్ స్నేహితుడు, డెయిరీ నిపుణుడు హెచ్‌ఎం దాలయ గేదె పాల నుంచి పాల పొడి, ఘనీకృత పాలను తయారు చేసే పద్ధతిని కనుగొన్నారు. ఇది భారతీయ పాడి పరిశ్రమను విప్లవాత్మకంగా మార్చింది, అప్పటి వరకు ఇటువంటి ప్రాసెస్ చేయబడిన ఉత్పత్తులు.. ఆవు పాలతో మాత్రమే తయారు చేయవచ్చు. అమూల్ డెయిరీ చాలా విజయవంతమైంది. ఈ విధానం గుజరాత్‌లో ఇతర జిల్లాలకు కూడా వేగంగా వ్యాపించింది.
దేశంలో పాల స్వయం సమృద్ధి సాధించడం కురియన్ ఘనతే !
శ్వేత విప్లవంలో మొదటి దశ 1970లో ప్రారంభమై 1980లో ముగిసింది. పాల ఉత్పత్తిలో వేగం పెంచడం కోసం ఈ దశలో దేశంలో అధికంగా పాలు ఉత్పత్తయ్యే ప్రాంతాలను ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలతో అనుసంధానం చేశారు. రెండో దశ 1981 లో మొదలై 1985లో ముగిసింది. ఈ దశలో ప్రధాన పాల ఉత్పత్తి ప్రాంతాలు 18 నుంచి 136కు పెరిగాయి. 1985 చివరి నాటికి, 4,250,000 మంది పాల ఉత్పత్తిదారులతో 43,000 గ్రామ సహకార సంఘాలు ఏర్పాటయ్యాయి. మూడో దశ 1986లో ప్రారంభమై 1996లో ముగిసింది. ఈ దశలో పాడిపరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలతోపాటు పాల సహకార సంఘాల సంఖ్య పెరిగింది. ఈ దశలో 30000 కొత్త డెయిరీల ఏర్పాటుతో సహకార సంఘాల సంఖ్య 73000కి చేరింది. కురియన్ 2012లో అనారోగ్యంతో కన్నుమూశారు.
పాల విప్లవం తెచ్చిన వర్ఘీస్ కురియన్ ఆలోచనల కారణంగానే దేశంలో ఎంతో మంది పిల్లలు పౌష్టికార లోపం నుంచి బయట పడ్డారు. ఆరోగ్య ప్రమాణాల్లో భారత్ మెరుగుదలకు కారణమయ్యారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఆయన కృషిని గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం.