Monkeypox Cases in US: నెలల పిల్లల్లోనూ మంకీపాక్స్ వైరస్! అప్రమత్తమైన అగ్రరాజ్యం
Monkeypox Cases in US: అమెరికాలో ఇద్దరు శిశువులకూ మంకీపాక్స్ వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. ఇద్దరిలోనూ సింప్టమ్స్ కనిపిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
Monkeypox Cases in US:
ఆ పిల్లలకు ఎలా సోకింది..?
అమెరికాలోనూ మంకీపాక్స్ కలవరం మొదలైంది. యూఎస్‌లో ఇద్దరు చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలున్నట్టు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. కాలిఫోర్నియాకు చెందిన నెలల శిశువుతో పాటు వాషింగ్టన్ డీసీలో మరో చిన్నారిలో సింప్టమ్స్ ఉన్నట్టు తెలిపింది. ఈ ఇద్దరు బాధితులకు ఎలాంటి సంబంధం లేదని, వాళ్లెప్పుడూ కలుసుకోలేదని స్పష్టం చేసింది. ఈ ఇద్దరూ ఎలా ఈ వైరస్ బారిన పడ్డారో విచారిస్తున్నారు అధికారులు. పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా ఈ వైరస్ ఉండొచ్చని, అదే వీరికి వ్యాప్తి చెందే అవకాశముందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఇద్దరి చిన్నారులూ ఆరోగ్యంగానే ఉన్నారని, చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఎండమిక్‌గా మారిన ఈ వైరల్ వ్యాధి...ఇప్పుడు యూరప్‌లో వ్యాప్తి చెందుతోంది. తరవాత అమెరికాలోనూ ఈ వ్యాధి
లక్షణాలు కనిపించటం ఆ దేశాన్ని కలవర పెడుతోంది. గతంలో మంకీపాక్స్ వ్యాధి వచ్చిన దాఖలాలే లేని దేశాల్లోనూ ఈ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 15,000 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ బాధితుల్లో ఎక్కువ మంది పురుషులే ఉన్నారు.
ఆఫ్రికా నుంచి ఐరోపా, అమెరికాకు..
"ఇదేమీ మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయటం లేదు. అప్పుడప్పుడు ఇలాంటి కేసులు నమోదవుతుంటాయి" అని సీడీసీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఇద్దరు చిన్నారులతో పాటు మరో 8 మంది మహిళల్లోనూ మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయని వెల్లడించారు. అమెరికాలో మొత్తం 2,800 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇక యూరప్‌లోనూ చిన్నారులు ఈ వైరస్ బారిన పడ్డారు. ఆరుగురు బాధితులు 17 ఏళ్ల లోపు వారే. నెదర్లాండ్స్‌లో ఓ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శరీరంపై ఉన్నట్టుండి దద్దుర్లు రావటం వల్ల ఆసుపత్రిలో చేర్చారు. అది మంకీపాక్స్ అని మాత్రం వైద్యులు ఇంకా నిర్ధరించలేదు. ఆఫ్రికాలో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందటం సర్వసాధారణం. అక్కడి చాలా మంది చిన్నారులు ఈ వ్యాధి సోకి ప్రాణాలొదిలారు. భారత్‌లోనూ మూడు కేసులు నమోదు కాగా..అవన్నీ కేరళకు చెందినవే. కన్నూర్ జిల్లాలో 31 ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చిన ఈ వ్యక్తిని పరీక్షించగా, మంకీపాక్స్ సోకినట్టు నిర్ధరణ అయింది. ప్రస్తుతానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. మే13 వ తేదీనే దుబాయ్ నుంచి కన్నూర్ వచ్చినా...లక్షణాలు ఆలస్యంగా బయటపడ్డాయి. బాధితుడితో సన్నిహితంగా ఉన్న వారందరినీ అప్రమత్తం చేసిన అధికారులు వారి ఆరోగ్యంపైనా దృష్టి సారించారు. జులై 14వ తేదీ కేరళలోని కొల్లం జిల్లాలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది.