బైడెన్ ఫిట్‌గా లేరు, అధ్యక్ష పదవి నుంచి తొలగించండి - వైస్ ప్రెసిడెంట్‌కి అటార్నీ జనరల్ లేఖ
Joe Biden: అమెరికా ప్రెసిడెంట్ బైడెన్‌ని ఆ పదవి నుంచి తొలగించాలని అటార్నీ జనరల్ లేఖ రాయడం సంచలనమైంది.
Joe Biden Removal: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని ఆ పదవి నుంచి తొలగించాలంటూ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కి ఓ అటార్నీ జనరల్ లేఖ రాయడం సంచలనమైంది. 81 ఏళ్ల బైడెన్ అటు శారీరకంగా, ఇటు మానసికంగా ఫిట్‌గా లేరని..అధ్యక్ష బాధ్యతలు చేపట్టలేకపోతున్నారని అందులో ప్రస్తావించారు. వెస్ట్ వర్జీనియా అటార్నీ జనరల్ ప్యాట్రిక్ మొరిసే ఈ లెటర్ రాశారు. ఇప్పటికే 388 పేజీలతో కూడిన ఓ రిపోర్ట్‌ని విడుదల చేశారు. అందులో బైడెన్ గురించి కీలక విషయాలు ప్రస్తావించారు. ఆయనకు వయసైపోయిందని, జ్ఞాపకశక్తి తగ్గిపోతోందని విమర్శించారు. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముందని తేల్చి చెప్పారు ప్యాట్రిక్ మొరిసే. అమెరికా ప్రజలు తమ దేశ అధ్యక్షుడు రోజురోజుకీ బలహీనపడిపోతుండడాన్ని గమనిస్తున్నారని అన్నారు. పబ్లిక్ మీటింగ్స్‌లో మాట్లాడేటప్పుడు, ఇతర దేశాల నేతలచో చర్చించినప్పుడు ఆయన తడబడుతున్నారని వెల్లడించారు. ఆయన అధ్యక్ష పదవికి తగరు అనడానికి ఇంత కన్నా ఏం కావాలని ప్రశ్నించారు. మానసికంగా స్థిరంగా ఉన్న వ్యక్తినే అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలని ఆ లేఖలో పేర్కొన్నారు ప్యాట్రిక్. మాజీ ప్రధాని కెన్నెడీ హత్యకు గురైనప్పుడు 1965లో కాంగ్రెస్ ఓ చట్టాన్ని తీసుకొచ్చినట్టు గుర్తు చేశారు. అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు ఆయనను ఆ పదవి నుంచి తొలగించే అధికారం వైస్ ప్రెసిడెంట్‌కి ఉంటుందని తేల్చి చెప్పారు. అయితే..బైడెన్ వర్గం మాత్రం ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తోంది. ఇప్పటికీ ఆయన మానసిక స్థితి బాగానే ఉందని తేల్చి చెబుతోంది.