Rahul Gandhi: ట్విట్టర్ నుంచి ఇన్‌స్టాకు మారిన రాహుల్.. మీడియా, ట్విట్టర్‌పై కామెంట్స్
అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలను పోస్టు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఖాతాను ట్విట్టర్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తన ట్విట్టర్ ఖాతాను నిలిపివేయడంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ ప్రభుత్వ పక్షపాతిగా వ్యవహరిస్తోందని.. ప్రభుత్వం ఏది చెబితే అదే వింటోందని రాహుల్ ఆరోపించారు. పార్లమెంటులో తమకు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వట్లేదని.. మీడియా అంతా అధికార ప్రభుత్వం నియంత్రణలోనే ఉందని అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తమ గళం వినిపించేందుకు ట్విట్టర్ ఒక ఆశా జ్యోతిలా ఉండేదని.. ఇప్పుడు అది కూడా ప్రభుత్వ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని రాహుల్ విమర్శించారు. మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాలను పంచుకున్నారు. ఈ పోస్టులకు 'భయపడకండి.. సత్యమే గెలుస్తుంది' అనే క్యాప్షన్ ఇచ్చారు.
View this post on Instagram
ప్రజాస్వామ్య దేశంలో తమ వాదనను వినిపించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని రాహుల్ స్పష్టం చేశారు. తన ఖాతాను బ్లాక్ చేయడం ద్వారా.. ట్విట్టర్ రాజకీయ సంబంధమైన విషయాల్లో జోక్యం చేసుకుంటుందనే విషయం స్పష్టమవుతోందని అన్నారు. ఇది రాహుల్ గాంధీ అనే రాజకీయ నాయకుడిపై చేసిన దాడి కాదని.. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిపిన దాడి అని పేర్కొన్నారు. అధికార బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించిన వారి గొంతు నొక్కేస్తోందని, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోందని విమర్శించారు.
View this post on Instagram
తనకు ట్విట్టర్‌లో 19 నుంచి 20 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారని.. వారు తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కును బీజేపీ కాలరాస్తోందని రాహుల్ మండిపడ్డారు. ట్విట్టర్ వంటి వేదికలు అందరి పట్ల ఒకే తీరుగా వ్యవహరించాలని హితవు పలికారు. పెట్టుబడిదారులు అధికార ప్రభుత్వాలకు కొమ్ముకాసే వ్యవహార శైలి ద్వారా భవిష్యత్‌లో మరిన్ని దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా, అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలను పోస్టు చేసినందుకు రాహుల్ గాంధీ ఖాతాను ట్విట్టర్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే.