టైర్ పేలిపోవడం యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు, ఇన్సూరెన్స్ కంపెనీ సాకులు చెప్పొద్దు - బాంబే హైకోర్టు
Tyre Burst: టైర్లు పేలిపోవడం యాక్ట్ ఆఫ్ గాడ్‌గా పరిగణించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
Tyre Burst:
ఇదీ కేసు..
వాహనాలున్న వాళ్లు కచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలేనిది వెహికిల్ యాక్ట్‌లోని రూల్. ఏదైనా ప్రమాదాలు జరిగి వాహనం ధ్వంసమైతే రిపేర్ ఖర్చులన్నీ ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. అయితే...కొన్ని బీమా సంస్థలు రకరకాల రూల్స్ చెప్పి పరిహారం ఇవ్వకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఏమైనా అడిగితే "పాలసీలో ఇది కవర్ అవ్వదు" అని సింపుల్‌గా బదులిస్తారు. ఈ క్రమంలోనే బాంబే హై కోర్టు (Bombay High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. టైర్ పంక్చర్ అయ్యి ఓ కారుకి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబ సభ్యులు పరిహారం కోసం బీమా కంపెనీని ఆశ్రయించగా కుదరదు అని తేల్చి చెప్పింది. పైగా ఈ విషయాన్ని తేల్చుకునేందుకు బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది. అది యాక్ట్ ఆఫ్ గాడ్ కిందకు వస్తుందని, పరిహారం ఇవ్వలేమని తెలిపింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు టైర్ బరస్ట్ అనేది గాడ్ ఆఫ్ యాక్ట్ కాదని, కచ్చితంగా అది మానవ నిర్లక్ష్యమేనని స్పష్టం చేసింది. ఇన్సూరెన్స్ కంపెనీ వేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. జస్టిస్ ఎస్‌డీ దిగే నేతృత్వంలోని ధర్మాసనం New India Assurance Company Limited వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. రూ.1.25కోట్ల పరిహారం ఇవ్వాలన్న బాధిత కుటుంబాన్ని సవాలు చేస్తూ ఈ పిటిషన్ వేసింది ఆ కంపెనీ. నిజానికి ఈ ప్రమాదం జరిగి 13 ఏళ్లు దాటిపోయింది. 2010 అక్టోబర్ 25న 38 ఏళ్ల పట్వర్ధన్ పుణె నుంచి ముంబయికి కార్‌లో ప్రయాణించాడు. ర్యాష్ డ్రైవింగ్ కారణంగా టైర్ పేలిపోయి అదుపు తప్పి లోయలో పడిపోయింది ఈ ప్రమాదంలో పట్వర్ధన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సాకుగా చూపొద్దు: బాంబే హైకోర్టు
ఆ కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోయినందున కచ్చితంగా పరిహారం అందాలని వాదిస్తున్నా..కంపెనీ మాత్రం అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేమని చెబుతోంది. టైర్ పేలిపోవడానికి రకరకాల కారణాలుంటాయని, దాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్‌గా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. ప్రయాణం చేసే ముందే టైర్లు ఎలా ఉన్నాయో చూసుకోవాలని, ఇది సహజంగా జరిగిన ప్రమాదం కాదని...నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని తేల్చి చెప్పింది. పరిహారం ఇవ్వకుండా తప్పించుకునేందుకు దీన్ని ఓ సాకుగా చూపించడం సరికాదని స్పష్టం చేసింది.