H1B వీసాలు, గ్రీన్ కార్డ్‌లు ఇకపై ఆలస్యం కావు - అమెరికా కీలక ప్రకటన
H-1B Visa Process: H1B వీసా ప్రాసెస్‌లో ఆలస్యం జరగకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు అమెరికా ప్రకటించింది.
US H-1B Visa Process: H1B వీసా ప్రాసెస్‌ని వేగవంతం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు అమెరికా వెల్లడించింది. దీంతో పాటు గ్రీన్ కార్డ్‌ల జారీ విషయంలోనూ ఇకపై ఆలస్యం జరగకుండా చూసుకుంటామని స్పష్టం చేస్తోంది. ఇమిగ్రేషన్ సిస్టమ్‌లో ఇప్పటి వరకూ ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇస్తోంది. అమెరికాలోని కంపెనీలు విదేశాల నుంచి వచ్చే వారిని రిక్రూట్ చేసుకునేందుకు ఈ H1B వీసాలే కీలకం. చాలా మంది ఈ వీసాల కోసం ఎదురు చూస్తున్నారు. కొంత కాలంగా ఈ ప్రాసెస్ చాలా ఆలస్యమవుతోంది. అయితే...దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా పౌరసత్వం పొందే అర్హత ఉన్న వాళ్లందరికీ వీలైనంత త్వరగా Green Cards జారీ చేస్తామని అమెరికా వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గ్రీన్ కార్డ్‌ల జారీపై పెద్దగా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలకు వైట్ హౌజ్ స్పందించింది.
"నెల రోజులుగా ఇమిగ్రేషన్ సిస్టమ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. ఎలాంటి మోసాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు ఈ సిస్టమ్‌ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం. H1B వీసాలతో పాటు గ్రీన్ కార్డ్‌ల జారీకి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది"
- అధికారులు
US Citizenship and Immigration Services (USCIS) ఇప్పటికే ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. myUSCISని ప్రారంభించనుంది. ఒకే సంస్థలో ఎక్కువ మందికి H1B వీసాలు అందించేందుకూ సిద్ధంగా ఉన్నట్టు చెబుతోంది. H1B రిజిస్ట్రేషన్స్‌తో పాటు H1B పిటిషన్‌లకూ అవకాశం కలగనుంది. మార్చి నుంచి H-1B Electronic Registration Process మొదలు కానుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మార్చి 6వ తేదీ నుంచి మొదలవుతుంది. మార్చి 22వ తేదీ వరకూ కొనసాగుతుంది.
అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు ఆ దేశం పెద్ద షాక్ ఇచ్చింది. భారత్ నుంచి ఉద్యోగాలు, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లాలని భావిస్తున్నవారికి 'హెచ్-1బీ' సహా కొన్ని కేటగిరీల వీసాల రుసుములను భారీగా పెంచింది. హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 లాంటి వివిధ క్యాటగిరీల వలసేతర (నాన్-ఇమ్మిగ్రెంట్) వీసా ఫీజులను భారీగా పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని అగ్రరాజ్యం ప్రకటించింది. 2016 తర్వాత అమెరికా వీసా ఫీజులు పెరగడం ఇదే తొలిసారి. అమెరికా వెళ్లే భారతీయులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. వీసాల అప్లికేషన్ ఫీజులను పెంచడం 2016 తర్వాత ఇదే మొదటిసారి అని బైడెన్ సర్కారు వెల్లడించింది. బైడెన్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో భారతీయ టెకీలు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే హెచ్-1బీ వీసా దరఖాస్తు ధర 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెరిగింది. ఇక హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ధరను కూడా 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచింది. అయితే, ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఎల్-1 వీసా దరఖాస్తు రుసుమును 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు పెంచారు. ఈబీ-5 వీసాల ఫీజులను 3,675 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ తమ ఫెడరల్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.