(Source: ECI/ABP News/ABP Majha)
Chandra Mouli Passed Away: టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇంట విషాదం - మృత్యువుతో పోరాడుతూ కుమారుడు మృతి
Chandra Mouli Passed Away: టీటీడీ ఆలయ ఈఓ ఏవీ ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి గుండెపోటుకు చికిత్స పొందతూ బుధవారం ఉదయం మృతి చెందారు.
Chandra Mouli Passed Away: టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఇంట విషాదం నెలకొంది. ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మూడు రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చేందినట్లు ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. గత ఆదివారం మధ్యాహ్నం చంద్రమౌళి చెన్నైలో గుండెపోటుకు గురి కావడంతో కావేరి ఆసుపత్రిలో చేర్చారు. చంద్రమౌళిని బ్రతికించేందుకు వైద్యులు ఎంతగానో కృషి చేసినప్పటికీ.. ఆయన అవయవాలు వైద్యానికి సహకరించలేదు. దీంతో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం చంద్రమౌళి తుది శ్వాస విడిచారు. ఇదే విషయాన్ని ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకులు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ ప్రకటన విడుదల చేశారు. వైద్యులు శాయశక్తులా కృషి చేసినా ఫలితం లేకపోయిందని వివరించారు.
వచ్చే నెల 26వ తేదీనే వివాహం కావాల్సి ఉండగా..!
ఇటీవలే టీటీడీ పాలక మండలి సభ్యులు, చెన్నై పారిశ్రామికవేత్త అయిన ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో చంద్ర మౌళికి నిశ్చితార్థం జరిగింది. జనవరి 26వ తేదీన వీరి వివాహం తిరుమలలోని శృంగేరి మఠంలో జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఇరుకుటుంబాలు వివాహ ఏర్పాట్లల్లో నిమగ్నం అయ్యి, శుభలేఖలను సైతం పంచతున్నారు. టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి దంపతులు హైదరాబాదులోని తమ బంధువులకు వివాహ పత్రికలు అందించేందుకు వెళ్లారు. చంద్రమౌళి కూడా చెన్నై ఆళ్వారుపేటలోని బంధువులకు పెళ్లి పత్రికలు ఇచ్చేందుకు పయనం అయ్యారు. అయితే కారులో ఉండగానే ఆయనకు గుండెనొప్పి వచ్చింది. అదే విషయాన్ని పక్కనే ఉన్న స్నేహితుడికి చెప్పగా.. నేరుగా కారును దగ్గరలోని కావేరి ఆసుపత్రి తరలించి చికిత్స అందించారు.
కర్నూలు స్వగ్రామంలో అంత్యక్రియలు..
విషయం తెలుసుకున్న టీటీడీ ఈవో దంపతులు హైదరాబాదు నుండి నేరుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రికి చేరుకున్నారు. ఇంకొన్నాళ్లలో పెళ్లి చేసుకొని హాయిగా గడపాల్సిన కుమారుడు గుండెపోటుకు గురై ఆసుపత్రి మంచంపై పడి ఉండడాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. గత మూడు రోజులుగా మృత్యువుతో పోరాడిన చంద్రమౌళి బుధవారం ఉదయం చనిపోయారు. కళ్ల ముందే కొడుకు మృతి చేందడంతో ధర్మారెడ్డి దంపతులు తీవ్ర శోక సంద్రంలో నిండి పోయారు. అయితే చంద్రమౌళి పార్ధివ దేహాన్ని కర్నూలుకు తీసుకెళ్లి ధర్మారెడ్డి సొంత గ్రామంలో అంత్యక్రియలు చేయనున్నారు.
ప్రముఖుల సంతాపం
చంద్రమౌళి మరణవార్త తెలుసుకొని రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ట్వీట్‌లు చేస్తున్నారు.
టీటీడీ ఈఓ ధర్మారెడ్డి గారి కుమారుడు చంద్రమౌళి గారి అకాల మరణం తీవ్ర విషాదకరం. ఈ వార్త తెలిసి దిగ్బ్రాంతికి గురయ్యాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. చంద్రమౌళి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను.
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 21, 2022
బాధాకరం!
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) December 21, 2022
టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారి కుమారుడు మౌళి గారు చిన్న వయసులో గుండె పోటుతో మృతి చెందడం అత్యంత బాధాకరం.వారి మరణం పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని,వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.🙏 pic.twitter.com/11kxyq6LNI