Top Headlines Today: మే 12 నాటి షెడ్యూల్డ్ హెడ్‌లైన్స్ ఏంటంటే?
Top Headlines Today: తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ్టి షెడ్యూల్‌లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇవే.
Top Headlines Today:
చుక్కల సమస్యకు చెక్
నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించిన ప్రభుత్వం ఆ పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనుంది. నెల్లూరు జిల్లా కావలిలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. జిల్లాల వారిగా ఉన్న 20వేల కోట్ల విలువైన 2,06,171 ఎకరాల భూమిని నిషిద్ధ జాబితా నుంచి ప్రభుత్వం తప్పించింది. దీని వల్ల 97,471 మందికి లబ్ధి చేకూరబోతోంది.
జీవో నెంబర్ 1పై నేడు తీర్పు
రహదారులపై రాజకీయ పార్టీలు బహిరంగ సభలు రోడ్డు షోలు నిర్వహించకూడదంటూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబ్1పై హైకోర్టు తీర్పు చెప్పనుంది. జనవరి 2న ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ కొందరు నాయకులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. తీర్పు మాత్రం రిజర్వ్ చేసింది న్యాయస్థానం.
నేటి నుంచి తెలంగాణలో ఇంజనీరింగ్ ఎంసెట్
తెలంగాణలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఎంసెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ మూడు రోజుల పాటు ఆరు సెషన్లలో ఇంజనీరింగ్ విద్యార్థులు పరీక్షలు రాస్తారు. రోజుకు సుమారు 70 వేల మంది ఎగ్జామ్స్ రాస్తారు. బుధ, గురువారాల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో పరీక్షలు విజయవంతంగా ముగిశాయి.
నేడు పశ్చిమలో చంద్రబాబు టూర్
అకాల వర్షంతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లాలోని ఇరగవరంలో రైతులతో మాట్లాడారు. రైతుల నుంచి బస్తాకు రెండు కిలోల ఎక్కువ ధాన్యం తీసుకుంటారని ఆరోపించారు. దీనిపై తీవ్ర విమర్శలు చేశారు. తాము వస్తున్నామని హడావుడిగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు.
చలో సీఎం కార్యాలయం
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఐ చలో సీఎం కార్యాలయం అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు రైతులకు కే. రామకృష్ణ పిలుపునిచ్చారు.
మహా యజ్ఞం
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇవాళ్టి నుంచి ఆరు రోజుల పాటు యాగాలు జరగనున్నాయి. అష్టత్తర శతకుండాత్మక చండీ, రుద్ర , రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం జరగనుంది. కాసేపటి క్రితమే సీఎం జగన్ వచ్చి యాగాన్ని ప్రారంభించారు. ఈ యాగంలో 108 కుండాలు, నాలుగు ఆగమనాలు, 500 మంది రుత్వికులతో నిర్వహిస్తున్నారు.
మహానాడు ప్రాంగణానికి భూమి పూజ
రాజమండ్రిలోని వేమగిరిలో జరిగే మహానాడుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది తెలుగుదేశం. ఈ ప్రాంగణానికి ఈ ఉదయం 9.25 గంటలకు భూమి పూజ చేయనుంది. దీనికి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరుకానున్నారు. మరికొందరు తెలుగుదేశం లోకల్ లీడర్లు కూడా పాల్గోనున్నారు. ఈ నెల 27,28 తేదీల్లో మహానాడు జరగనుంది.
డయల్ యువర్ ఈవో
తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఇవాళ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి పది గంటల వరకు భక్తుల సమస్యలు విన్నవించుకోవచ్చు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈ కార్యక్రమం జరగనుంది. సమస్యలు ఉన్న భక్తులు 08772263261 నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పుకోవచ్చు.
హుసాముద్దీన్ పంచ్ అదిరిపోవాలే!
ప్రపంచ పురుషుల బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో ఇవాళ కీలక పోరు జరగనుంది. ఇప్పటికే ముగ్గురు భారతీయులు సెమీస్‌కు చేరారు. మహమ్మద్ హుసాముద్దీన్, దీపక్ భోరియా, నిశాంత్ దేవ్ ఇవాళ సెమీ ఫైనల్స్‌లో ప్రత్యర్థులతో తలపడనున్నారు. పసిడికి రెండు బౌట్ల దూరంలో ఉన్న తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ 57 కేజీల విభాగం సెమీస్‌లో క్యూబాకు చెందిన సైడల్ హోర్టాను ఢీ కొట్టనున్నారు.
ఐపీఎల్‌లో నేడు ముంబైతో గుజరాత్ ఢీ
ఐపీఎల్‌లో ఇవాళ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముంబై సొంత మైదానం వాంఖడే స్టేడియంలో జరగనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వీరిద్దరి మధ్య మొదటి మ్యాచ్ బ్రబౌర్న్ స్టేడియంలో జరిగింది, ఇందులో ముంబై విజయం సాధించింది. రెండో మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఇందులో గుజరాత్ విజయం సాధించింది.