Titan Submarine : అంతా బాగుందన్నారు.. అంతలోనే ఘోరం, టైటాన్ సబ్‌మెరైన్ ఆఖరి మజిలీపై విస్తుపోయే నిజాలు వెలుగులోకి!
Titan Submarine last mesage: All is good here : టైటానిక్ అన్వేషణకు వెళ్లి తునాతునకలైన టైటాన్ సబ్‌మెరైన్ కేసు విచారణలో వెలుగులోకి విస్తుపోయే విషయాలు . కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించని తయారీ సంస్థ
Titan Submarine Accident : సముద్ర గర్భంలోని అద్భుతం టైటానిక్ అన్వేషణకు వెళ్లి తునాతునకలైన టైటాన్ సబ్‌మెరైన్ కేసుకు సంబందించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది జూన్‌లో పాకిస్తాన్ బిలయనీర్ షెహజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్, ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ సహా ఐదుగురు అట్లాంటిక్ మహాసముద్రంలో జలసమాధి అయిన కేసు ప్రస్తుతం కోర్టులో విచారణ దశలో ఉంది. వీరు గతేడాది (2023) జూన్ 20న ఓషన్‌గేట్‌కు చెందిన టైటాన్ జలాంతర్గామిలో అట్లాంటిక్ మహాసముద్రంలో 12 వేల అడుగుల లోతులో దాగి ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు బయలు దేరారు. ఆ తర్వాత కొద్ది గంటల్లో వారి నుంచి ఏ విధమైన సిగ్నల్స్ రాలేదు. వెంటనే సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టిన కెనడా, యూఎస్ కోస్ట్ గార్డులు.. టైటానిక్ నౌకకు 4 వందల 88 మీటర్ల దూరంలో టైటాన్ శిథిలాలను గుర్తించారు. అయితే అవి శిథిలం అవడానికి ముందు అందులో ఉన్న ప్రయాణికులు మాట్లాడిన మాటలు కోర్టు విచారణలో బయటకు వచ్చాయి. అంతా బాగానే ఉందని వారు చెప్పినవే ఆఖరి మాటలు కాగా.. ఆ తర్వాత కాసేపటికే ఘోరం జరిగిపోయింది. ఆ ప్రమాదానికి సంబంధించిన ఫొటో కూడా ఒకటి బయటకు వచ్చింది. అది రిమోటెడ్ వెహికల్‌తో తీసిన ఫొటోగా అధికారులు తెలిపారు.
అట్లాంటిక్ సముద్ర జలాల్లోకి వెళ్లిన రెండు గంటల్లోనే ప్రమాదం:
2023లో జూన్‌లో సముద్ర అన్వేషకులు ఐదుగురితో కలిసి అట్లాంటిక్ జలాల్లోకి వెళ్లిన టైటాన్ జలాంతర్గామి.. తన ప్రయాణం మొదలు పెట్టిన రెండు గంటల్లోనే.. అందులో సాంకేతిక సమస్యలు తలెత్తి సముద్ర పీడానాన్ని తట్టుకోలేక ముక్కలైంది. ఈ ఘటనలో బ్రిటీష్ వ్యాపారి, ఫ్రాన్స్‌కు చెందిన మాజీ నావికాదళ అధికారితో పాటు ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై విచారణ మొదలు పెట్టిన అమెరికా కోస్టు గార్డు అధికారులు.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. రెండు వారాల పాటు సాగిన విచారణలో భాగంగా అధికారులు.. టైటాన్ యాత్రను రీక్రియేట్ చేశారు. ప్రమాదం జరిగిన రోజు ఉదయం 9 గంటలా 17 నిమిషాలకు టైటాన్ జలాల్లోకి ప్రవేశించగా.. మదర్ షిప్‌తో 10 గంటలా 45 నిమిషాల వరకు టచ్‌లోనే ఉంది. ఆ సమయానికి సబ్‌మెరైన్ 3 వేల 346 మీటర్ల లోతులో ఉంది. అధిక బరువును వదిలించుకునేందుకు రెండు బరువైన వస్తువులను కూడా వదిలించుకున్నట్లు మదర్‌షిప్‌నకు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత కాసేపటికే మదర్ షిప్‌తో కమ్యూనికేషన్స్ తెగిపోయాయి.
టైటాన్ సబ్‌మెరైన్ తయారీ. నిర్వహణలో భారీ లోపాలు:
ఈ విచారణలో టైటాన్ తయారీలోనే భారీ లోపాలు ఉన్నట్లు తేలింది. తయారీ పూర్తైన తర్వాత ఈ సబ్‌మెరైన్‌ను థర్డ్ పార్టీ పరీక్షలకు పంపకుండానే నేరుగా విధుల్లోకి దించారు. ఏ వాతావరణంలో ఎలా స్పందిస్తుంది.. సముద్రంలో జలపీడనం కలిగే ఒత్తిడిలో సబ్‌మెరైన్ సామర్థ్యం ఎంత అన్న పరీక్షలేవీ జరగలేదని విచారణలో తేలింది. అంతకు ముందు 2012, 2022లో నిర్వహించిన యాత్రల్లోనూ టైటాన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని.. సమద్ర అట్టడుగు ప్రయాణంలో దాదాపు 113 పరికరాలు దెబ్బతిన్నాయని.. 3 వేల 500 మీటర్ల లోతులో ఇంజిన్ మొరాయించి 26 గంటలపాటు ప్రయాణికులు సముద్ర గర్భంలో చిక్కుకుపోయిన ఉదంతాలు కూడా టైటాన్‌కు ఉన్నాయని.. అయినా ఓషన్‌గేట్ సంస్థ ఆ సమస్యల పరిష్కారానికి ఏ విధమైన చర్యలు తీసుకోక పోవడం వల్లే 2023లో ఘోరం జరిగిందని విచారణలో స్పష్టమైంది.