Journalist శశిధర్ మృతిపై న్యాయ విచారణ జరిపించండి - జాయింట్ కలెక్టర్‌కు జర్నలిస్టుల వినతిపత్రం
Journalist Shasidhar's death Case: జరల్నిస్టు శశిధర్ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని జాయింట్ కలెక్టర్ బాలాజీని కలిసి జర్నలిస్టులు వినతిపత్రం సమర్పించారు.
Journalist Shasidhar's death Case: సీనియర్ జర్నలిస్ట్ శశిధర్ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని తోటి పాత్రికేయులు కోరుతున్నారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ బాలాజీని కలిసిన జర్నలిస్టులు ఆయనకు వినతి పత్రం సమర్పించారు. సీనియర్ జర్నలిస్ట్ బి.ఎం శశిధర్ ను పోలీసులు గత నెల ఒక కేసులో అరెస్ట్ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరపరిచారు. జర్నలిస్ట్ శశిధర్‌కు 15 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను తిరుపతి సబ్ జైలుకు తరలించారు.
ఏ కేసులోనైనా నిందితులను మొదట ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయిస్తారు. కానీ ఈ కేసులో మాత్రం పలు దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉన్న శశిధర్‌ను ఆసుపత్రికి తరలించాల్సింది పోయి నేరుగా రిమాండ్ కు తరలించడంతో ఆ జర్నలిస్ట్ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. 15 రోజుల తర్వాత రిమాండ్ పొడిగించడంతో తిరుపతి నుంచి చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురైన శశిధర్ ఐదు రోజుల పాటు ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేశారు. ఈ విషయాన్ని జైలు అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. శశి ఆరోగ్యం మరింతగా క్షిణించి ఆయన పరిస్థితి విష మించడంతో తిరుపతి సిమ్స్ కు పంపించేశారు. సకాలంలో వైద్యం అందక పోవడంతో శశిధర్ శరీరం వైద్యానికి సహకరించడం లేదని సిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో నవంబర్ 8న శశిధర్ మృతి చెందారు.
శశిధర్ పై కేసు బనాయించడం, ఆపై ఆయన చనిపోవడం ఈ మొత్తం పరిణామాలపై అయన అరెస్టు నుంచి మృతి వరకు జరిగిన సంఘటనలపై న్యాయ విచారణ కోరారు తోటి జర్నలిస్టులు. ఈ వ్యవహారంలో పోలీసులు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, జైలు అధికారుల పాత్రపై న్యాయ విచారణ జ్యుడీషియల్ ఎంక్వైరీ కోరుతూ తిరుపతికి చెందిన పలువురు పాత్రికేయులు సోమవారం జిల్లా సంయుక్త కలెక్టర్ బికే బాలాజీకి వినతి పత్రం అందించారు. శశిధర్‌కు జరిగిన అన్యాయాన్ని జాయింట్ కలెక్టర్ కు వివరించారు. అన్ని విషయాలు విన్న జాయింట్ కలెక్టర్ బాలాజీ కేసు పూర్తి వివరాలు పరిశీలించి శశిధర్ కు జరిగిన అన్యాయం మరెవరికి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.
జిల్లా కలెక్టర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే వారితో సమావేశమై చర్చించి న్యాయవిచారణ జరిపిస్తామని జేసీ చెప్పారు. మూడు, నాలుగు రోజుల్లో కలెక్టర్ తో మాట్లాడి పాత్రికేయులను పిలిపించి సమావేశం ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు శ్రీధర్ ఏబీఎన్ దినేష్, కె గిరిబాబు, గోపి లతోపాటు ప్రెస్ క్లబ్ కార్యదర్శి బాలచంద్ర, జర్నలిస్టులు తులసి రామ్, ఓం శేఖర్, మాచర్ల శ్రీనివాస్, వర ప్రసాద్ చెంచయ్య నటరాజ్ గిరిధర్ చరణ్ మూర్తి, గురవారెడ్డిలు పాల్గొన్నారు.