Vaikunta Ekadasi 2023: వైకుంఠ ద్వాదశి పర్వదినం నాడు శాస్త్రోక్తంగా చక్రధారుడి చక్రస్నానం!
Vaikunta Ekadasi 2023: వైకుంఠ ద్వాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం వేకువ జామున తిరుమలలో చక్రస్నాన మహోత్సవాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Vaikunta Ekadasi 2023: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం వేకువ జామున చక్రస్నాన మహోత్సవాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్ర త్తాళ్వార్లను తిరుమాఢ వీధుల్లో ఊరేగింపు చేస్తూ.. శ్రీ భూ వరహా స్వామి వారి ఆలయం ముఖ మండపంలో వేంచేపు చేసారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారి పుష్కరిణిలో సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీ జలంలో ముంచి, స్నానం చేయించారు. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు.
అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్ర ధార, కుంభధారణలతో వైఖానస ఆగమ యుక్తంగా స్నపనం జరిపారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుష సూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకం అనంతరం వివిధ పాశురాలను పెద్ద జియ్యంగారు, చిన్న జియ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. అన్ని సేవలూ సఫలమై - లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికి చక్రస్నానం నిర్వహించారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీ ఆదాయం
ఈక్రమంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు వారి వారి స్ధోమతకు తగ్గట్టుగా వైకుంఠ ఏకాదశి నాడు స్వామి వారిపై భక్తితో హుండీలో విరాళాలు సమర్పించారు. దీంతో వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి హుండీ ఆదాయం ఘననీయంగా పెరిగింది. కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో ఒక్కరోజు హుండీ ఆదాయం రావడం విశేషం. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 7.68 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయంగా సమర్పించారు భక్తులు. శ్రీవారిని ఆదివారం ఒక్కరోజే 69,414 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న రికార్డుల ప్రకారం 2018 జులై 27వ తేదీ రోజు రూ. 6.28 కోట్ల హుండీ ఆదాయం రాగా, గత ఏడాది అక్టోబర్ 23వ తారీఖులన 6.31 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం లభించింది. అయితే వైకుంఠ ఏకాదశి నాడు ఇప్పటికీ వరకూ వచ్చిన హుండీ ఆదాయం రికార్డును దాటింది. అంతకు మునుపు 2012 జనవరి 1వ తేదీ రూ. 4.23 కోట్ల రూపాయలు రికార్డ్ ఉండగా అదే ఏడాది 2012 ఏప్రిల్ 1వ తేదీ రూ. 5.73 కోట్ల హుండీ ఆదాయం లభించింది.